‘పాలమూరు’ ఖర్చు తగ్గించేదెలా?

‘పాలమూరు’ ఖర్చు తగ్గించేదెలా? - Sakshi


రూ.35 వేల కోట్లకు తగ్గించే మార్పులపై సీఎం సమీక్ష

వచ్చేనెల 11న శంకుస్థాపన చేసేలా చర్యలు

రోజువారీ పర్యవేక్షణకు పత్యేక అధికారి నియామకం


 

సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి తుదిరూపునిచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు తీవ్రం చేస్తోంది. కొత్త డిజైన్‌లో భాగంగా శ్రీశైలం నుంచి నీటిని తీసుకొనే క్రమంలో నిర్ణీత ఆయకట్టు దెబ్బతినకుండా, అంచనా వ్యయం పెరగకుండా ప్రాజెక్టు డిజైన్ ఖరారు చేసే యత్నాల్లో మునిగితేలుతోంది. ఇప్పటికే డిజైన్ ఖరారుపై పలు విడతలుగా స్వయంగా రిటైర్డ్ ఇంజనీర్లతో భేటీలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం మరోమారు అధికారులతో ఈ అంశమై అర్ధరాత్రి వరకు సమీక్ష నిర్వహించారు. కొత్త డిజైన్‌తో రిజర్వాయర్లు, లిఫ్టుల సంఖ్య పెరగడం, దీంతో తొలి డిజైన్ అంచనా రూ.32 వేల కోట్లను మించి రూ.42 వేల కోట్లకు చేరుతుండటంతో దాన్ని తగ్గించి రూ.35 వేల కోట్లకు పరిమితం చేసే ఇతర మార్గాలపై చర్చలు జరిపారు.  

 

 కాగా, ప్రాజెక్టుకు వచ్చే నెల 11న శంకుస్థాపన చేయాలని సీఎం నిర్ణయించినట్లు తెలిసింది. ఎమ్మెల్సీ ఎన్నికల విషయమై పార్టీ ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు శంకుస్థాపన తేదీపై మహబూబ్‌నగర్ జిల్లా నేతలకు కేసీఆర్ స్పష్టత ఇచ్చినట్లు తెలిసింది. నిజానికి ఈ ప్రాజెక్టును ఈనెల 31న ఆరంభించాలని నిర్ణయించిన విషయం విదితమే. పాలమూరును త్వరితగతిన పూర్తిచేసేందుకు వీలుగా, రోజువారీగా పనులను పర్యవేక్షించేందుకు నీటిపారుదలశాఖ రిటైర్డ్ ఇంజనీర్ రంగారెడ్డిని ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఈయన సీఎం ఓఎస్‌డీగా పనిచేస్తూ ప్రాజెక్టును పర్యవేక్షిస్తారు. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం జీవో జారీచేసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top