ఉత్త భ్రమిత్‌ షా!

ఉత్త భ్రమిత్‌ షా! - Sakshi


అమిత్‌ షా దుర్మార్గంగా అబద్ధాలు మాట్లాడారు: కేసీఆర్‌



మాకు తెలంగాణే బాద్‌షా.. దేశాన్ని సాకుతున్న ఆరేడు రాష్ట్రాల్లో మాది ఒకటి

రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటిదాకా కేంద్రం ఇచ్చింది రూ. 67 వేల కోట్లే

అన్ని రాష్ట్రాలకు వచ్చిన మాదిరే వచ్చాయి.. ఒక్క రూపాయి అదనంగా రాలేదు

నేను చెప్పింది తప్పని రుజువు చేస్తే సీఎం పదవికి రాజీనామా చేస్తా

రాష్ట్రం దాటకముందే షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌  
 



సీఎం కేసీఆర్‌ పాంచ్‌ పటాకా

1. నల్లగొండ కూడలిలో పాములాట పెట్టి చెబితే కేసీఆర్‌ భయపడతడా? నన్ను తిడితే పట్టించుకోను.. కానీ తెలంగాణను కించపరిచేలా, ప్రగతి కుంటుపడేలా మాట్లాడితే సహించను. అమిత్‌ షా దుర్మార్గంగా మాట్లాడాడు. తప్పుడు ప్రచారం చేసినందుకు ఆయన ప్రజలకు క్షమాపణ చెప్పాలి.



2. ఎన్నికల్లో మంచి చెడ్డలు ప్రజలు నిర్ణయిస్తరు. 2019లో రాష్ట్రంలో బీజేపీదే అధికారం అంటున్నరు. నాకూ కలపడతది. కేంద్రంలో ప్రభుత్వం స్థాపిస్తనని... అది సాధ్యమేనా..?



3. పెన్షన్లు ఇచ్చే గతి లేదని చాలా దారుణంగా మాట్లాడారు. 38 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నం. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వానికి రూ.5 వేల కోట్లు ఖర్చు అవుతోంది. కేంద్రం ఇస్తోంది ఎంత? రూ.209 కోట్లు. సముద్రంలో కాకి రెట్టంత.



4. కేంద్రంలో బీజేపీ.. పీజేపీ.. ఏ ప్రభుత్వం ఉన్నా రాష్ట్రానికి ఇవ్వాల్సిన మొత్తం ఇవ్వాల్సిందే. అన్ని రాష్ట్రాలకు ఇచ్చిన మాదిరే కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు వచ్చాయి తప్ప ఒక్క రూపాయి కూడా అదనంగా రాలేదు. నేను చెప్పిన లెక్కలు తప్పయితే.. అమిత్‌ షా రుజువు చేస్తే సీఎం పదవికి రాజీనామా చేస్తా.



5. అమిత్‌ షా మూడు దళితవాడల్లో భోజనం తిన్నారు. కానీ అది అక్కడ వండలేదు. తేరట్‌పల్లి పక్కన కమ్మగూడెం ఉంది. అక్కడే బీజేపీ నాయకుడు మనోహర్‌రెడ్డికి బాధ్యత అప్పజెప్పిండ్రు. మామిడి తోటలో వండుకొచ్చిండ్రు. పెద్దదేవులపల్లిలో భోజనం కోసం నల్లగొండలో అన్నపూర్ణ మెస్‌ నుంచి తీసుకుపోయిండ్రు. దళితులతో భోజనం చేసిన మీ ఫొటోలు చూసి చక్కరొచ్చి పడిపోవాల్నా?




అమిత్‌ షా అడ్డంగా, దుర్మార్గంగా అబద్ధాలు మాట్లాడారు: సీఎం కేసీఆర్‌ మండిపాటు



సాక్షి, హైదరాబాద్‌:

‘‘కేసీఆర్‌ను వ్యక్తిగతంగా తిట్టినా పడతా.. కానీ తెలంగాణ అభివృద్ధిని కుంటుపరి చేలా మాట్లాడితే ప్రాణం పోయినా ఒప్పు కోను. నాకు రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం. రాష్ట్రం సాధించిన ఉద్యమ నేతగా, రాష్ట్ర ముఖ్య మంత్రిగా అవాస్తవాలను ఖండిస్తా. మౌనంగా ఉంటే విమర్శలు చేసిన వారు చెప్పింది నిజమని అంగీకరించినట్లయితది. నల్లగొండ జిల్లా లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా పచ్చి అబద్ధాలు, అసత్యాలు మాట్లాడారు. ప్రభు త్వంపై వరుస దాడి చేశారు..’’అని ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలతో తప్పుడు ప్రచారం చేసినందుకు అమిత్‌ షా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ‘‘అమిత్‌ షా.. ఒట్టి భ్రమిత్‌ షా.. ఆయన వచ్చి నల్లగొండ కూడలిలో పాములాట పెట్టి చెబితే కేసీఆర్‌ భయపడతాడా..?’’అని దుయ్యబట్టారు. తెలంగాణ ఏర్పాటైనప్పట్నుంచీ మే 24 వరకు అన్నీ కలిపి రూ.67,390 కోట్లు కేంద్రం నుంచి వచ్చాయని, ఇవి అన్ని రాష్ట్రాలకు వచ్చిన విధంగానే వచ్చాయి తప్ప ఒక్క రూపాయి కూడా అదనంగా రాలేదని స్పష్టం చేశారు. తాను చెప్పిన లెక్కలు తప్పయితే, వాటిని అమిత్‌ షా రుజువు చేస్తే సీఎం పదవికి రాజీనామా చేస్తానని సవాల్‌ విసిరారు. ‘‘తెలంగాణను నిందించినోడు ఎవడైనా మాకు శత్రువే. గతేడాది సెప్టెంబర్‌లో అమిత్‌ షా వచ్చి ఏదేదో మాట్లాడి వెళ్లిండు. ఇప్పుడూ మాట్లాడిండు. ఈయనకు ఎటుపడితే అటు మాట్లాడే అలవాటుంది. లేనిపోని అపోహలు సృష్టించాలని చూస్తుండ్రు..’’అని అన్నారు. ప్రగతి భవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు. ముఖ్యమంత్రి ఏమన్నారో ఆయన మాటల్లోనే..



అడ్డంగా.. దుర్మార్గంగా మాట్లాడాడు..

చిల్లర రాజకీయాల కోసం రాష్ట్ర ప్రగతిని దెబ్బతీస్తారా? మేం మౌనంగా ఉంటే అంతా నిజమే అనుకుంటారు. దేశాన్ని పాలిస్తున్న ఒక రూలింగ్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మాట్లాడవలసిన మాటలేనా ఇవి..? అమిత్‌ షా.. ఒట్టి భ్రమిత్‌ షా.. ఆయన వచ్చి నల్లగొండ కూడలిలో పాములాట పెట్టి చెబితే కేసీఆర్‌ భయపడతాడా..? నన్ను తిడితే పట్టించుకోను. కానీ తెలంగాణను కించపరిచేలా, ప్రగతి కుంటుపడేలా మాట్లాడితే సహించను. తెలంగాణే మాకు బాద్‌ షా. అమిత్‌ షా అడ్డంగా, దుర్మార్గంగా మాట్లాడాడు. అద్భుతమైన అవాస్తవాలు మాట్లాడాడు. ఇది వారికే శోభ ఇవ్వదు. వేరే వాళ్లయితే తేలిగ్గా తీసుకుందు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా అధికారం కోసం ప్రయత్నించవచ్చు. ఎవరూ ఏకగ్రీవంగా అధికారం ఇవ్వరు. ఇంట్లో కూర్చుండబెట్టి ఇవ్వరు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే మంచి చెడ్డలు నిర్ణయిస్తరు. 2019లో రాష్ట్రంలో బీజేపీదే అధికారం అంటున్నరు. నాకు కూడా కలవడతది.. కేంద్రంలో ప్రభుత్వం స్థాపిస్తనని.. అది సాధ్యమేనా..?



మీరిచ్చేది సముద్రంలో కాకి రెట్టంత..

దేశాన్ని సాకుతున్న రాష్ట్రాలు ఆరేడు మాత్రమే ఉంటాయి. దేశాన్ని ఆదుకునే రాష్ట్రాలు తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక. మిగతావన్నీ లోటు రాష్ట్రాలే. సంక్షేమంలో తెలంగాణ నంబర్‌ వన్‌గా ఉంటే.. పెన్షన్లు ఇచ్చే గతి లేదని అమిత్‌ షా చాలా దారుణంగా మాట్లాడాడు. రాష్ట్రంలో 38 లక్షల మందికి ఫించన్లు ఇస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి రూ.5 వేల కోట్ల ఖర్చవుతోంది. కేంద్రం ఇస్తోంది ఎంత? రూ.209 కోట్లు. సముద్రంలో కాకి రెట్టంత. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలంట. ఏంది తీసుకపోయేది? అవాస్తవాలు మాట్లాడిన అమిత్‌ షా రాష్ట్రం దాటిపోక ముందే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. తెలంగాణను కించపరిచే విధంగా రాజకీయ ప్రేరేపిత విమర్శలతో వెకిలి ప్రయత్నం చేశారు.



తెలంగాణ గడ్డ మీద మీ గిమ్మిక్కులు నడవయి..

మాది అడుక్కునే రాష్ట్రం కాదు.. ధనిక రాష్ట్రం.. మీ చిల్లర రాజకీయం కోసం మా అభివృద్ధిని, రాష్ట్రాన్ని దెబ్బతీస్తరా? మాది అడుక్కునే రాష్ట్రం కాదు. దేశంలో ధనిక రాష్ట్రం. ఇది మేం చెప్పుకోవడం కాదు.. కేంద్ర ఆర్థిక శాఖ, భారత ప్రభుత్వం చెప్పింది. 19.5 శాతం వృద్ధి రేటుతో దేశంలోనే నంబర్‌ వన్‌ రాష్ట్రమని చెప్పింది. ఇది కేసీఆర్‌ కవిత్వం కాదు. ఉత్తగనే అవాకులు చవాకులు పేలుతరా? గిమ్మిక్కులతో తెలంగాణ గడ్డపై రాజకీయం చేస్తామంటే కుదరదు. హైదరాబాద్‌ నుంచి రూ.లక్ష కోట్ల సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు జరుగుతున్నాయి. రూ.లక్ష కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని దేశం కోసం ఇస్తున్నం. మా అభివృద్ధిని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారా? జ్యుడీషియరీ విభజన జరగకుండా రాష్ట్రం పూర్తి విభజన కానట్టే! మూడేళ్లుగా తిరుగుతున్నం. హైకోర్టు విభజన కోసం న్యాయవాదులు ఆందోళన చేశారు. హైకోర్టు విభజన చేయకపోగా.. హైకోర్టు హైదరాబాద్‌లో ఉందంటూ క్రూర పరిహాసం చేస్తారా? హైకోర్టు హైదరాబాద్‌లో ఉందని తెలియని ఔలేగాళ్లమా? తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంపై క్రూర పరిహాసం చేస్తరా? క్షమాపణ కోరాలి. తమాషా చేస్తుండ్రా..?



బీజేపీ మోసపు చరిత్ర తెలంగాణ మరిచిపోలేదు



‘హైదరాబాదే తెలంగాణలో ఉంది. తెలంగాణ ఎందుకు..?’అని గతంలో అద్వానీ అన్నరు. 2019లో వస్తరా? ఊకనే వత్తరా? కాకినాడ తీర్మానం మోసపు చరిత్ర ఎవరు మరిచిపోయిండ్రు. తెలంగాణ కోసం ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే కిషన్‌రెడ్డి పారిపోలేదా? బీజేపీ త్యాగాలు తెలియనివా? ఏడు మండలాలను అప్రజాస్వామికంగా చంద్రబాబు నాయుడు గుంజుకుంటే ఏం చేసిండ్రు. సీలేరు పవర్‌ ప్రాజెక్టును కర్కశంగా లాగేసి ఏపీకి ఇవ్వలేదా? తెలంగాణ ఒక విఫల ప్రయత్నమని నిరూపించేందుకు చంద్రబాబు డ్రామా అడి విద్యుత్‌ సప్లై చేయలేదు. నీరజా మాథుర్‌ కమిటీ ఏపీదే తప్పన్నా చర్యలు తీసుకున్నరా? తెలంగాణ సమాజం బీజేపీని క్షమించదు. తెలంగాణ అభివృద్ధిని దెబ్బకొట్టేలా, ప్రపంచ దేశాల్లో పరువు తీసేలా మాట్లాడినందుకు క్షమాపణ చెప్పాలే. లేదంటే తెలంగాణకు అన్యాయం చేసినట్టే. పాపం మూటగట్టుకోవద్దు.



ఇదేనా.. మీ దళిత ప్రేమ..?

నల్లగొండ జిల్లాలో మూడు దళిత వాడల్లో అమిత్‌ షా భోజనం తిన్నారు. కానీ, అక్కడ వండలేదు. తేరట్‌పల్లి పక్కన కమ్మగూడెం అని ఉంది. అక్కడే బీజేపీ నాయకుడు మనోహర్‌రెడ్డి అనే ఆయనకు బాధ్యత అప్పజెప్పిండ్రు. మామిడి తోటలో వండుకొచ్చిండ్రు. దీనిపై తేరట్‌పల్లిలో దళితులు నిరసన తెలిపిండ్రు. పెద్దదేవులపల్లిలో భోజనం కోసం నల్లగొండలో అన్నపూర్ణ మెస్‌ నుంచి తీసుకుపోయిండ్రు. దళితులతో భోజనం చేసిన మీ ఫోటోలు చూసి చక్కరొచ్చి పడిపోవాల్నా? మీ అసలు స్వరూపం ఏంది? మీరు మాట్లాడేది ఏంది? తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇది గమనించాలి. దళిత గిరిజనుల కోసం సబ్‌ప్లాన్‌ తెచ్చాం. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం కేంద్రం తన బడ్జెట్లో 3.93 శాతం ఖర్చు పెడుతుంటే, తెలంగాణ ప్రభుత్వం 15 శాతం.. అంటే ఐదు రెట్లు ఎక్కువ ఖర్చు పెడుతోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top