సెలవు పెట్టి మరీ స్కెచ్ గీశాడు....!

సెలవు పెట్టి మరీ స్కెచ్ గీశాడు....! - Sakshi


హైదరాబాద్ :  అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిపై కాల్పులకు పాల్పడిన ఏఆర్ కానిస్టేబుల్ ఓబులేసు.... విధులకు సెలవు పెట్టి స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాంపల్లి ఎక్సైజ్ శాఖలో విధులు నిర్వహిస్తున్న అతను...15 రోజులుగా సెలవులో ఉన్నాడు. అనంతపురంలో ఓబులేసును అదుపులోకి తీసుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు అతడిని హైదరాబాద్ తరలించారు.


 


కాగా కాల్పులకు పాల్పడిన ఓబులేసు ....ప్లాన్ ఫెయిల్ కావటంతో నేరుగా ఎస్ ఆర్ నగర్ చేరుకున్న అక్కడ నుంచి బెంగళూరు బస్సు ఎక్కాడు. అనంతపురం వెళుతున్న అతడిని.... సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా గుర్తించిన పోలీసులు అనంతపురం-కర్నూలు జిల్లా సరిహద్దుల్లో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అతడిని హైదరాబాద్లో రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు మాత్రం ఓబులేసు అరెస్ట్ వార్తపై ధ్రువీకరించలేదు.



కాగా నిందితుడు ఓబులేష్ వెనుక పెద్ద చరిత్రే ఉంది. హైదరాబాద్ అంబర్ పేటలోని సీపీఎస్ గ్రౌండ్ లో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న ఓబులేసు... 1998లో మొదట కర్నూలు ఏపీఎస్పీ ఏఆర్ కానిస్టేబుల్ గా డిపార్ట్ మెంట్లో చేరాడు. నాలుగేళ్ల తర్వాత హైదరాబాద్ గ్రేహౌండ్స్ కు బదిలీ అయ్యాడు. విధుల్లో భాగంగా విశాఖ ఏజన్సీలో మావోయిస్టుల ఏరివేత కోసం కూంబింగ్ కు వెళ్లాడు. కూంబింగ్ పూర్తయిన తర్వాత హైదరాబాద్ తిరిగి వస్తున్న సమయంలో ఓబులేసుకు చెందిన ఏకే47 తుపాకీ విజయవాడలో మాయమైంది.



అయితే  అతను గన్ మిస్సయిన  విషయాన్ని ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా దాచిపెట్టాడు. అయితే  ఆ తర్వాత ఏకే47 మిస్ అయినట్టు అధికారుల తనిఖీల్లో తేలింది.  దాంతో ఈ విషయం బయటకు తెలిస్తే  రచ్చరచ్చ అవుతుందని భావించిన పోలీస్ ఉన్నతాధికారులు... చడీచప్పుడు చేయకుండా ఓబులేసును అంబర్ పేట్ సీపీఎల్ కు బదిలీ చేసి చేతులు దులుపుకున్నారు.



అయితే అప్పటి నుంచే పక్కా పథకం వేసుకున్న ఓబులేసు ...బడా బాబులను కిడ్నాప్ చేసి కోట్ల రూపాయలు దండుకునేందుకు ప్రయత్నాలు చేశాడు. అందులో భాగంగానే అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిని అపహరించేందుకు యత్నించి విఫలమై అడ్డంగా దొరికిపోయాడు. గతంలోనూ ఓబులేసు ...ఓ ఉన్నతాధికారిని కిడ్నాప్ చేసి రూ.10 లక్షలు వసూలు చేసి, విషయం బయటకు చెబితే ...హతమార్చుతానని ఆ అధికారిని బెదిరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పోలీసులు రెండు కేసులపైనా విచారణ జరుపుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top