సహపంక్తి భోజనం సీక్రెట్ ఇదీ!

సహపంక్తి భోజనం సీక్రెట్ ఇదీ! - Sakshi


తెరాట్‌పల్లి గ్రామంలో దళితులతో సహపంక్తి భోజనాలు చేశామన్న బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా ఆ భోజనం ఎక్కడినుంచి తెప్పించుకున్నారో తెలుసా అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి ఆ భోజనాన్ని దళితుల ఇంట్లో వండించలేదని, అక్కడకు సమీపంలో ఉన్న కమ్మగూడెం అనే గ్రామంలో మనోహర్ రెడ్డి అనే వ్యక్తికి చెందిన మామిడి తోటలలో వండించారని ఆయన చెప్పారు. దీనిపై తెరాట్‌పల్లి దళితులు నిరసన వ్యక్తం చేశారన్నారు. తాను మాట్లాడేది తెరాట్‌పల్లి దళితులు కూడా చూస్తున్నారని, తాను తప్పు చెబితే వాళ్లు నన్ను అడగకుండా ఉంటారా అని ప్రశ్నించారు. అయినా తమకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.



వాళ్లు మంచిగా టేబుళ్ల మీద తింటూ ఫొటోలు తీయించుకుంటే.. చింతా సాంబమూర్తి అనే దళిత నాయకుడు మాత్రం వాళ్ల వెనకాల చేతులు కట్టుకుని నిలబడ్డారని కేసీఆర్ తెలిపారు. పెద్దదేవిపల్లికి నల్లగొండ అన్నపూర్ణ హోటల్ నుంచి భోజనం వెళ్లిందని, ఈరోజు (బుధవారం) మాత్రం ఒక దళిత నాయకుడి ఇంట్లో వండించుకుని తిన్నారని అన్నారు. దళితులతో భోజనం అంటే వాళ్ల ఇంట్లో వండిందే తినాలని, కానీ అమిత్ షా మాత్రం అలా కాకుండా బయటి నుంచి తెప్పించుకుని అక్కడ తిన్నారని చెప్పారు.



ఇక కోర్టు విభజన జరిగితే తప్ప రాష్ట్ర విభజన పూర్తయినట్లు కాదని చెబుతూ.. దానిపై తాము గత మూడేళ్లుగా సుప్రీంకోర్టును కూడా కోరుతున్నామని అన్నారు. అయితే ఇదే అంశంపై ఒక విలేకరి అమిత్ షాను అడిగితే ఆయన వెటకారంగా నవ్వుతూ.. హైకోర్టు హైదరాబాద్‌లోనే ఉంది కదా అన్నారని, అందుకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హైకోర్టు హైదరాబాద్‌లో ఉందని ఆయన చెప్పాలా, తమకు తెలియదా అంటూ 'మేమేమైనా ఔలా గాళ్లమా' అన్నారు. అమిత్ షా మాట్లాడే పద్ధతి కూడా తెలంగాణ సమాజాన్ని అవమానపర్చేలా ఉంటోందని చెప్పారు. బీజేపీ నేతలకు ఇలా మాట్లాడటం అలవాటేనని గతంలో జరిగిన మరో విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అద్వానీ ఉప ప్రధానిగా ఉన్నప్పుడు హైదరాబాద్‌ వచ్చి, హైదరాబాదే తెలంగాణలో ఉన్నప్పుడు ఇక ప్రత్యేకంగా రాష్ట్రం ఎందుకని అన్నారని గుర్తుచేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top