రామా.. కనవేమిరా..!

రామా.. కనవేమిరా..!


ఖమ్మం జిల్లాను చుట్టుముట్టిన కరువు

వట్టిపోయిన చెరువులు, కుంటలు.. తాగునీటికి కటకట

ఉపాధి లేక వలస బాట పట్టిన గిరిజనులు, ఆదివాసీలు


 

 చెరువులు, వాగులు, వంకలు, తోగులు ఎండిపోయూరుు.. నాగార్జున సాగర్ జలాలు రాక ఆయకట్టు బీడుగా మారింది.. కిన్నెరసాని కళ తప్పింది.. ఎటుచూసినా ఖమ్మం జిల్లాను కరువు కమ్మేసింది! పల్లె ప్రజలు, ఆదివాసీ గూడేలు, గిరిజన తండాల వారు కిలోమీటర్ల కొద్దీ వెళ్లి మంచినీటిని తెచ్చుకుంటున్నారు. వ్యవసాయ, మంచినీటి బావులు అడుగంటాయి. పశువులకు నీళ్లు లేక, గ్రాసం కానరాక. కబేళాలకు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఏజెన్సీలో పనులు దొరక్క, గూడేల్లో ఉండలేక మూటాముల్లె సర్దుకొని ఆదివాసీలు వలసబాట పడుతున్నారు. జిల్లాలో కరువుపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం...   

 - బొల్లం శ్రీనివాస్, సాక్షి ప్రతినిధి, ఖమ్మం

 

 గండ కరువు

 గుండె పగిలి బతుకులు ఆగమైపోతున్నయి ఊళ్లో పూటగడవక మనసులు కాలీచేసి శోకమై పోతుండ్రు పొట్ట తిప్పలకు జెరిపోతులాట మనుషులు నగరబాట పట్టిండ్రు చెవి మీద పేను పారదు దయధర్మము లేని ప్రభుత సచ్చినంక ఇచ్చే పరిహారం నిన్నే పరిహసిస్తున్నది..

 ప్రశ్నిస్తున్నది!!

     - జూకంటి జగన్నాథం

 

 కిన్నెరసానిలో చుక్క లేదు..

 వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం బంధాల అడవుల్లో పుట్టే కిన్నెరసాని ఖమ్మం జిల్లాలోని గుండాల, కొత్తగూడెం, పాల్వంచ, బూర్గంపాడు మండలాల్లో ప్రవహించి గోదావరిలో కలుస్తుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి కిన్నెరసాని పూర్తిగా ఎండిపోయింది. దీంతో నాలుగు మండలాల్లోని ఆదివాసీ గూడేల్లో మంచినీటి బావులు, చేతి పంపులు ఎండిపోయాయి. గ్రామాల నుంచి నాలుగైదు కిలోమీటర్లు నడిచి కిన్నెరసాని చెలిమల్లో ఆదివాసీలు, గిరిజనులు మంచినీళ్లు తెచ్చుకుంటున్నారు. కిన్నెరసాని ప్రవాహం లేకపోవడంతో రిజర్వాయర్‌లో మొత్తం నీటిమట్టం 407 అడుగులు కాగా ప్రస్తుతం 392 అడుగులకు పడిపోయింది.

 

 గ్రాసం లేక గోస..

 మన్యం మండుతుండడంతో అడవిలోని వాగులు, వంకల్లో చుక్కనీరు లేకుండా పోయింది. కిన్నెరసాని అడుగంటుతుండటంతో వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలో నీటి ఊట రాక.. జంతువులకు నీళ్లు కరువయ్యాయి. ఈ కేంద్రంలో 150 జింకలు, వేల సంఖ్యలో కోతులు, ఇతర పక్షులున్నాయి. గ్రాసం లేక ఇవన్నీ అలమటిస్తున్నాయి. పచ్చిక బయళ్ల నుంచి తెచ్చిన గ్రాసాన్ని జింకలకు పెడుతున్నారు. ఇక గడ్డి, నీళ్లు లేక ఆదివాసీలు పశువులను అడవికి వదిలారు. మరికొందరు మరో గత్యంతరం లేక పశువులను కబేళాలకు అమ్ముకుంటున్నారు. జిల్లాలో ప్రాచుర్యం పొందిన కామేపల్లి మండలం పండితాపురంలోని శ్రీకృష్ణప్రసాద్ సంతలో ప్రతి బుధవారం దాదాపు 10వేల పశువుల విక్రయాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ నుంచి వచ్చిన కబేళా వ్యాపారులు వీటిని కొనుగోలు చేసి డీసీఎంలు, లారీల్లో కుక్కి పశువుల్ని తీసుకువెళ్తున్నారు. నీళ్లు, గడ్డి లేక మూగజీవాలను అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

 జీవం లేని జీవనది

 జీవనది గోదావరి ఎడారిలా మారిపోయింది. ఎటు చూసినా ఇసుక తిన్నెలే కనిపిస్తున్నాయి. భద్రాచలం వద్ద సోమవారం అతి తక్కువగా 3.5 అడుగుల నీటిమట్టం నమోదైంది. మే నెల లో ఇంత తక్కువగా నీటిమట్టం నమోదుకావటం గతంలో ఎన్నడూ లేదని అంటున్నారు. గోదావరిలో ప్రస్తుతం ఏదో ఒక మూలన చిన్నపాటి పాయలా నీళ్లు పారుతున్నాయి. నదిలో నీళ్లు అడుగంటడంతో పరీవాహక బోరుబావులపై ప్రభావం పడింది. భూగర్భ జలాలు దారుణంగా పడిపోయాయి. గోదారి తీర ప్రాంత గ్రామాలకు సైతం ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయాల్సిన దుస్థితి నెలకొంది.

 

 10 మీటర్ల లోతుకు  భూగర్భ జలాలు..

 జిల్లాలో సగటున 10.07 మీటర్ల లోతుకు భూగర్భజలాలు పడిపోయాయి. ఈ నెలలో వర్షం పడకపోతే 12 మీటర్లకు పడిపోయే ప్రమాదం కనిపిస్తోంది. గతేడాది మార్చిలో 9 మీటర్ల లోతులోనే భూగర్భ జలాలు ఉన్నాయి. అన్నపురెడ్డిపల్లిలో 16 మీటర్లు, బనిగండ్లపాడులో 11.40 మీటర్లు, కొత్తలింగాలలో 11.55 మీటర్లు, కూసుమంచిలో 14.84 మీటర్లు, ఎంపీ బంజరలో 13.30 మీటర్లు, రావికంపాడులో 13.95 మీటర్ల లోతులోకి భూగర్భజలాలు  పడిపోయాయి.

 

 ఒక్క బావి 50 మోటార్లు

  గుండాల మండలంలోని చీమలగూడెంలో నివసిస్తున్న 150 కుటుంబాలకు ఇదొక్కటే మంచినీటి బావి! మంచినీటిని తోడేందుకు ఇలా 50 మోటార్లు పెట్టారు. నీటి ఊట తగ్గడంతో గ్రామం అంతా మంచినీటి కోసం ఇబ్బంది పడుతోంది. పాల్వంచ మండలంలోని బంజరలో కూడా ఇదే పరిస్థితి. ఇక్కడ 50 కుటుంబాలు ఉండగా.. గ్రామంలో ఉన్న బావి ఎండిపోయింది. ఊట ఎప్పుడు వస్తే అప్పుడు మోటార్ల ద్వారా నీటిని  తోడుకొని గిరిజనులు గొంతు తడుపుకుంటున్నారు.

 

 కూలి లేని ‘ఉపాధి’..

 జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద 2.50 లక్షల మందికి జాబ్‌కార్డులు ఉన్నాయి. పనులు కొనసాగుతున్నా..రెండున్నర నెలలుగా వీరికి కూలి చెల్లించడం లేదు. జిల్లావ్యాప్తంగా రూ.25 కోట్ల వేతనం నిధులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక తునికాకు సేకరణ ద్వారా ఆదివాసీలు, గిరిజనులకు నెలన్నర పాటు పని దొరుకుతుంది. ఈసారి వర్షాభావంతో తునికాకు లేకపోవడంతో ఆదివాసీలు వారం రోజులే ఆకు సేకరించగలిగారు.

 

 ఊరచెరువు ఎండింది..

 గుండాల మండలంలోని జామరగూడెం, మటంలంక, పోతిరెడ్డిగూడెం, వేపలగడ్డ, కూనవారిగూడెం గ్రామాల్లోని వెయ్యి ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చే ఊరచెరువు ఇది.  ఎప్పుడూ ఎండని ఈ చెరువు ఈసారి  నైచ్చింది. రబీలో ఒక్క ఎకరం కూడా సాగులోకి రాలేదు.

 

 చెలిమలన్ని వెతికి..

 ఇల్లెందు, పాల్వంచ, భద్రాచలం ఏజెన్సీల్లోని ఆదివాసీ గూడేలు, గిరిజన తండాలు, గ్రామాల్లో మంచినీటి కష్టాలు అన్నీఇన్నీ కావు. గుండాల మండలంలోని కిన్నెరసాని ఒడ్డుకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే ఎలగలడ్డకు ఆదివాసీ కోయ కుటుంబాలు వలస వచ్చాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా కరువు నెలకొందని, మంచినీటి పెద్దబావి ఎండిందని వారు చెబుతున్నారు. ఇక్కడి 40 కుటుంబాలు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిన్నెరసానికి వెళ్లి చెలిమల నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఇవి కూడా ఎండిపోతే ఎటు పోవాలో తెలియని దుస్థితి. పాల్వంచ మండలంలోని సిర్తనిపాడులోని 30 ఆదివాసీ కుటుంబాలకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న తోగే దిక్కయింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top