నియోజకవర్గ అభివృద్ధి కోసమే..

నియోజకవర్గ అభివృద్ధి కోసమే.. - Sakshi


* టీఆర్‌ఎస్‌లో చేరికపై ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి

* సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్న తీగల


మహేశ్వరం: నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీఆర్‌ఎస్ పార్టీలో చేరానని మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. బుధవారం మీర్‌పేట్‌లోని టీకేఆర్ కళాశాలలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ సమక్షంలో తీగల టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా తీగల మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సాయంతో మరిన్ని నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అన్నిరకాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పారు.



నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి కృష్ణానీరు అందించడానికి కృషి చేస్తానన్నారు. ప్రతి గ్రామంలో బీటీ, సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాలను చేపడుతానని చెప్పారు. మహేశ్వరం, రావిర్యాల, మంఖాల్ గ్రామాలకు భారీ పరిశ్రమలు తీసుకొచ్చి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా మండల కేంద్రంలో వంద పడకల ఆస్పత్రి నిర్మాణం చేపడుతానన్నారు. నియోజకవర్గంలోని పలు సమస్యలు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.

 

టీఆర్‌ఎస్‌లో పలువురి చేరిక

మండలంలోని పలు గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పీఏసీఎస్ డెరైక్టర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఎమ్మెల్యే తీగలతోపాటు టీఆర్‌ఎస్‌లో చేరారు. టీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో మహేశ్వరం సర్పంచ్ సూర్ణగంటి ఆనందం, సిరిగిరిపెరం సర్పంచ్ తడకల పోషయ్య, గొల్లూరు సర్పంచ్ మంద కవిత, హర్షగూడ సర్పంచ్ సాలీలక్ష్మణ్‌నాయక్, ఘట్టుపల్లి సర్పంచ్ కొరుపోలు రాకేష్‌రెడ్డి, సర్దార్‌నగర్ సర్పంచ్ తాళ్ల రాకేష్‌గౌడ్, తుమ్మలూరు ఎంపీటీసీ జి. నర్సింహ్మ యాదవ్, తుక్కుగూడ-2 ఎంపీటీసీ ఈదులకంటి అనసూయా, పీఏసీఎస్ డెరైక్టర్లు బవానీ ఉదయశ్రీ వెంకట్‌రెడ్డి,  సిరిగిరిపురం పీఏసీఎస్ డెరైక్టర్ హీర్యానాయక్, పార్టీ సీనియర్ నాయకులు చిరంజీవి గౌడ్, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి ఎడ్మ మోహన్‌రెడ్డి, కోళ్లపడకల్ మాజీ సర్పంచ్ నర్సింహ్మగౌడ్, శ్రీనివాస్‌చారి, మంద జంగయ్య, భాస్కర్‌రెడ్డి, పలువురు వార్డు సభ్యులు ఎమ్మెల్యే టీకేఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

 

తీగలకు తమ్ముళ్ల హ్యాండ్

తనతోపాటు భారీ ఎత్తున తెలుగు తమ్ముళ్లను టీఆర్‌ఎస్‌లోకి రప్పించడానికి తీగల ప్రయత్నాలు చేశారు. మొదట టీఆర్‌ఎస్‌లో చేరుతామని తీగలకు హామీ ఇచ్చిన నాయకులు చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చారు. అయితే ఇప్పటికే టీడీపీ నుంచి నాయకులు భారీ సంఖ్యలో టీఆర్‌ఎస్‌లో చేరారని, భవిష్యత్తులో ఆ పార్టీ నుంచి మరింత మంది కూడా గులాబీ గూటికి చేరుకుంటారని టీఆర్‌ఎస్ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. ఇక బుధవారం టీఆర్‌ఎస్‌లో చేరిన టీడీపీ నాయకులు కూడా సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకుందామని భావించారు. అయితే సమయాభావంతో కేసీఆర్ ముందుగానే వెళ్లిపోవడంతో తీగల సమక్షంలోనే టీఆర్‌ఎస్ కండువాలు కప్పుకొని సంతృప్తి చెందారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top