అన్నిదానాల్లో కన్యాదానం మిన్న: గవర్నర్

అన్నిదానాల్లో కన్యాదానం మిన్న: గవర్నర్ - Sakshi


102 జంటలకు సామూహిక వివాహం

నాగర్‌కర్నూల్: అన్నిదానాల్లో కన్నా కన్యాదానం గొప్పదని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూల్‌లో స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఎంజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక వివాహాల కార్యక్రమానికి ఆయన హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ఒక్కటైన వధూవరుల ముందు పెద్దబాధ్యత ఉందని, కష్టపడి పనిచేసి బాధ్యతగా మెలగాలని సూచించారు.



భార్యాభర్తలు నిండునూరేళ్లు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం ప్రజలకు అన్నీ చేయాలంటే కష్టమని, ప్రజలు బాధ్యతతో రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఎమ్మెల్యేగా మర్రి జనార్దన్‌రెడ్డి ఎంజేఆర్ ట్రస్ట్ ద్వారా పెద్ద బాధ్యతను తీసుకోవడం అభినందనీయమని,102 జంటలకు వివాహం జరిపించడం గొప్ప కార్యమని కితాబిచ్చారు. అనంతరం అర్హులైన జంటలకు కల్యాణలక్ష్మీ పథకం ద్వారా మంజూరైన రూ.51 వేల చెక్కులను గవర్నర్ అందజేశారు.



102జంటలను గవర్నర్ నరసింహన్ ఆశీర్వదించారు. వేడుకల్లో మంత్రులు ఈటల రాజేందర్, జూపల్లి కృష్ణారావు, డాక్టర్ సి.లక్ష్మారెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top