ప్రతి పథకంలో కమీషన్‌

జన ఆవేదన సమ్మేళన సభలో మాట్లాడుతున్న దిగ్విజయ్‌సింగ్‌ - Sakshi


కేసీఆర్‌ కుటుంబ సభ్యుల జేబులు నిండాయి

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్‌ ఆరోపణ

ప్రధాని మోదీ, కేసీఆర్‌ పచ్చి అబద్ధాలకోరులు

హిందూ ముస్లింల మధ్య వైషమ్యాలు పెంచేందుకు కుట్ర




సాక్షి, వికారాబాద్‌:  తెలంగాణలో పేదలకు మేలేమో గానీ, కేసీఆర్‌ కుటుంబ సభ్యుల జేబులు మాత్రం నిండాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌ సింగ్‌ ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతి పథకం అమలులో కమీషన్లు దండుకుంటున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా వికారాబాద్‌ జిల్లా పరిగిలో సోమవారం కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ‘జన ఆవేదన సమ్మేళన సభ’లో ఆయన మాట్లాడారు.


ఈ సందర్భంగా కేసీఆర్, మోదీ లపై తీవ్రంగా ధ్వజమెత్తారు. మిషన్‌ భగీరథ, నీటిపారుదల టెండర్లను తన అనుయాయులకు దక్కేట్లు చేసిన కేసీఆర్‌.. రూ.కోట్లలో కమీషన్లు దండుకున్నారని దిగ్విజయ్‌ ఆరోపించారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్‌బెడ్రూం ఇళ్లు, రైతులకు రుణమాఫీ ఇవ్వడంలో ఘోర వైఫల్యం చెందారన్నారు. సీఎంకు తప్ప మంత్రులకు అధికారాలేమీలేవని, కేవలం కుర్చీలకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. 2019లో దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని దిగ్విజయ్‌ ధీమా వ్యక్తం చేశారు.



అబద్ధాల పోటీలో మోదీకే గోల్డ్‌ మెడల్‌

ఒలింపిక్స్‌లో అబద్ధాల పోటీలు నిర్వహిస్తే ప్రధాని మోదీకే బంగారు పతకం వస్తుందని దిగ్విజయ్‌సింగ్‌ ఎద్దేవా చేశారు. మోదీ,  కేసీఆర్‌లు ఇద్దరూ అబద్ధాలకోరులని విమర్శించారు. హిందూ ముస్లింల మధ్య వైషమ్యాలను రెచ్చగొడుతూ ఓట్లు దండుకుంటున్నారని ధ్వజమెత్తారు.  దేశం నుంచి తరలిన సుమారు రూ.40 వేల కోట్ల నల్లధనాన్ని తాను అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో తెస్తానని ప్రకటించిన ప్రధాని.. ఇప్పటి వరకు ఎంత తెచ్చారో వెల్లడించాలన్నారు.



కమీషన్ల కోసమే మార్చారు: ఉత్తమ్‌

కమీషన్ల కోసం కక్కుర్తిపడి ప్రాజెక్టుల డిజైన్లు మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌ ప్రభుత్వానికే దక్కిందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. తన సొంత నియోజ కవర్గానికి సాగునీటిని అందించడం కోసం ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్‌ మార్చి రంగారెడ్డి జిల్లాను ఎండబెట్టారని దుయ్యబట్టారు. మిష న్‌ భగీరథ, కాకతీయల పేరుతో వందల కోట్లు దోచుకున్నారన్నారు. కేసీఆర్‌ వచ్చిన తర్వాత రైతుల ఆత్మహత్యలు విపరితంగా పెరిగాయని ఆరోపించారు.



కేసీఆర్‌ది నియంతపాలన: జానారెడ్డి

అధికార మదంతో కేసీఆర్‌ నియంతలా వ్యవహరిస్తున్నారని శాసనసభాపక్ష నేత కె.జానారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌ మొదలుపెట్టిన ప్రాజెక్టులు తామే చేసినట్లుగా గొప్పలు చెప్పు కుంటున్నారని ఎద్దేవా చేశారు. మిగతా సంక్షేమ పథకాలన్నీ కాంగ్రెస్‌ హయాంలో ప్రారంభించినవేనని పేర్కొన్నారు. రుణమాఫీలో జరిగిన జాప్యం కారణంగా పెరిగిన వడ్డీనంతా ప్రభుత్వమే చెల్లించాలని జానారెడ్డి డిమాండ్‌ చేశారు. సభలో పార్టీ పరిశీలకులు కుంతియా, శాసనమండలి పక్షనేత షబ్బీర్‌అలీ, ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, సబితారెడ్డి, డీకే అరుణ, సునీతా లక్ష్మారెడ్డి, గడ్డం ప్రసాద్‌కుమార్, ఎ.చంద్రశేఖర్, మాజీ ఎంపీలు మధుయాష్కీ, అంజన్‌కుమార్‌ యాదవ్, మల్లురవి, ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి, చేవెళ్ల లోక్‌సభ ఇన్‌చార్జి పి.కార్తీక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



కేసీఆర్‌ వ్యతిరేక శక్తులతో కలసి పనిచేస్తాం: జైపాల్‌రెడ్డి

కేసీఆర్‌ వ్యతిరేక శక్తులతో కలసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైపాల్‌ రెడ్డి వెల్లడించారు. గిరిజనులు, ముస్లింలకు 12 శాతం రిజ ర్వేషన్లు ఇస్తామని కేసీఆర్‌ మభ్యపెడుతున్నారని విమర్శించారు. కేసీఆర్‌కు మోదీతో రహస్య సంబంధాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top