కుంతియాకు ఆ అధికారం లేదు..

కుంతియాకు ఆ అధికారం లేదు.. - Sakshi


నల్లగొండ: వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నాయకత్వంలోనే ముందుకెళ్తామని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి రామచంద్ర కుంతియా వ్యాఖ్యలతో కోమటిరెడ్డి సోదరులు విభేదించారు. 2019వరకూ పీసీసీ చీఫ్‌గా ఉత్తమ్‌ కొనసాగుతారని చెప్పే అధికారం కుంతియాకు లేదని వారు స్పష్టం చేశారు. దీనిపై త్వరలో పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీని కలుస్తామన్నారు. యువకుల నాయకత్వంలోనే కాంగ్రెస్‌ ముందుకు వెళుతుందని కోమటిరెడ్డి సోదరులు అభిప్రాయపడ్డారు.



త్వరలోనే సోనియా, రాహుల్‌ను కలుస్తాం

తెలంగాణ వ్యవహారాల కాంగ్రెస్‌ ఇంచార్జి ఆర్‌సీ కుంతియా వచ్చి చెప్పినంత మాత్రాన అయ్యేదేమీలేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ..కార్యకర్తలు, జనాలకు దగ్గరగా ఉండే నాయకుల నాయకత్వం కోరుకుంటున్నారని పరోక్షంగా పీసీసీ నాయకత్వ మార్పు మాట్లాడారు.


తొందర్లోనే రాహుల్‌, సోనియా గాంధీలను కలిసే అవకాశముందని, కార్యకర్తలు ఎవరూ నిరాశ చెందవద్దని కోరారు. త్వరలోనే యువరక్తం ఉన్న నాయకుల నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీ ముందుకు వెళ్తుందని చెప్పారు. ప్రభుత్వం మూడున్నరేళ్లుగా భర్తీ చేయలేని ఉద్యోగాలను ఒక్క ఏడాదిలో ఎలా భర్తీ చేస్తుందని ప్రశ్నించారు. వెంటనే లక్ష ఉద్యోగాల భర్తీ చేపట్టాలని డిమాండ్‌ చేశారు.



అధిష్టానానిదే తుది నిర్ణయం

తెలంగాణ వ్యవహారాల కాంగ్రెస్‌ ఇంచార్జి ఆర్‌సీ కుంతియాపై కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. భువనగిరిలో విలేకరులతో మాట్లాడుతూ.. 2019 వరకూ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతారని అనే అధికారం కుంతియాకు లేదని, ఆ వ్యవహారం అధిష్టానం చూసుకుంటుందని అన్నారు. హైకమాండ్‌కు ప్రస్తుత నాయకత్వం నచ్చకపోతే ఎన్నికల్లోగా మార్చవచ్చునని అభిప్రాయపడ్డారు.


కేసీఆర్‌ ఒక నయీంను చంపి వంద నయీమ్‌లను సృష్టించాడని ఆరోపించారు. వినాశకాలే విపరీతబుద్ధి అన్నట్లుగా కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వెంటనే నయీం కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌ చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తే భువనగిరి నుంచే ఉద్యమాన్ని ప్రారంభిస్తామని హెచ్చరించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top