రాష్ట్రంలో దిక్కుమాలిన పాలన

రాష్ట్రంలో దిక్కుమాలిన పాలన - Sakshi


3 నుంచి కిషన్‌రెడ్డి మహా పాదయాత్ర

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి

కంతనపల్లి వద్ద బీజేపీ బృందం పర్యటన

 


ఏటూరునాగారం : తెలంగాణకు తలమానికమైన కంతపల్లి ప్రాజెక్ట పనులను స్లో డౌన్  (కాలక్రమేణా నిలుపుదల)కు ప్రభుత్వం యత్నిస్తోందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో దిక్కుమాలిన పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. తెలంగాణలో దేవాదుల, కంతనపల్లి ప్రాజెక్టులు రైతులకు వందశాతం ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 3 నుంచి కంతనపల్లి - దేవాదుల వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మహా పాదయాత్ర చేపడుతున్నారని తెలిపారు. మండలంలోని కంతనపల్లి ప్రాజెక్టు పనులు, పాదయాత్ర ఏర్పాట్లను బీజేపీ రాష్ట్ర నాయకుల బృందం ఆదివారం పరిశీలించింది. అనంతరం విలేకరులతో ప్రేమేందర్‌రెడ్డి మాట్లాడారు. నీళ్లు, నిధులు, ఉద్యోగ నియామకాల కోసమే తెలంగాణ సాధించుకున్నామని, కానీ, వీటిపై కేసీఆర్ సర్కారు కంటితుడుపుగానే వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. పాత ప్రాజెక్టులు పూర్తి చేయకుండా కొత్తవాటికి శ్రీకారం చుట్టడం అర్థరహితమన్నారు. దేవాదుల నీటితో ఒక్క ఎకరాన్నీ తడపలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. 2009లో దివంగత సీఎం వైఎస్సార్ శంకుస్థాపన చేసిన కంతనపల్లిపై సర్కారు ముందుకు వెళ్లడం లేదని విమర్శించారు. కంతనపల్లిని దెబ్బతీసేందుకే దేవాదుల వద్ద దుర్గం గుట్ట ఆనకట్టను తెరపైకి తెచ్చి రూ. 64 లక్షలు మంజూరు చేసిందని ఆరోపించారు.

 

ఇలాగైతే వందేళ్లరుునా పూర్తికాదు..

కంతనపల్లిలో రెండు పొక్లెయిన్లు, 200ల మంది కూలీలతో పనులు చేయిస్తే వందేళ్లరుునా పనులు పూర్తికావని పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మూర్తినేని ధర్మారావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రలో బహుళార్థక ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి చేయడానికి రూ. 50 వేల కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కార్యచరణ అమలు చేయడం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, ములుగు కన్వీనర్ చింతలపుడి భాస్కర్‌రెడ్డి, నాయకులు చింతకుల సునీల్, నరహరి వేణుగోపాల్‌రెడ్డి, నాగపురి రాజమౌళి, దొంతి దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top