కేసీఆర్‌కు డిప్లొమాట్ పాస్‌పోర్ట్

మంగళవారం సికింద్రాబాద్  పాస్‌పోర్టు కార్యాలయానికి వచ్చిన సీఎం కేసీఆర్ - Sakshi


దరఖాస్తు చేసుకున్న సీఎం

సచివాలయానికి వచ్చి పాస్‌పోర్ట్‌ను అందించిన అధికారులు


 

 సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం డిప్లొమాట్ పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. గతంలో ఆయనకు సాధారణ పాస్‌పోర్ట్ మాత్రమే ఉండేది. ముఖ్యమంత్రి అయ్యాక ఆయన డిప్లొమాట్(దౌత్యపరమైన గౌరవం లభించే) పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. దీని కోసం మంగళవారం ఉదయం ఆయన సికింద్రాబాద్‌లోని పాస్‌పోర్ట్ కార్యాలయానికి వెళ్లారు. సీఎంకు పాస్‌పోర్ట్ అధికారి అశ్విని సత్తారు స్వాగతం పలికారు. ఆయన వేలిముద్రలు, సంతకం తదితరాలు తీసుకున్నారు. కేసీఆర్ 20 నిమిషాలపాటు  పాస్‌పోర్ట్ కార్యాలయంలో ఉన్నారు. దరఖాస్తు చేసిన తర్వాత కేసీఆర్ సచివాలయానికి వెళ్లిపోయారు. మధ్యాహ్నం పాస్‌పోర్ట్ అధికారి అశ్విని సత్తారు, డిప్యూటీ పాస్‌పోర్ట్ అధికారి మదన్‌మోహన్‌రెడ్డిలు సచివాలయానికి వెళ్లి సీఎంకు పాస్‌పోర్ట్‌ను అందజేశారు. గతంలో ఎంపీగా ఉన్నప్పుడు కూడా కేసీఆర్ డిప్లొమాట్ పాస్‌పోర్ట్‌ను పొందినట్టు పాస్‌పోర్ట్ అధికార వర్గాలు తెలిపాయి.

 

 డిప్లొమాట్ పాస్‌పోర్ట్ అంటే?

 -    ఈ పాస్‌పోర్ట్ ఉంటే ఏదేశానికైనా వెళ్లినప్పుడు దౌత్యపరంగా ప్రత్యేకమైన గౌరవం ఇస్తారు. చాలామంది రాజకీయ నాయకులు డిప్లొమాట్ పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకుంటారు.

 -    ఏదైనా విదేశానికి ఈ పాస్‌పోర్ట్‌తో వెళితే.. అక్కడి అధికారులు ఆ వ్యక్తిని ఆ దేశ(పాస్‌పోర్టు కలిగిన వ్యక్తికి సంబంధించిన దేశానికి) ప్రతినిధిగా భావిస్తారు

 -    వారిపై నిఘా ఉండదు. విమానాశ్రయాల్లో లగేజీ తనిఖీలు సాధారణంగా ఉండవు.

 -    ఇమిగ్రేషన్ చెకప్ వంటి వాటికి సంబంధించి ప్రత్యేకమైన కౌంటర్ ఉంటుంది

 -    రాష్ట్ర స్థాయిలో ఈ పాస్ట్‌పోర్టు గవర్నర్, సీఎం, కేబినెట్ మంత్రులు తీసుకోవచ్చు.

 -    కేంద్రంలో అయితే రాష్ట్రప్రతి, ప్రధాన మంత్రి, కేబినెట్ మంత్రులు దీని పరిధిలోకి వస్తారు. ఎంపీలకు కూడా ఇస్తారు.

 -    పదవి ఉన్నంతకాలం ఈ పాస్‌పోర్ట్‌ను విని యోగించవచ్చు. ఆ తర్వాత దాన్ని తిరిగి పాస్‌పోర్ట్ అధికారికి సరెండర్ చేయాలి.

 -    ఈ పాస్‌పోర్ట్ తీసుకున్న సమయానికి..  సాధారణ పాస్‌పోర్ట్ ఉంటే దాన్ని సరెండర్ చేసి, డిప్లొమాట్ పాస్‌పోర్ట్ పొందాలి.

 -    సాధారణ పాస్‌పోర్ట్ ముదురు నీలి రంగులో ఉంటే.. డిప్లమాట్ పాస్‌పోర్ట్ ఎరుపు రంగులో ఉంటుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top