సర్కారుకు రోజులు దగ్గరపడ్డాయ్

సర్కారుకు రోజులు దగ్గరపడ్డాయ్ - Sakshi


పేదలను రోడ్డున పడేసి పెద్దలను అందలమెక్కిస్తారా..

ఇళ్లను కూల్చివేస్తే కట్టుబట్టలతో ఎక్కడికి పోతారు?

ప్రజలు తిరగబ డాల్సిన సమయం ఆసన్నమైంది

కే సీఆర్ ప్రభుత్వంపైఅఖిలపక్ష నాయకుల ధ్వజం


 

జవహర్‌నగర్: అధికారం ఉంది కదా అని నియంతృత్వంగా వ్యవహరిస్తున్న టీఆర్‌ఎస్ సర్కారుకు రోజులు దగ్గరపడ్డాయని అఖిలపక్ష నాయకులు ధ్వజమెత్తారు. జవహర్‌నగర్‌లో పేదలు నిర్మించుకున్న ఇళ్లను ప్రభుత్వం ఇటీవల కూల్చివేయడంతో అఖిలపక్ష నాయకులు ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా బాధితులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. పేదల ఇళ్లను కూల్చి ఆ స్థలాలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు టీఆర్‌ఎస్ సర్కార్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పేదల ఉసురు తీస్తున్న ప్రభుత్వంపై ప్రజలు తిరగబడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ (చంద్రన్న వర్గం) నేత కే గోవర్ధన్ మాట్లాడుతూ.. బతుకుదెరువు కోసం పట్నానికి వచ్చి కాయకష్టం చేసుకుని నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేస్తే కట్టు బట్టలతో వారు ఎక్కడికి పోవాలో ముఖ్యమంత్రి కేసీఆరే సమాధానమివ్వాలన్నారు. ప్రభుత్వ భూమిలో పక్కా ఇళ్లు నిర్మించుకున్న నిరుపేదలకు చట్టబద్ధంగా పట్టా పొందే హక్కు ఉందని స్పష్టంచేశారు.



తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాపోలు రాములు మాట్లాడుతూ.. వేల ఎకరాలు కబ్జా చేసిన వారిని వదిలి.. పేదల గుడిసెలను తొలగించడంలో ప్రభుత్వ ఆంతర్యం ఏంటో అర్థం కావడం లేదన్నారు. మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కేఎల్‌ఆర్ మాట్లాడుతూ పేదలకు అన్యాయం జరిగితే సహించేదిలేదని, వారందరికీ ఇళ్ల పట్టాలను మంజూరు చేసే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. జనశక్తి  నేత చంద్రన్న మాట్లాడుతూ.. కేసీఆర్ తన ఏడాది పాలనలో కేవలం పేద ప్రజలపై ప్రతాపం చూపేందుకే సరిపోయిందన్నారు. అనంతరం.. ప్రభుత్వం తన ఇంటిని సైతం కూల్చివేస్తుందేమోనని ఆందోళనకు గురై గుండెపోటుతో మృతి చెందిన జవహర్‌నగర్  గిరిప్రసాద్‌నగర్ కాలనీలోని ఆర్‌ఎంపీ వైద్యుడు రమేష్ (49) కుటుంబాన్ని అఖిలపక్ష నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ. 20 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

   ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి బాల మల్లేష్, పీఓడబ్ల్యూ నగర నాయకులు జీ అనురాధ, ఎ. నరేందర్, కే వెంకటేశ్వర్లు, జయసుధ, యాదమ్మ, పుణ్యవతి, ఇఫ్టూ నాయకులు మణి, నరసింహ, పోచయ్య, టీడీపీ జవహర్‌నగర్ అధ్యక్షుడు కుతాడి రవీందర్, జవహర్‌నగర్ ఫేజ్-1 అధ్యక్షుడు కాయిత రాజు యాదవ్, తెలంగాణ మాజీ సైనికుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి ఇమ్మానుయేల్, బీఎస్పీ మేడ్చల్ నియోజకవర్గ ఇన్‌చార్జి మేడ  రవి, కాంగ్రెస్ నాయకులు మహేందర్‌రెడ్డి, సదానంద్, ప్రసాద్ గౌడ్, బల్లి శ్రీను, మంజుల, టీడీపీ నాయకులు పల్లె కృష్ణ గౌడ్, వేణు ముదిరాజ్‌లతో పాటు వివిధ  ప్రజా సంఘాలు, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.  

 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top