ప్రజాస్వామ్య రాష్ట్రమా..? పోలీసు రాజ్యమా..??


చర్ల: ‘‘నక్సలెట్ల ఎజెండానే మా ఎజెండా అని చెప్పుకుని అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్... అమాయకుల పై కాల్పులు జరిపిస్తోంది. ఇది ప్రజాస్వామ్య రాష్ట్ర మా... లేక, పోలీసు రాజ్యమా..?’’ అని, మావోయిస్టు పార్టీ జిల్లా కమిటీ కార్యదర్శి కిరణ్ ప్రశ్నించారు. ఆయన పేరిట ఒక లేఖ ఆదివారం పత్రికలకు అందింది. దోశిళ్లపల్లిలో పోలీసుల కాల్పులను ఆయన తీవ్రంగా ఖండించారు.



ఈ లేఖలో ఇలా ఉంది:

‘‘చర్ల మండలంలోని దోశిళ్లపల్లికి చెందిన గిరిజనులు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా.. కూంబింగుకు వెళ్తున్న పోలీసులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గాయపడిన కారం నర్సింహారావు హైదరాబాదులోని ఆస్పత్రిలో మృతి చెందాడు. ఆ ద్విచక్ర వాహనంపై ఉన్న కనితి సత్తిబాబు పారిపోతుంటే పోలీసులు వెంబడించి పట్టుకుని అదుపులో ఉంచుకున్నారు. ఈ కాల్పుల ఘటనను ఎదురు కాల్పులుగా చిత్రీకరించేందు కోసం అప్పటికప్పుడు కిట్ బ్యాగులు, విప్లవ సాహిత్యం,  తదితరాలను తెప్పించి కాల్పులు జరిపిన స్థలంలో పెట్టారు.



నక్సలైట్లను చంపితే లక్షల రూపాయలు ఇస్తామని పాలకులు ప్రకటించారు. దీంతో, పోలీసులు అమాయకులను హత్య చేసి, ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరించి శవాలపై పైసలు ఏరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రక్తపు కూడు తినమరిగిన నర హంతకులు.. అమాయకులను కాల్చుతున్నారు. గతంలోనూ ఇదే మండలంలో రాత్రి సమయంలో ప్రయాణిస్తున్న ఆదివాసీలపై కాల్పులు జరిపి ఒకరిని హత్య చేశారు.



చర్ల ఎస్సై, సీఐ నాయకత్వంలో నాలుగు ఘటనలు జరిగారుు. మేము ఏమి చేసినా అడిగే వారు లేరని విర్రవీగుతూ ఇష్టం వచ్చినట్టుగా ప్రజలపై కాల్పులు జరిపి చంపుతున్నారు. ఆదివాసీలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇక ముందు ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే.. ఈ హంతకులకు శిక్ష పడేలా ఆదివాసీలకు ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు అండగా నిలవాలి’’.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top