19న ఇల్లు కదలొద్దు

19న ఇల్లు కదలొద్దు - Sakshi


ఆ రోజు వివరాలు నమోదు చేయించుకుంటేనే సంక్షేమ పథకాలు

ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన




సాక్షి, హైదరాబాద్: సమగ్ర కుటుంబ సర్వే సందర్భంగా ఈ నెల 19న తమ సొంత గ్రామాల్లోనే ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఆ రోజు అన్ని వివరాలను నమోదు చేసుకోకుంటే.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందుకునే అవకాశం ఉండదని చెప్పారు. శుక్రవారం హెచ్‌ఐసీసీలో జరిగిన సదస్సులో కేసీఆర్ మాట్లాడుతూ... ప్రజలంతా ఈ సర్వేను అత్యంత ప్రాధాన్యమైన విషయంగా పరిగణించాలని కేసీఆర్ కోరారు. తెలంగాణ అమరవీరుల స్ఫూర్తితో ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా సర్వే విధుల్లో పాల్గొంటామని ఉద్యోగులు ప్రకటించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.


 


సర్వే రోజును ఉద్యోగులకు ఆన్ డ్యూటీగా పరిగణిస్తామని, సర్వే బృందాలకు భోజన సౌకర్యం ఏర్పాటు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాగా ఉద్యోగులకు సీఎం పలు వరాలు ప్రకటించారు. తహసీల్దార్, ఎంపీడీవోలు, ఇతర అధికారులకు వాహన సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు. వాహనాల కొనుగోలుకు వడ్డీలేని రుణం మంజూరు చేయడంతో పాటు నెలవారీ అలవెన్సు ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటించారు. తహసీల్దార్లు సొంత జిల్లాల్లో ఉద్యోగం చేయొద్దన్న నిబంధనను రద్దు చేయనున్నట్లు తెలిపారు.


 


ఈ నెల 6న ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని అధికారులను సీఎం ఆదేశించారు. హైదరాబాద్‌లో జయశంకర్ మెమోరియల్, విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కాగా, తెలంగాణ జిల్లాల్లో నివాసముంటున్న సీమాంధ్రులంతా ఎప్పటి నుంచో ఇక్కడి ప్రజలతో మమేకమై ఉన్నందున వారితో ఏ ఇబ్బందీ లేదని సమావేశంలో కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ప్రభుత్వం ముందున్న సమస్యల్లా హైదరాబాద్‌లో నివసించే సీమాంధ్రులతోనేనని పేర్కొన్నట్లు సమాచారం.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top