దాశరథి పేరిట స్మారక పురస్కారం

దాశరథి పేరిట స్మారక పురస్కారం


 కృష్ణమాచార్య జయంతి సభలో సీఎం కేసీఆర్



హైదరాబాద్: ప్రముఖ కవి, సాహితీవేత్త దివంగత దాశరథి కృష్ణమాచార్య పేరిట స్మారక పురస్కారాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రకటించారు. ప్రతి సంవత్సరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన కవికి ఆ పురస్కారం రూపంలో రూ. లక్షా నూట పదహార్లు అందజేసి సత్కరిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఏదైనా విశ్వవిద్యాలయానికి లేదా ప్రముఖ విద్యాసంస్థకు ఆయన పేరు పెడతామని వెల్లడించారు. దాశరథి 89వ జయంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారిక కార్యక్రమంగా మంగళవారమిక్కడి రవీంద్రభారతిలో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..



ఇంతకాలం నిర్లక్ష్యానికి గురైన దాశరథి కృష్ణమాచార్య వంటి వారిని ఈ ప్రభుత్వం సమున్నతంగా గౌరవిస్తుందని చెప్పారు. నగరంలోని ముఖ్యమైన ప్రాంతంలో దాశరథి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నట్టు తెలిపారు. ఆయన కుమారుడికి ప్రభుత్వంలో మంచి ఉద్యోగం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. కాగా, రవీంద్రభారతిలో సరైన ఏర్పాట్లు లేవని, ఇకపై అలాంటి లోపాలు లేకుండా ప్రతి సంవత్సరం రూ.కోటి గ్రాంటును మంజూరు చేస్తామని సీఎం ప్రకటించారు.



 పనికిమాలిన విగ్రహాలెన్నో: సభావేదికపై కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను కొన్ని మాటలు మాట్లాడితే లొల్లి అయితది’ అంటూనే ట్యాంక్‌బండ్‌పై ఉన్న విగ్రహాల గురించి వ్యాఖ్యలు చేశారు. దాశరథికి విగ్రహం లేదనే సందర్భంలో మాట్లాడుతూ.. ‘‘చూస్తున్నరుగదా ట్యాంక్‌బండ్ మీద, చౌరస్తాలల్లో ఎన్నో పనికిమాలిన విగ్రహాలున్నై. అవి మనకు సంబంధించినవారివి కాదు. ఆ నాటకాలాయనతో మనకేం సంబంధం? పుస్తకంలో పాఠం చూసి.. బళ్లారి రాఘవ గురించి నాకేం అవసరం అని ఓ చిన్నపాప ఇటీవల అడిగింది’’ అని తెలిపారు. తెలంగాణ సంస్కృతిని ఎవరైనా విమర్శిస్తే తగిన విధంగా సమాధానం చెబుతామని హెచ్చరించారు. విమర్శిస్తే మా వద్ద ‘రాళ్లబండి’ ఉంది (పక్కనే సాంస్కృతిక విభాగం సంచాలకులు రాళ్లబండి కవితాప్రసాద్ ఉన్నారు) అని చమత్కరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ప్రసాద రాజు, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి బి.పి.ఆచార్య, సాహితీవేత్తలు నందిని సిద్ధారెడ్డి, శ్రీనివాసాచార్య, దాశరథి కుమారుడు లక్ష్మణాచార్య పాల్గొన్నారు.



 గురుభక్తి చాటుకున్న కేసీఆర్: సీఎం సభావేదికపైకి వస్తుండగా ప్రముఖ సాహితీవేత్త తిరుమల శ్రీనివాసాచార్య కనిపించారు. వెంటనే కేసీఆర్ ఆయనకు పాదాభివందనం చేశారు. తాను దుబ్బాక పాఠశాలలో చదువుతున్నప్పుడు ఆయన తెలుగు బోధించేవారని తెలిపారు.

 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top