కరువు కౌగిట కరీంనగర్

కరువు కౌగిట కరీంనగర్ - Sakshi


మానేరులో నీరు లేదు.. చేలల్లో చెమ్మ లేదు...

 

 ఎక్కడివక్కడ ఎండిపోయిన చెరువులు, పంటలు

 గుక్కెడు నీటికి అల్లాడుతున్న పల్లెలు, పట్టణాలు

 గడ్డి లేక పశువులను అమ్ముకుంటున్న రైతన్నలు


 

 ఈ చిత్రం చూశారా...?

 యాభై ఏళ్ల క్రితం మానేరు డ్యాం నిర్మాణానికి ముందు కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్లే రహదారి ఇది. ఇప్పుడు డ్యాంలో నీరు పూర్తిగా ఎండిపోవడంతో ఇలా బయటపడింది..

 

 తెలంగాణలోనే కాదు... తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక ధాన్యాన్ని పండించే జిల్లా కరీంనగర్! ఉభయ గోదావరి జిల్లాలను తలదన్నేలా తీరొక్క పంటలతో అలరారుతూ అన్నపూర్ణగా విరాజిల్లిన జిల్లా. కానీ నేడు సాగు సంగతి దేవుడెరుగు... గుక్కెడు నీటి కోసం అలమటిస్తోంది. ఎటు చూసినా ఎండిన పంటలు... ఎడారిని తలపిస్తున్న మానేరు... తాగునీటి కోసం జనం కష్టాలే దర్శనమిస్తున్నాయి. నలుగురికి అన్నం పెడుతూ రాజుగా బతికిన రైతన్నకు నేడు బతుకుదెరువే భారమైంది. జిల్లాలో రోజూ ఏదో ఒక మూల అన్నదాత మరణ మృదంగం విన్పిస్తోంది. ఆవులు, గేదెలకు గ్రాసం లేక అంగట్లో అమ్ముకుంటున్నారు. కరువు దెబ్బకు కన్నీరు పెడుతున్న పల్లెల్లో ఉండలేక లక్షలాది మంది యువత ఉపాధి కోసం వలస బాట పడుతున్నారు. కరీంనగర్‌లో కరువుపై సాక్షి ప్రత్యేక కథనం.                -పసునూరు మధు, సాక్షి ప్రతినిధి, కరీంనగర్

 

 రైతు సంతతి అంతరించిపోతున్నది వ్యవసాయ సంస్కృతిలోంచి మొలకెత్తే మనిషి తొలిగిపోతున్నడు వ్యాపారం పులి నాగలిపై స్వారీ చేస్తున్నది రెండెడ్లను స్వాహాచేసి త్రేనుస్తున్నది నాగలి కర్రను ముక్కలు చేసి మంటేసి చలి కాచుకుంటున్నది దళారి ఒకడు రంగప్రవేశం చేశాడు రైతు మరణ హనన ఆజ్యం పోసి రాజ్యానికి కానుక ప్రకటిస్తున్నడు ఇప్పుడు పది జిల్లాల్లో ఒకటే పాట ఒక్కటే రాగం.. ఒక్కటే పల్లవి అంతట ఒక్కటే దరువు చావు డప్పుల మధ్య మరణ నృత్యం సామూహిక గానమై పరవశిస్తున్నది

  - ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు

 


 అంతటా దాహం దాహం

 గత ఐదు దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేని విధంగా కరీంనగర్ జిల్లాలో తాగునీటికి కటకట ఏర్పడింది. పల్లె, పట్నం తేడా లేకుండా  నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో ఏ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీకి వెళ్లినా నీళ్ల కష్టాలే కనిపించాయి. మంత్రి ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గ కేంద్రంలో చుట్టుపక్కల చెరువులన్నీ ఎండిపోవడంతో నాలుగు నెలలుగా నల్లా నీళ్లు బంద్ చేశారు. ప్రస్తుతం ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నా.. ప్రజల అవసరాలు 30 శాతానికి మించి తీరడం లేదు. దీంతో జనం మూడ్రోజులకో ట్యాంకర్ చొప్పున నీటిని కొనుగోలు చేస్తున్నారు.



ఇక మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల పట్టణంలో రోజువిడిచి రోజు నీటి సరఫరా చేస్తున్నా... పలు కాలనీలు, వాడల్లో తాగునీటి కటకట ఏర్పడింది. స్థానిక ఇందిరమ్మ కాలనీని ‘సాక్షి’ బృందం సందర్శించగా ఒక్కో ఇంటి వద్ద 4, 5 డ్రమ్ములు దర్శనమిచ్చాయి. ఈ కాలనీలో మొత్తం 1,100 కుటుంబాలు నివాసముంటుండగా... 5,200 డ్రమ్ములు ఉండటం విశేషం! వారానికోసారి ట్యాంకర్ల ద్వారా నీళ్లు వచ్చినప్పుడు డ్రమ్ముల్లో నింపుకుంటూ వాడుకుంటున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. శ్రీరాజరాజేశ్వరస్వామి నిలయమైన వేములవాడ పట్టణంలోనూ గత నాలుగు నెలలుగా నల్లా నీటి సరఫరా ఆగిపోయింది.



పట్టణంలో తాగునీటికి తీవ్ర ఎద్దడి నెలకొంది. ప్రైవేటు ట్యాంకర్లే దిక్కయ్యాయి. కోరుట్ల మున్సిపాలిటీలో గత 6 నెలల కాలంలో నల్లాల ద్వారా నీరు సరఫరా అయ్యింది కేవలం 45 రోజులే. గత నెల రోజులుగా నల్లాలు పూర్తిగా బంద్ అయ్యాయి. మిగిలిన పట్టణాల్లోనూ వారానికి, రెండు మూడు రోజులకోసారి నీరు సరఫరా అవుతోంది. కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లలోని అపార్ట్‌మెంట్లలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. ప్రతిరోజూ రూ.3 వేలు వెచ్చించి ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకుంటూ అపార్ట్‌మెంట్ వాసులలు నీటి అవసరాలు తీర్చుకుంటున్నారు.

 

 చతికిలపడిన సాగు

 కరీంనగర్ జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 5.3 లక్షల హెక్టార్లు(13 లక్షల ఎకరాలు). సరిగ్గా మూడేళ్ల కిందట (2013-14) ఖరీఫ్ సీజన్‌లో సాధారణ సాగుకు మించి 14.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేసి రికార్డు సృష్టించింది. కానీ ఈసారి కరువు దెబ్బకు సీన్ రివర్స్ అయ్యింది. జిల్లాలో ఈ ఏడాది సాగు పూర్తిగా చతికిలపడింది. రబీ సీజన్‌లో కేవలం 2,79,670 ఎకరాల్లోనే సాగు చేయగా... నీటి వసతి లేక అందులో 60 శాతానికిపైగా పంటలు ఎండిపోయాయి. ఉన్న కొద్ది పంటను సాగు చేసుకునేందుకు రైతులు పడుతున్న కష్టాలు అన్నీ కావు. నీళ్లు లేక ఎండిన బోర్ల స్థానంలో రూ.లక్షల అప్పు తెచ్చి కొత్త బోర్లు వేసుకుంటున్నారు. జిల్లాలో కొత్తగా వేసిన బోర్లలో 100కు 70 శాతం ఫెయిలవుతున్నాయి.



వెయ్యి అడుగుల మేరకు బోరు వేసినా చుక్క నీరు రాని ప్రాంతాలెన్నో ఉన్నాయి. మానేరు తీర ప్రాంతాల్లోని రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు ఏకంగా మానేరు నదిలో బోర్లు వేసి అక్కడి నుంచి కిలోమీటర్ల కొద్దీ పైపుల ద్వారా నీటిని పంటలకు తీసుకెళ్తున్నారు. గోదారిలో బోర్లు వేసి పైపుల ద్వారా నీటిని మళ్లిస్తూ జిల్లాలో సుమారు 30 వేల ఎకరాలను కాపాడుకుంటున్నారు. ఈ సీజన్‌లో అన్నదాతకు కలిసొచ్చే ఏకైక పంట మామిడి. నీళ్లు లేక ఆ తోటలు కూడా ఎండిపోతున్నాయి. హుస్నాబాద్, హుజూరాబాద్, జగిత్యాల ప్రాంతాల్లోని పలు గ్రామాల్లో ఎండిన మామిడి తోటలు దర్శనమిస్తున్నాయి. అక్కడక్కడా కాతకు వచ్చిన తోటలు సైతం తరచూ గాలివానతో కాయలు రాలిపోతున్నాయి.

 

 కేసీఆర్ ఇంటెక్‌వెల్‌కు కష్టకాలమొచ్చే!





 ఈ చిత్రం చూశారా... సరిగ్గా పదిహేనేళ్ల క్రితం నాటి సిద్దిపేట ఎమ్మెల్యే, ప్రస్తుత  సీఎం కేసీఆర్ సిద్దిపేటకు తాగునీటి  కోసం కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం హన్మాజీపల్లె వద్ద మానేరు నది మధ్యలో ఇంటెక్‌వెల్‌ను ఏర్పాటు చేశారు. మానేరు డెడ్‌స్టోరేజీకి వచ్చినా సిద్దిపేటకు తాగునీటికి ఇబ్బంది లేకుండా నీరు వచ్చేలా ఇంజనీర్లు నది మధ్యలో దీన్ని నిర్మించారు. మానేరు డ్యాం నుంచి ఇంటెక్‌వెల్ వరకు కాలువలు కూడా తవ్వించారు.



ఒకవేళ డెడ్‌స్టోరేజీకి చేరితే డ్యాంలోని కొద్దిపాటి నీళ్లను సైతం పంపింగ్ ద్వారా కాలువలోకి మళ్లించి అక్కడ్నుంచి ఇంటెక్‌వెల్ ద్వారా సిద్దిపేటకు తాగునీరు ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. గత పదేళ్లలో ఏనాడూ మానేరు డెడ్‌స్టోరేజీకి రాలేదు. ఈ ఏడాది కరువు దెబ్బకు గోదారి ఎండిపోవడంతో లోయర్ మానేరు డ్యాం డేడ్‌స్టోరేజీకి చేరింది. ఇంటెక్‌వెల్‌లోని పైపులన్నీ పైకి తేలాయి. దీంతోపాటు నాడు ఇంటెక్‌వెల్ నుంచి ఎల్‌ఎండీ వరకు తవ్వించిన కాలువ బయటకు కన్పిస్తోంది. కరువు పరిస్థితి ఇట్లాగే కొనసాగితే మరోనెల రోజుల మించి సిద్దిపేటకు నీళ్లు సరఫరా అయ్యే పరిస్థితి లేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

 

 మేత లేక పశువులు కబేళాకు..

 హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో వారానికోసారి జరిగే అంగడికి రైతులు తీసుకొచ్చిన  పశువులు ఇవి. రెండు నెలలుగా ఈ అంగడిలో ప్రతీ వారం సగటున వెయ్యి పశువులు కబేళాకు తరలిస్తున్నట్లు అంచనా. గత నెల రోజులుగా ప్రతీ వారం వందకుపైగా లారీల్లో ఆవులు, గేదెలు కబేళాకు తర లించారు. గత శుక్రవారం ఈ అంగడిని ‘సాక్షి’ సందర్శించగా... ఒక్క గంటలోనే 30కి పైగా లారీల్లో పశువులను తరలించారు. నీళ్లు, మేత లేక బక్కచిక్కిన పశువులతోపాటు లీటర్ల కొద్దీ పాలిచ్చే వందలాది గేదెలు, ఆవులు సైతం అంగడిలో కన్పించాయి. నీళ్లు, మేత లేకపోవడంతో వాటి పోషణ భారమైందని, అందుకే అమ్ముకుంటున్నామని పశువుల యజమానులు చెప్పారు. జిల్లాలో 15 కేంద్రాల్లో పశువుల వార సంతలు జరుగుతున్నాయి. ప్రతీ వారం సగటున ఒక్కో సంతలో 200 చొప్పున అన్ని కేంద్రాల్లో 3 వేల పశువులు కబేళాకు వెళుతున్నాయి. ఈ లెక్కన జిల్లాలోని అన్ని సంతల్లో కలిపి నెలకు సుమారు లక్ష పశువులు కబేళాకు తరలిస్తున్నట్లు అంచనా.

 

 ఇటు కరువు కాటు.. అటు గల్ఫ్ గాయం

 కరువు దెబ్బతో పొట్టచేతబట్టుకొని గల్ఫ్ దేశాలకు వెళ్తున్న యువత అక్కడ కూడా మోసానికి గురవుతున్నారు. సిరిసిల్ల, వేములవాడ, కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల్లో సగటున 20 కుటుంబాలకు ఒక్కరు చొప్పున గల్ఫ్ దేశాలకు వెళ్లినవారే ఉన్నారు. ఎల్లారెడ్డిపేట వీర్నపల్లి గ్రామాన్ని సందర్శించగా 50 మంది యువకులు దుబాయ్ వెళ్లినట్టు తెలిసింది. వీరిలో 15 మంది మోసపోయి మళ్లీ సొంత గ్రామానికి తిరిగొచ్చారు. మల్లారపు రవి అనే యువకుడిని సాక్షి కదిలిస్తే ‘సార్ ఇంట్ల ఎల్లకపోవడంతో రూ.2 లక్షలు అప్పు చేసిన. దుబాయ్ పోతే అప్పు తీర్చడంతోపాటు డబ్బులు సంపాదించుకోవచ్చని ఓ ఏజెంట్ చెబితే మరో లక్ష అప్పు చేసి గత జూన్‌లో దుబాయ్ పోయిన. అక్కడి నెలకు 1200 దిర్హమ్స్ ఇస్తామని ఆశపెట్టారు. తీరా ఆడికి పోతే నెలకు రూ.600 చొప్పున ఇచ్చిండ్రు. రోజూ 12 గంటలు పనిచేయించుకున్నరు. పని ఒత్తిడికి ఆరోగ్యం దెబ్బతిన్నది. డబ్బులు తిండికి, నా ఆరోగ్యానికే సరిపోయినయ్. ఇక్కడికి వచ్చి ఉపాధి కూలీకి పోతున్న’ అని వాపోయాడు.

 

 నీళ్లులేక మామిడి చెట్ల నరికివేత

 మామిడి, బత్తాయి రైతును కరువు నిండా ముంచుతోంది. కోహెడ మండలంలోని తీగలకుంటపల్లికి చెందిన రైతు భట్టు చంద్రారెడ్డి తనకున్న 9 ఎకరాల పొలంలో మామిడి సాగు చేశాడు. పంటకు నీరందక దాదాపు సగం చెట్లు ఎండిపోయాయి. లాభం లేదనుకుని మామిడి చెట్లన్నీ నరికివేశాడు. అదే ఊళ్లో గన్నెబోయిన వెంకటేశ్వరావు వేసిన బత్తాయి తోటదీ ఆదే పరిస్థితి. నీళ్లలేక బత్తాయి ఎదగడం లేదని, ఇప్పటికే పంటపై రూ.3 లక్షల అప్పు చే శానని ఆయన గోడు వెళ్లబోసుకున్నాడు.

 

 చెరువులన్నీ ఎండిపాయె..


 జిల్లాలో మానేరు నది ఎడారిని తలపిస్తోంది. కాలువలన్నీ ఒట్టిపోయాయి. దాదాపు జిల్లాలోని చెరువులన్నీ ఎండిపోయాయి. దీంతో తెనుగ, ముదిరాజ్, మత్స్యకారులకు పని లేకుండా పోయింది. వారంతా పొట్టకూటి కోసం అడ్డా కూలీలుగా మారుతున్నారు. సిరిసిల్ల మండలంలోని సారంపల్లి పెద్ద చెరువును సందర్శించగా.. చేపల అమ్మకమే జీవనాధారంగా బతుకుతున్న ముదిరాజ్ కులస్తులు ఆ  ఎండిన చెరువు గట్టుపై కూర్చొని బతుకు దెరువు కోసం ఏం చేయాలా? అని చర్చించుకుంటున్నారు. సంఘం పెద్ద దాసరి రాజయ్యను కదిలించగా...‘కరువుతో పొలం సాగుచేయలేదు. చేపలు పడదామంటే చెరువులో నీళ్లే లేకపాయే. ఎట్లా బతకాలో అర్థం కాక ఈడ కూసున్నం. మావోళ్లంతా రోజూ కూలీ కోసం సిరిసిల్ల అడ్డా కాడికి పోయొస్తున్నరు. ఒకరోజు పని దొరికితే...మూడు రోజులు పస్తులుండాల్సి వస్తోంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి కరువైన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

 

 ఉపాధి కష్టమాయే!

 చీర్లవంచ గ్రామంలో నెత్తిన బేసిన్ తట్ట పెట్టుకుని కూలీ కోసం వెళ్తున్న మహిళలు వీరంతా. ఉపాధి హామీ పనులకు వెళుతున్నారా? అని వారిని అడగ్గా.. ‘ఈ ఎండలకు చెరువులన్నీ ఎండిపోయినయ్. భూమి గట్టి పడింది. మా ఏరియాలో కందకాలు తవ్వాలంటే గడ్డపార భూమిలోకి దిగుతలేదు. మగోళ్లకు రోజుకు రూ.వంద ఇస్తున్నారు. మాకు ఆ పని చేతగాక మామిడి కాయలు తెంపేందుకు వెళుతున్నాం’ అని పేర్కొన్నారు. రోజంతా కష్టపడితే రూ.150 కూలి ఇస్తారన్నారు.

 

 ప్రైవేటు బావులు, బోర్లను అద్దెకు తీసుకుని నీరందిస్తున్నాం

 జిల్లాలో తాగునీటి ఎద్దడి నెలకొన్న గ్రామాల్లో ప్రైవేటు బోర్లు, బావులను అద్దెకు తీసుకుని తాగునీరు సరఫరా చేస్తున్నాం. జియాలజిస్టుల సిఫారసు మేరకు కొత్త బోర్లు, బావుల తవ్వకానికి సిఫారసు చేస్తున్నాం. తాగునీటి కోసం నిధుల సమస్య లేనే లేదు. ఎన్ని నిధులైనా కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎక్కడ నీటి సమస్య ఉందో అక్కడ యుద్ధ ప్రాతిపదికన నీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

     - కలెక్టర్ నీతూప్రసాద్

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top