రెడ్డి రాజులు అన్నం పెడితే.. ఆంధ్ర రాజులు ఆగం చేసిండ్రు

రెడ్డి రాజులు అన్నం పెడితే.. ఆంధ్ర రాజులు ఆగం చేసిండ్రు - Sakshi


* తెలంగాణ చరిత్ర పట్ల సమైక్య పాలకులు వివక్ష చూపారు

* చెరువుల్లో గుండ్లు ముంచి ఇక్కడి ప్రజలకు గుండ్లు కొట్టించారు

* నల్లగొండ జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్

* నకిరేకల్ మండలం చందుపట్ల ‘మిషన్’ పనుల్లో మట్టి ఎత్తిపోసిన సీఎం

* బోర్ల రాంరెడ్డి కుమారుడి వివాహానికి హాజరు

* అక్కడ రైతులతో కలసి భోజనం


 

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘ప్రతాపరుద్రుడి నుంచి రుద్రమదేవి వరకు 11వ శతాబ్దంలోనే ప్రపంచానికి వాటర్‌షెడ్ గురించి చెప్పిన రాచరిక చరిత్ర మనది. 900 ఏళ్ల క్రితమే కాకతీయ రెడ్డి రాజులు వర్రెలు, వంకలు, డొంకల్ల నీళ్లు ఆపుకొని భూగోళానికి పాఠాలు నేర్పిన ఘనత వహించిన రాజులు మన వాళ్లు. ఆ రాజులు తెలంగాణకు అన్నం పెడితే ఆంధ్ర రాజులు ఆగం చేసిండ్రు. అందుకే ఆ రాజుల్ని తలచుకుని వాళ్లకే దండం పెడితే బర్కత్ ఉంటుందని చెరువుల పునరుద్ధరణ కోసం మిషన్ కాకతీయ చేపట్టినం.’ అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. మిషన్ కాకతీయలో భాగంగా ఆదివారం ఆయన నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామంలోని చెరువు పూడికతీత పనులను  ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ చెరువు మట్టిని తవ్వి తట్ట ఎత్తి మట్టి పోశారు.

 

 అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ, ఈ చందుపట్ల చెరువులో గుండ్లు ఉండేవని, ఇప్పుడు ఆ గుండ్లు కన బడట్లేదని చెప్పారు. పశువులు కాసే పిల్లలకు వర్షం వచ్చినప్పుడు ఆ గుండే తలదాచుకునేందుకు అవకాశమిచ్చేదని, కానీ సమైక్య పాలనలో గుండ్లను ముంచి తెలంగాణ ప్రజలకు గుండ్లు కొట్టారని విమర్శించారు. 1974లో బచావత్ అవార్డు ప్రకారం తెలంగాణకు 175 టీఎంసీల గోదావరి, 93 టీఎంసీల కృష్ణా నీటిపై హక్కులిచ్చారని, కాకతీయుల నుంచి ఆసిఫ్‌జాహి నిజాంల వరకు అంత సామర్థ్యమున్న చెరువులను నిర్మించారు కాబట్టే ఆ మేరకు తెలంగాణకు హక్కులు వచ్చాయని అన్నారు. ‘ఈ 265 టీఎంసీల నీరు, తెలంగాణలోని 46 వేల చెరువుల్లో ఉంటే తెలంగాణకు కరువొస్తదా?’ అని కేసీఆర్ అన్నారు.

 

సమైక్య పాలనలో తెలంగాణ చరిత్ర పట్ల వివక్ష చూపారని ఆయన ఆరోపించారు. ‘కాకతీయ వంశానికి చెందిన రాణి రుద్రమదేవికి సేనాధిపతిగా పనిచేసిన మల్లిఖార్జున నాయుడుది చందుపట్ల గ్రామం. కాయస్తా అంబయ్య అనే రాజుతో యుద్ధం చేసి తన రక్తాన్ని రాణి రుద్రమ ధారపోసింది కూడా ఇక్కడే. దాని గుర్తుగానే ఇక్కడ శిలాశాసనం కూడా ఉంది. ఆ తర్వాత విగ్రహం కూడా బయటపడింది. ఇంత గొప్ప ప్రదేశాన్ని వెలుగులోనికి రానీయలె. అంత మరుగున పడిపోయింది మన చరిత్ర.’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చందుపట్ల చెరువుకు ఇప్పటికే మంజూరు చేసిన రూ.55 లక్షలకు తోడు మరో కోటిన్నర కలిపి మొత్తం రెండు కోట్లు మంజూరు చేస్తున్నామని సీఎం ప్రకటించారు. మళ్లీ తాను వచ్చినప్పుడు ఈ చెరువు బ్రహ్మాండంగా ఉంటే మరో రూ. 5 కోట్లు నకిరేకల్ నియోజకవర్గానికి బహుమతి ప్రకటిస్తానని చెప్పారు. అంతకుముందు నల్లగొండ పట్టణంలో రైతు బోర్లరాంరెడ్డి  కుమారుడు కృష్ణారెడ్డి వివాహానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. అక్కడ కొంత మంది రైతులతో కలసి ఆయన భోజనం చేశారు. ఈ సందర్భంగా వారి కష్టనష్టాలను అడిగి తెలుసుకున్న కేసీఆర్ వ్యవసాయంపై కొన్ని సూచనలు కూడా చేశారు.  

 

 ఆ అక్కలెక్కుండాలె

చందుపట్ల చెరువుకు ఎక్కువ నిధులు మంజూరు చేస్తున్నానని ముఖ్యమంత్రి చెబుతుండగానే ఓ మహిళ ఆ డబ్బులిస్తే నీళ్లే ములుపుతం అని గట్టిగా అరిచింది. దీన్ని గమనించిన కేసీఆర్ ‘అగో ఆ అక్కలెక్కుండాలె అందరు. అసుంటోళ్లు ఊరికి ఇద్దరుంటె ఏడికిపోయిన గెలిచొస్తా. ఇప్పుడు తెలంగాణకు తెగువ కావాలె. ఆడబిడ్డలు పిడికిలి ఎత్తితేనే మనకు న్యాయం జరుగతది.’అని అన్నారు. ఆమెను స్టేజిపైకి పిలిపించి ఆమెతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ పర్యటనలో విద్యుత్ శాఖ మంత్రి జి,జగదీశ్‌రెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి గ్యాదరి కిశోర్, ఎంపీ బూరనర్సయ్య గౌడ్, ఎమ్మెల్యేలు వేముల వీరే శం, పైళ్ల శేఖర్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీందర్, జిల్లా పరిషత్ చైర్మన్  ఎన్. బాలూనాయక్, జిల్లా పార్టీ అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నోముల నర్సింహయ్య, వేనేపల్లి చందర్‌రావు, మాజీ ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

 

కేసీఆర్ మార్కు ట్రీట్‌మెంట్

 చందుపట్ల సభలో ప్రసంగం ప్రారంభించగానే ఓ వ్యక్తి ఈలలు వేసి కేకలు పెట్టడాన్ని గమనించిన కేసీఆర్ తనదైన శైలిలో ఆయనకు ట్రీట్‌మెంట్ ఇచ్చారు. భానుచందర్ అనే ఆ వ్యక్తినుద్దేశించి మాట్లాడుతూ ‘ ఏ ఆగవయ్.. నీలొల్లి పాడువడ. పొద్దుయినంక కావాలె. అప్పుడే షెడిపోయినవా నువ్వు. ఏ ఆయన్ని ఈడకు పంపురి. ఆయన నా పాత దోస్తు. రానీయండి ఆయన్ను. నా దోస్తు ఇప్పుడు నాతో మాట్లాడడం లేదనుకున్నడేమో.. ఈ పోలీసులేమో రానీయరాయె. రానీయండి. ’ అని స్టేజి మీదకు పిలిపించారు. ఆయనను ఏమీ అనకుండా కూర్చోబెట్టాలని చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top