నేను సీఎం అయ్యేది ఖాయం

నేను సీఎం అయ్యేది ఖాయం - Sakshi

సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

 

నల్లగొండ టూటౌన్‌: టీపీసీసీ చీఫ్‌ కొనసాగింపుపై కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి కుంతియా మాటలు నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నల్లగొండలో బుధవారం ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించి మాట్లాడారు. కుంతియా మాటలతో కాంగ్రెస్‌ శ్రేణులు, నాయకులు అసంతృప్తి చెందవద్దని, టీపీసీసీ చీఫ్‌ పదవిని యువ రక్తానికి ఇవ్వాలని సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలను కలసి కోరుతామన్నారు. తాను తెలంగాణ రాష్ట్రానికి సీఎం అవడం ఖాయమని, ఎప్పుడనేది మాత్రం చెప్పలేనన్నారు.



సీఎం కేసీఆర్‌ నిరుద్యోగులను జాతీయ జెండా సాక్షిగా మరోసారి మోసం చేశారని ఆరోపించారు. మూడున్నరేళ్లలో 10 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదని, ఇప్పుడు మరోసారి లక్ష ఉద్యోగాలు అంటూ సీఎం మోసపూరిత మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ దుర్మార్గపు, అవినీతి పాలనను అంతమొందించి కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తెస్తామన్నారు. రాష్ట్ర అభివృద్ధి మరిచి కాంగ్రెస్‌ను దూషించడం, కోదండరాం యాత్రను అడ్డుకోవడం లాంటి చర్యలు సహించరానివన్నారు.  

 

ఆయనకు ఆ అధికారం లేదు..

సాక్షి, యాదాద్రి : రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జిగా 2019 వరకు తానే ఉంటానని ఏఐసీసీ కార్యదర్శి కుంతియాకు ప్రకటించుకునే అధికారం లేదని నల్లగొండ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కుంతియా తనతోపాటు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌ 2019 వరకు ఉంటారని చెప్పడం వెనుక కుట్ర దాగి ఉందన్నారు. ఈ విషయాన్ని ఆయన వెనుక ఉండి ఎవరో చెప్పిస్తున్నారని ఆరోపించారు. 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top