కేసీఆర్ మోసకారి

కేసీఆర్ మోసకారి - Sakshi

  •     కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదలకు సంక్షేమ ఫలాలు

  •      రేపటి రాహుల్ సభను విజయవంతం చేయూలి

  •      తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య

  •      బచ్చన్నపేట, నర్మెటలో సినీ నటి జయసుధతో కలిసి రోడ్ షో

  •  బచ్చన్నపేట, నర్మెట, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన వెంటనే టీఆర్‌ఎస్ పార్టీని విలీనం చేస్తానని మాట ఇచ్చి మోసం చేసిన వాడు మంచోడు కాదని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య పరోక్షంగా విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన సినీ నటి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి జయసుధతో కలిసి జనగామ నియోజకవర్గ పరిధిలోని బచ్చన్నపేట, నర్మెటలో రోడ్‌షో నిర్వహించారు.



    అనంతరం జరిగిన బహిరంగ సభలో పొన్నాల మాట్లాడుతూ దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని మోసం చేసిన వ్యక్తి, అబద్ధాలు చెప్పడం అలవాటుగా మారిన మనిషి... ఆ పార్టీ ప్రకటించిన మెనిఫెస్టోను ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. జనగామ ప్రాంతానికి గోదావరి జలాలను రప్పించించేందుకు నాడు చేసిన పోరాటం ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. కాలువల ద్వారా బచ్చన్నపేట మండలంలోని అన్ని చెరువులకు నీళ్లు మళ్లిస్తామని హామీ ఇచ్చారు.



    ఈ ప్రాంతంలో రూ.26 కోట్లతో సబ్‌స్టేషన్లు, ట్రాన్స్ ఫార్మర్లు మంజూరు చేయించి లోఓల్టేజీ సమస్యను నివారించినట్లు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించి... మహిళా సాధికారతను చాటిందన్నారు. తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చిన ఘనత సోనియాగాంధీకే దక్కుతుందన్నారు.



    ఈ మేరకు కానుకగా కాంగ్రెస్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు. దేశంలో, రాష్ట్రంలో సుస్థిర పాలన రావాలంటే చేతి గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు.  ఈ నెల 25వ తేదీన వరంగల్ నగరంలో జరగనున్న భారీ బహిరంగ సభకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ హాజరుకానున్నారుని, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతోపాటు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయూలని పొన్నాల పిలుపునిచ్చారు.

     

    జనగామకు పొన్నాల వరం :  జయసుధ



    తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య జనగామ నియోజకవర్గ ప్రజలకు దేవుడిచ్చిన వరమని జయసుధ కొనియాడారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆయన ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారని పేర్కొన్నారు.  నా దేశం నా కోసం ఏమి చేసింది అని కాకుండా, నేను నా దేశం కోసం ఏమి చేశాననే ఆలోచనతో ముందుకుసాగే వ్యక్తి పొన్నాల లక్ష్మయ్య అని అన్నారు.



    ప్రత్యేక రాష్ట్ర ప్రకటన తర్వాత తెలంగాణకు వాచ్‌డాగ్‌లా ఉంటానన్నది నిజం కాదా... టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని బహిరంగ ప్రకటనలు చేయడం వాస్తవం కాదా.. అని ప్రశ్నించారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఇచ్చిన మాట తప్పారని... ఆడబిడ్డకు మాట ఇచ్చి తప్పినవాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధిలోకి తీసుకొస్తారని విమర్శించారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే దొరల పాలన వస్తుందని హెచ్చరించారు.



    సామాజిక తెలంగాణ, కొత్త రాష్ట్ర అభివృద్ధి జాతీయ పార్టీ అరుున కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. అనంతరం పొన్నాల లక్ష్మయ్య, జయసుధను పొన్నాల వైశాలి పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. సభల్లో ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం, చేర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ మాసపేట రవీందర్‌రెడ్డి, రాజనాల శ్రీహరి, మాజీ ఎమ్యెల్యేలు సీహెచ్.రాజిరెడ్డి, గొర్ల సిద్ధయ్య, టీ పీసీసీ అధికార ప్రతినిధులు మొగుళ్ల రాజిరెడ్డి, బక్క నాగరాజు, తొర్ర సత్యం, పట్టణ అధ్యక్షులు గుర్రపు బాల్‌రాజు, గిరబోయిన అంజయ్య, పుల్ల భాస్కర్, ఓయూ జేఏసీ నాయకురాలు బాల లక్ష్మి, ఈర్ల బుచ్చిరాములు, జల్లి సిద్ధయ్య, అర్జుల సుధాకర్‌రెడ్డి, భూక్య జూంలాల్ నాయక్, పెద్ది రాజిరెడ్డి, జంగిటి అంజయ్య, ప్రజ్ఞపురం యాదగిరి, గొల్లపల్లి కుమారస్వామి, కొంపెల్లి రమేష్, సర్పంచ్‌లు, నేతలు పాల్గొన్నారు. చేర్యాల సీఐ డేవిడ్, బచ్చన్నపేట, మద్దూరు, చేర్యాల ఎస్సైలు షాదుల్లాబాబా, వేణుగోపాల్, నరేందర్ బందోబస్తు నిర్వహించారు.

     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top