యాదగిరీశుడి సేవలో కేసీఆర్


యాదగిరికొండ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి, అమ్మవార్లను బుధవారం దర్శించుకున్నారు. మధ్యాహ్నం 12.06  నిమిషాలకు అయన ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈఓ, ఆర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు అర్చకులు ఆశీర్వచనం అందజేశారు. అదేవిధంగా సీఎం ఆండాళ్లమ్మ వారి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పలు అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

 

 గుట్ట సుందరీకరణకు సీఎం ప్రత్యేక శ్రద్ధ

 యాదగిరిగుట్ట దేవస్థానం సుందరీకరణకు సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో ఉన్నారని గుట్ట అభివృద్ధి మండలి సీఈఓ కిషన్‌రావు తెలిపారు. దేవస్థానం మాస్టర్‌ప్లాన్‌పై బుధవారం కొండపై జరిగిన ప్రత్యేక సమీక్ష సమావేశం అనంతరం సీఈఓ విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ స్థలం, దేవస్థానం స్థలం ఎంత ఉంది,  అటవీ శాఖ స్థలం ఎంత ఉందన్నా దానిపై వివరాలు అడిగి తెలుసుకున్నారని తెలిపారు. స్వామివారిని దర్శించుకున్న  భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా పనులు చేపట్టాలన్న దానిపై చర్చించినట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ వచ్చిన ఆలోచనలకు తగిన సలహాలు సూచనలు ఎవరు ఇస్తారో అటువంటి వారిని ఎంపిక చేసుకుని   అతి త్వరలో మరో ప్రత్యేక సమావేశం  చేసుకుంటామని తెలిపారు.

 

 సురేంద్రపురిలో సీఎంకు ఘన స్వాగతం

 వడాయిగూడెం(భువనగిరి అర్బన్) :  యాదగిరిగుట్ట పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్‌కు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. సురేంద్రపురి పక్కన ఏర్పాటు చేసిన హెలిపాడ్‌లో సీఎం హెలికాప్టర్ ఉదయం 11.54 నిలకు ల్యాండ్ అయింది. సీఎం వెంట మంత్రి జగదీష్‌రెడ్డి వచ్చారు. అనంతరం వెంటనే  తన కాన్వాయ్‌లో యాదగిరిగుట్టకు బయలు దేరారు. మధ్యాహ్నం 1.56 గంటలకు తిరిగి హెలిపాడ్ వద్దకు  చేరుకుని మెదక్‌జిల్లా ఘన్‌పూర్‌కు వెళ్లారు. స్వాగతం పలికిన వారిలో  కలెక్టర్ చిరంజీవులు, శాసనసమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్యే వేముల వీరేశం, జెడ్పీటీసీలు బొట్ల పరమేశ్వర్, కర్రెకలమ్మ, ఎంపీపీలు గడ్డమీది స్వరూప, అనసూర్య, నాయకులు గొంగిడి మహేందర్‌రెడ్డి, ఆకవరం మోహన్‌రావు  తదితరులు ఉన్నారు. పర్యటన సందర్భంగా పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ ప్రభాకర్‌రావు, డీఎస్పీ మోహన్‌రెడ్డి సీఐలు సతీష్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, నర్సింహరెడ్డి, శంకర్‌గౌడ్ బందోబస్తును పర్యవేక్షించారు.

 

 పక్కాప్లాన్‌తో ముందుకు

 భువనగిరి : యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కాప్రణాళిక తో ముందుకు సాగుతున్నారు. బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించడం..యాదగిరిగుట్ట డెవలప్‌మెంట్ అథారిటీ నియమించడం...750 కోట్ల నిధులతో దివ్యక్షేత్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించడం చూస్తుంటే...సీఎం కేసీఆర్ యాదగిరిగుట్టకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థమవుతుంది. బుధవారం శ్రీలక్ష్మీనారసింహుడిని సందర్శించుకున్న ఆయన అధికారులతో కూడా సమీక్ష జరిపారు. కొండపై చేపట్టాల్సిన పనులపై  వారికి దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా నాలుగంచెల్లో యాదగిరి క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని, ఇందుకోసం ఆగమ, వాస్తు శాస్త్రాల ప్రకారం భక్తుల మనోభావాలకు అనుగుణంగా పనులు చేపట్టాలని సూచించారు.

 

 సీఎం రాకతో భక్తుల ఇబ్బందులు

 యాదగిరికొండ : ముఖ్యమంత్రి కేసీఆర్ యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనర్సింహస్వామి దర్శనానికి వచ్చిన సమయంలో భక్తులు ఇబ్బందులు పడ్డారు. సీఎం రాకకు ముందు పోలీసులు ఆలయ పరిసరాలన్నింటినీ తమ అదుపులోకి తీసుకున్నారు. ఎవరినీ కొండపైకి రానివ్వలేదు. ఎటువంటి వాహనాలనూ కొండపైకి అనుమతివ్వలేదు. భక్తులు వాహనాలను కొండకింద నిలిపివేసి నడుచుకుంటూ కొండపైకి చేరుకున్నారు. ఉదయం 7 గంటల నుంచే కొండపై పోలీసుల హడావిడి మొదలైంది. ఆలయ  పరిసరాలలో సైతం భక్తులను నడవనివ్వలేదు. దుకాణాలన్నింటినీ మూసివేశారు. ఉదయంనుంచి సీఎం కే సీఆర్ వచ్చి వెళ్లేంత వరకు భక్తులకు ఎటువంటి దర్శనాలకు అనుమతివ్వలేదు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అసహనం వ్యక్తం చేశారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top