మళ్లీ మల్లేశ్‌కే డీసీసీ పగ్గాలు!


సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) సారథిగా క్యామ మల్లేశ్  మరోసారి నియమితులయ్యారు. డీసీసీ అధ్యక్షుడిగా ఆయనను నియమిస్తూ గురువారం ఏఐసీసీ ఉత్తర్వులు జారీచేసింది. సార్వత్రిక ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నుంచి అసెంబ్లీ బరిలో నిలిచిన మల్లేశ్‌ను జోడు పదవుల నేపథ్యంలో డీసీసీ నుంచి తప్పించింది. దీంతో చేవెళ్ల టికెట్‌ను ఆశించి భంగపడ్డ పడాల వెంకటస్వామికి ఎన్నికల వేళ ఈ పదవిని కట్టబెట్టారు.  ఎన్నికలు పూర్తికావడం... పార్టీ ఘోరపరాజయం చ విచూసిన నేపథ్యంలో పడాలకు ఉద్వాసన పలికి, తిరిగి క్యామకే డీసీసీ పగ్గాలను అప్పగించాలనే నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతుంది.



 అదే సమయంలో ఈ నెల 24,25వ తేదీల్లో ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడలోని శ్రీ ఇందూ కాలేజీలో ‘మేధోమథనం’ సదస్సును నిర్వహిస్తుండడం... అతిరథమహారథులు వస్తున్న ఈ సదస్సును ప్రతిష్టాత్మకంగా భావించిన పీసీసీ... సీనియర్ అయిన మల్లేశ్‌ను కొత్త అధ్యక్షుడిగా ప్రకటించేందుకు మొగ్గు చూపినట్లు కనిపిస్తోంది. కాగా, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం విధానాలపై ఆందోళనలు చేస్తామని, రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో ఆ పార్టీ అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా త్వరలోనే ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తామని క్యామ అన్నారు.



జిల్లావ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా అధికారపార్టీకి చీమకుట్టినట్లయినా లేకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. పార్టీకి పూర్వవైభవం తె చ్చేందుకు, సంస్థాగతంగా పటిష్టం చేసేందుకు త్వరలోనే జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహిస్తానని, ముఖ్యనేతల సలహాలు, సూచనలు పాటిస్తూ పార్టీని బలోపేతం చేస్తానని అన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top