అమిత్ షాకు కేసీఆర్ సవాల్‌

అమిత్ షాకు కేసీఆర్ సవాల్‌ - Sakshi


కేంద్ర ప్రభుత్వం గత మూడేళ్లలో తెలంగాణకు లక్ష కోట్లు ఇచ్చిందంటూ బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా చెప్పడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ విషయాన్ని వివరించేందుకు ఆయన బుధవారం సాయంత్రం ప్రగతి భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణకు 20 వేల కోట్ల అదనపు నిధులు ప్రతియేటా ఇస్తున్నామని అమిత్‌ షా చెప్పారని, కనీసం 200 కోట్లయినా ఇచ్చారేమో చూపించాలని సవాలు చేశారు. 2016-17 సంవత్సరంలో తెలంగాణ నుంచి కేంద్రానికి రూ. 50,013 కోట్లు వెళ్తే, కేంద్రం అన్ని విధాలుగా కలిపి తెలంగాణకు ఇచ్చినది కేవలం రూ. 24,561 కోట్లు మాత్రమేనన్నారు.

ఆయన ఇంకా ఏమన్నారంటే..


  • అమిత్ షా గతంలోనూ రాష్ట్రం గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు

  • గతంలో వచ్చినపుడు రాష్ట్రానికి 90వేల కోట్లు ఇచ్చామన్నారు

  • ఆ తర్వాత స్థానికంగా ఉండే నాయకులు అమిత్ షా చెప్పింది నూరుశాతం కరెక్ట్, చర్చకు సిద్ధమన్నారు

  • అది వాళ్ల అజ్ఞానమని, ఎందుకులే వదిలేద్దామని పట్టించుకోలేదు

  • ఈసారి ఆయన ప్రత్యేకంగా రాష్ట్రంలో మూడు రోజుల పర్యటన పెట్టుకుని ప్రభుత్వంపై వరుస దాడి చేశారు

  • తెలంగాణ దేశంలోనే బాగా ధనిక రాష్ట్రాలలో ఒకటి. ఇది అనేక రాష్ట్రాలతోనే కాక, ప్రపంచంలోని కొన్ని దేశాలతో కూడా పోటీ పడుతోంది

  • మా పోరాటం పొరుగు రాష్ట్రాలతో కాదు, ఇతర దేశాలతోనే ఉందని గర్వంగా చెప్పుకోగలను

  • నన్ను చాలామంది ఇతర దేశాల రాయబారులు పొగిడారు

  • కేసీఆర్‌గా నన్ను వ్యక్తిగతంగా విమర్శిస్తే ఏమీ మాట్లాడను

  • తెలంగాణ రాష్ట్రాన్ని కించపరిచే విధంగా ఎవరైనా మాట్లాడితే మాత్రం నా ప్రాణం పోయినా రాజీపడను

  • ప్రపంచం ముందు నిలిచి గెలిచే రీతిలో కడుపు, నోరు కట్టుకుని అవినీతిరహితంగా పనిచేస్తున్నాం

  • ప్రధాని సహా అనేకమంది కేంద్ర మంత్రులు కూడా ఈ రాష్ట్రాన్ని పొగిడి వెళ్లారు

  • మిషన్ కాకతీయ, భగీరథ, టీఎస్ ఐపాస్‌లను అన్ని రాష్ట్రాల వాళ్లు ప్రశంసించారు

  • కేంద్రమంత్రి ఉమా భారతి తెలంగాణ మోడల్‌ను కాపీకొట్టమని 28 రాష్ట్రాలకు చెప్పారు

  • ఇంతమంది ప్రశంసిస్తుంటే అమిత్ షా మాత్రం అద్భుతమైన అబద్ధాలు చెప్పారు

  • వేరే మనిషైతే నేను కూడా లైట్ తీసుకునేవాడిని. కానీ దేశాన్ని పాలించే పార్టీకి జాతీయాధ్యక్షుడు

  • ఇప్పుడు కూడా నేను మౌనంగా ఉంటే అంగీకరించినట్లు అవుతుంది

  • ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు, అప్పుడప్పుడు నాకు కూడా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తా అనిపిస్తుంది

  • వాళ్ల పార్టీ విస్తరించుకోడానికి వాళ్లకు పూర్తి స్వేచ్ఛ ఉంది

  • ఎన్నికల్లో ఎల్లయ్య తోనో, మల్లయ్యతోనో, పుల్లయ్యతోనో పోటీచేసి గెలవాల్సిందే తప్ప ఏకగ్రీవంగా ఎవరూ ఎన్నిక కారు

  • అమిత్ షా స్థాయి వ్యక్తి అంత పచ్చి అబద్ధాలు చెప్పకూడదు

  • దేశాన్ని సాకే రాష్ట్రాలు ఐదారే ఉంటాయి. మిగిలినవన్నీ లోటు రాష్ట్రాలే

  • పెంచి పోషించేవి గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక లాంటివి ఉంటాయి

  • వాటిలో తెలంగాణ కూడా ఒకటి

  • దేశానికి తెలంగాణ ఇచ్చే డబ్బు ఎంతో అమిత్ షా తెలుసుకోవాలి

  • తెలంగాణ నుంచి కేంద్రానికి 2016-17లో ఆదాయపన్ను 32186 కోట్లు, సర్వీస్ టాక్స్ 7671 కోట్లు, కస్టమ్స్‌ డ్యూటీ 3328 కోట్లు, సెంట్రల్ ఎక్సైజ్ 6828 కోట్లు. మొత్తం కలిపితే 50,013 కోట్ల రూపాయలు పంపింది.

  • ఇదే సంవత్సరంలో కేంద్రం నుంచి వచ్చే అన్ని రకాల నిధులు కలిపి రూ. 24,561 కోట్లు మాత్రమే.

  • వెటర్నరీ యూనివర్సిటీ లాంటివి ఇవ్వాలని ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోనే ఉంది. గిరిజన యూనివర్సిటీ ఇంకా రాలేదు. అది కూడా ఇచ్చేశామని ఆయన చెప్పారు.

  • మూడు యూనివర్సిటీలకు రూ. 40,800 కోట్లు ఇచ్చినట్లు ఆయన చెబుతున్నారు, అసలు అన్ని నిధులు వాటికి అవసరం అవుతాయా, ఎందుకింత పచ్చి అబద్ధాలు చెప్పారు?

  • మూడేళ్లలో లక్ష కోట్లు ఇచ్చామని అమిత్‌ షా చెప్పారు.. కానీ రాష్ట్రానికి హక్కు ప్రకారం రావల్సిన ప్రతి రూపాయి కలిపితే మే 24వ తేదీ వరకు వచ్చినది రూ. 67,390 కోట్లు మాత్రమే.

  • అమిత్ షాతో నాకు పంచాయతీ ఎందుకు.. జీవితంలో నేను ఆయన్ని కలిసింది ఒక్కసారే
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top