బాబుగారి జగ్గారెడ్డి పార్టీ.....

బాబుగారి జగ్గారెడ్డి పార్టీ..... - Sakshi


హైదరాబాద్ : మెదక్ ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ, టీఆర్ఎస్ విమర్శలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఇరుపార్టీలు పరస్పర ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. తాజాగా బీజేపీపై మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. భారతీయ జనతా పార్టీ అంటే బాబుగారి జగ్గారెడ్డి అని ఆయన ఎద్దేవా చేశారు. నిన్నటిదాకా కాంగ్రెస్ విధానాలనే కొనితెచ్చుకున్న ఆ పార్టీ .... గతిలేక అభ్యర్థిని కూడా అక్కడ నుంచే తెచ్చుకుందని కేటీఆర్ విమర్శించారు. అందుకు వారు ఆత్మవిమర్శ చేసుకోవాలని సలహా ఇచ్చారు. గతంలో సంగారెడ్డిలో లక్ష మెజార్టీ రాకుంటే రాజకీయ సన్యాసం చేస్తానన్న జగ్గారెడ్డి ...ఈసారి డిపాజిట్ తెచ్చుకుంటే గొప్పే అని కేటీఆర్ సవాల్ విసిరారు. జగ్గారెడ్డికి ఈసారి  మెదక్ ప్రజలు గుండు కొట్టించి పంపుతారని ఆయన వ్యాఖ్యానించారు.



కాగా మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా టీఆర్ఎస్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ నేతలు బీజేపీపై సంస్కరాహీనంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సమైక్యవాదులను టీఆర్ఎస్లో చేర్చుకోవటం ఏం నైతికత అని ప్రశ్నించారు. 2004లో జగ్గారెడ్డికి టీర్ఎస్ ఎందుకు టికెట్ ఇచ్చిందని సూటిగా ప్రశ్నించారు. వాపును చూసి టీఆర్ఎస్ బలుపు అనుకుంటుందన్నారు. మూడు నెలల అధికారంతోనే అహంకారాన్ని ప్రదర్శిస్తోందని కిషన్ రెడ్డి విమర్శలు చేశారు.  దమ్ముంటే సెప్టెంబర్ 17న గోల్కొండ కోటపై త్రివర్ణ పతాకం ఎగురవేయాలని సవాల్ విసిరారు.  కుటుంబ పాలన కేవలం నిజాం రాచరిక పాలనేలో ఉండేదని... టీఆర్ఎస్ లాంటి పార్టీలను దేశంలో బీజేపీ చాలా చూసిందని కిషన్ రెడ్డి అన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top