‘గులాబీ’ దూకుడు

‘గులాబీ’ దూకుడు - Sakshi


టీఆర్‌ఎస్‌లోకి భారీగా వలసలు.. గ్రేటర్ ఎన్నికల వరకు ఇదే వ్యూహం

 

 కొత్తగా రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన గులాబీ దండు అదే ఉత్సాహంతో ఉరకలేస్తోంది. గత ఎన్నికల్లో విజయాన్ని ఆలంబనగా చేసుకుని తెలంగాణ వ్యాప్తంగా పూర్తి పట్టు సాధించేందుకు టీఆర్‌ఎస్ శ్రేణులు కదం తొక్కుతున్నాయి. ఓవైపు పాలనలో సమూల మార్పులపై దృష్టి సారిస్తూనే.. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వ్యూహాలు రచిస్తున్నారు. పార్టీకి పట్టులేని ప్రాంతాల్లో గట్టి నేతల వలసలను ప్రోత్సహిస్తూ ప్రతిపక్షాలను దెబ్బతీసేందుకు దూకుడు గా ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్, ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్‌ను సంస్థాగతంగా పటిష్టం చేసే లక్ష్యంతో ఆయన పావులు కదుపుతున్నారు. ఇప్పటికే పార్టీలోకి వలసల పర్వం మొదలైంది. టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో నేతలు గులాబీ బాట పడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల వరకు ఈ వలసలు కొనసాగనున్నాయి.

 

 బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో పట్టు సాధించడంలో భాగంగానే ఖమ్మంలో టీడీపీకి చెందిన బలమైన నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుతో పాటు కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యే కనకయ్య, వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్‌లాల్‌ను టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌కు చెందిన టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు మరో ఐదుగురికి గులాబీ కండువా కప్పేందుకు రంగం సిద్ధమైంది. గ్రేటర్ ఎన్నికలు ఈ ఏడాది చివరిలో జరిగే అవకాశం ఉంది. దీనికి కేసీఆర్ త్రిముఖ వ్యూహాన్ని అనుసరిస్తున్నట్టు కనిపిస్తోంది. గ్రేటర్ పరిధిలోని మొత్తం 150 డివిజ న్లలో ప్రస్తుతం పార్టీ పరిస్థితిని చూస్తే మేయర్ పదవిని గెలుచుకోవడానికి సరిపోయే స్థాయిలో బలం లేదని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన స్ఫూర్తితోనే హైదరాబాద్ తొలి మేయర్ స్థానాన్ని కూడా కైవసం చేసుకోవాలనే బలమైన ఆకాంక్షతో కేసీఆర్ ఉన్నారు. దీనికోసం పాతబస్తీలో గట్టి పట్టున్న మజ్లిస్ పార్టీతో సఖ్యత, గ్రేటర్ హైదరాబాద్ పార్టీ విభాగం పునర్వ్యవస్థీకరణ, సంస్థాగతంగా పార్టీ బలోపేతం అనే త్రిముఖ వ్యూహాన్ని ఆయన  అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

 

 మదిలో మరో యోచన?

 

 గ్రేటర్ హైదరాబాద్‌ను మూడు కార్పొరేషన్లుగా(ముంబై, బెంగళూరు తరహాలో) విభజించాలని కూడా కేసీఆర్ ఆలోచన చేస్తున్నారు. దీనివల్ల మజ్లిస్‌కు హైదరాబాద్ కార్పొరేషన్‌ను అప్పగించినా.. మిగతా రెండు కార్పొరేషన్లలో టీఆర్‌ఎస్ పాగా వేయాలన్నది ఆయన వ్యూహంగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగానే హైదరాబాద్ కాకుండా మిగతా రెండు ప్రతిపాదిత కార్పొరేషన్ల పరిధిలోని డివిజన్లలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో బలంగా ఉన్న నేతలను టీఆర్‌ఎస్‌లోకి చేర్చుకోవడంపై కేసీఆర్ దృష్టి సారించారు. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్‌లోని కార్పొరేటర్లను కొందరిని పార్టీలో చేర్చుకున్నారు. మరికొందరు కూడా చేరడానికి సుముఖంగా ఉన్నప్పటికీ స్థానిక అవసరాలు, స్థానిక నేతల అభిప్రాయాల మేరకు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటిదాకా టీఆర్‌ఎస్‌లో పనిచేసిన నేతల నుంచి అభ్యంతరాలు లేని డివిజన్లలో మాత్రం టీఆర్‌ఎస్ నేతలు వలసలను ప్రోత్సహిస్తున్నారు. ఇక టీడీపీ నుంచి తలసాని సహా మరికొందరు ఎమ్మెల్యేలు చేరితే గ్రేటర్‌లో గులాబీ జెండా రెపరెపలాడనుంది.

 

 వలసలపై పార్టీలో తీవ్ర చర్చ

 

 ఇతర పార్టీలకు చెందిన ముఖ్యులను టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడంపై పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై, కొత్త ప్రభుత్వం కొలువుదీరి ఇంకా వంద రోజులు కూడా దాట లేదు. ఐదేళ్ల దాకా ఎన్నికలు కూడా లేవు. రాజకీయంగా సాధారణ పరిస్థితులే ఉన్నాయి. పైగా సొంత మెజారిటీతో(119 అసెంబ్లీ స్థానాలకు 63 సీట్లను సొంతంగా గెలుచుకుని) ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం సాగుతున్న నేపథ్యంలో పార్టీ పెద్దలు వలసలపై దృష్టి సారించడం చర్చనీయాంశమైంది. రాజకీయాల్లో అనుకోని, అనూహ్య సంక్షోభాలేమైనా ఎదురైతే వాటిని అధిగమించడానికే ఈ వ్యూహం అనుసరిస్తున్నారేమోనని టీఆర్‌ఎస్ శ్రేణులు అనుమానిస్తున్నాయి. ఇప్పటికే ఆదిలాబాద్‌లో ఇతర పార్టీలకు చెందిన ముగ్గురు (ఇంద్రకరణ్ రెడ్డి, కోనేటి కోనప్ప, జి.విఠల్ రెడ్డి) ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. హైదరాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన ఐదుగురితో పాటు, ఖమ్మం జిల్లాకు చెందిన మరో ఐదుగురు (ఇప్పటికే ఇద్దరు చేరగా మరో ముగ్గురు చేరనున్నట్లు సమాచారం) ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తున్నారు. దీనితో టీఆర్‌ఎస్ బలం 75కు చేరుతుంది. ఇదంతా దీర్ఘకాలిక వ్యూహంలో భాగమేనని టీఆర్‌ఎస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top