పందెం కాస్కో!

పందెం కాస్కో!


దీపావళి ముసుగులో కోడిపందేలు

 

 కోడి పందేల సంస్కృతి జిల్లాకు కూడా పాకింది. పోలీసుల అనుమతితో ఈ జూదం నిర్వహిస్తూ బెట్టింగ్‌రాయుళ్లు రెచ్చిపోతున్నారు. పొరుగు జిల్లాల నుంచి వస్తున్న పందెంరాయుళ్లకు మందు, విందు సకల సౌకర్యాలు సమకూర్చుతున్నారు. పోలీసులు, కొందరు మీడియా ప్రతినిధులు, ఓ ప్రజాప్రతినిధి అండతో సాగుతున్న చీకటి ఆటలో సామాన్యుల జేబులు గుల్లవుతున్నాయి. వీపనగండ్ల శివారులో యథేచ్ఛగా సాగుతున్న కోడిపందేల బాగోతమిది..!

 

 సాక్షి ప్రతినిధి,  మహబూబ్‌నగర్:

 దీపావళి పండుగ ముసుగులో పది రోజులుగా వీపనగండ్ల శివారులో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. వీపనగండ్ల నుంచి తూంకుంటకు వెళ్లే దారిలో సుమారు 2కి.మీ దూరంలో గుంతవంపు అనే ప్రదేశాన్ని నిర్వాహకులు అడ్డాగా మార్చుకున్నారు. చుట్టూ దట్టంగా చెట్లుండడంతో సామాన్యులకు ఈ ప్రదేశం అంత సులువుగా కని పించదు. దీపావళి సందర్భంగా ఏటా ఈ పందేలను ఆనవాయితీగా నిర్వహిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.



వీపనగండ్లకు చెందిన బోయ బాలచంద్రయ్య అనే వ్యక్తితో పాటు మరో నలుగురు యువకులు బెట్టింగుల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అనువైన ప్రాంతాన్ని ఎంచుకుని బరి గీసి మరీ కోడిపందేలు నిర్వహిస్తున్నారు. ఉదయం 11గంటలకు మొదలయ్యే బెట్టింగు రాయుళ్ల సందడి సాయంత్రం 6గంటల వరకు కొనసాగుతోంది. బైక్‌లు, ఆటోలతో పాటు ప్రత్యేకంగా వాహనాలు సమకూర్చుకుని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ వాలిపోతున్నారు.



 సకల సౌకర్యాలు

 మహబూబ్‌నగర్, కొల్లాపూర్, వనపర్తి తది తర ప్రాంతాలతోపాటు కర్నూల్, ఒంగోలు, గుంటూరు వంటి సుదూరప్రాంతాల నుంచి బెట్టింగురాయుళ్లు పెద్దసంఖ్యలో వస్తున్నారు. పందేల్లో పాల్గొనేందుకు వస్తున్న వారికి చి కెన్ బిర్యానీ,చికెన్ రైస్,ఉడికించిన కోడిగుడ్లు, మద్యం, ఇతర తినుబండారాలు సమకూర్చేందుకు ప్రత్యేకంగా శిబిరాలు ఏర్పాటు చేశారు. ఒక్కో పందెం రూ.5వేల నుంచి మొదలుకుని రూ.50వేల వరకు సాగుతోంది. రోజుకు కనీసం నాలుగు నుంచి ఆరు పందేలు నిర్వహిస్తుండడంతో రోజూ లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయి. బెట్టింగురాయుళ్లు రూ.500 నుంచి రూ.5వేల వరకు పందెంగా ఒడ్డుతున్నారు. పందెంలో ఓడినా కోడిమాంసం రుచిచూసేందుకు వేలాది రూపాయలు వెచ్చిస్తూ మరీ పోటీపడుతున్నారు.



 పోలీసుల కనుసన్నల్లోనే!

 వీపనగండ్ల సాగుతున్న కోడిపందేల వ్యవహారం పోలీసు యంత్రాంగం కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది. పందెం జరిగే ప్రాంతానికి వెళ్లే కొత్తవారిపై నిర్వాహకులు నిఘాపెడుతూ శల్య పరీక్ష చేస్తున్నారు. అనుమానాస్పదంగా కనిపిస్తే దాడులు చేసేందుకైనా వెనుకాడని పరిస్థితి కనిపిం చింది. జిల్లా ఎస్పీ బదిలీ కావడం, కొత్త ఎస్పీ బాధ్యతలు తీసుకోకపోవడం స్థానిక పోలీసులు, బెట్టింగు నిర్వాహకులకు వరంగా మారింది. స్థానిక పోలీసులకు భారీ మొత్తంలో ముట్టజెప్పిన నిర్వాహకులు పది రోజులుగా యథేచ్ఛంగా కోడిపందేలు కొనసాగిస్తున్నారు.



 పైగా తాము పోలీసుల అనుమతితోనే బెట్టిం గులు నిర్వహిస్తున్నట్లు బహిరంగంగా చెప్పడం శోచనీయం. ఓ ముఖ్య ప్రజాప్రతినిధి కూడా ఈ అనుమతుల వ్యవహారం వెనుక కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. స్థానిక మీడియాతో పాటు డీఎస్పీ స్థాయి అధికారి నుంచి కిందిస్థాయి అధికారి వరకు ముడుపులు అందినట్లు తెలిసింది. దీపావళి పండుగ ముసుగులో ప్రారంభమైన ఈ దందా మరికొంత కాలం సాగే అవకాశం కనిపిస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top