ఇంట్లో కన్నవాళ్ల శవాలు.. పరీక్ష హాల్లో విద్యార్థులు

ఇంట్లో కన్నవాళ్ల శవాలు.. పరీక్ష హాల్లో విద్యార్థులు

  • మహబూబ్‌నగర్, నల్లగొండ, మెదక్ జిల్లాల్లో పుట్టెడు దుఃఖంలో టెన్త్ పరీక్ష రాసిన ముగ్గురు

  • వెల్దండ/ నాంపల్లి: కన్నవాళ్ల శవాలు ఇంట్లో ఉండగా, తప్పని పరిస్థితుల్లో పదో తరగతి పరీక్షలు రాయాల్సిన దీన స్థితి ఈ విద్యార్థులది. తమ వాళ్లు ఇక లేరన్న దుఖంలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న  ఆ విద్యార్థులకు పెద్దలు ధైర్యం చెప్పి పరీక్షలకు పంపించిన ఘటనలు మహబూబ్‌నగర్, నల్లగొండ, మెదక్ జిల్లాల్లో గురువారం చోటు చేసుకున్నాయి.  



    మహబూబ్‌నగర్ జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన గుర్రం రామచంద్రయ్య టీబీతో గురువారం మృతి చెందాడు. అతని కూతురు శివలీల పదో తరగతి చదువుతోంది. తండ్రి మరణించిన రోజునే ఆమె పదో తరగతి పరీక్ష రాయాల్సి ఉంది. పెద్దల సలహాతో పరీక్షకు మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలోని పరీక్షా కేంద్రానికి వచ్చి పరీక్ష రాసింది. తర్వాత తండ్రి అంత్యక్రియల్లో పాల్గొంది.

     

    నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం ఎరుగండ్లపల్లి గ్రామానికి చెందిన ఇరుగోని అంజమ్మ(36)కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమె బుధవారం సాయంత్రం చనిపోయింది. ఆమె ఏకైక కుమారుడు శివకుమార్ స్థానిక జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి చదువుతున్నాడు. అనారోగ్యంతో ఉన్న తల్లిని వదిలి శివకుమార్ పరీక్షకు వెళ్లి వచ్చే వరకు మరణించింది. గురువారం పరీక్ష ఉండగా, ఇంట్లో తల్లి మృతదేహం ఉండడంతో ఏం చేయాలో తెలియక రోదించాడు. గ్రామస్తులు ధైర్యం చెప్పడంతో పరీక్ష రాసి వచ్చి తల్లికి తలకొరివి పెట్టాడు.  

     

    మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం అంతాయిగూడ గ్రామానికి చెందిన తిగుల్ల నర్సయ్యది వ్యవసాయం కుటుంబం. మంగళవారం ఇంట్లో చిన్న గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన నర్సయ్య అదే రోజు రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం మృతి చెందాడు. అదే రోజు సాయంత్రం మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. నర్సయ్య కూతురు కృష్ణవేణి చిన్నకిష్టాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతుంది. గురువారం ఉదయం తండ్రి శవం ఇంట్లోనే ఉంది. పుట్టెడు దుఃఖంలో కొండపాక మండలం కుకునూర్‌పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం పరీక్ష రాసింది. మధ్యాహ్నం తండ్రి అంత్యక్రియల్లో పాల్గొంది.

     

    ఆత్మస్థైర్యానికి బెస్ట్ ఆఫ్ లక్..

    అతనికి చేతులున్నాయి.. కానీ పని చేయవు.. అయినా అధైర్యపడలేదు. కాళ్లనే చేతులుగా మార్చుకొని తన రాత రాసుకుంటున్నాడు వరంగల్ జిల్లా దేవరుప్పుల మండలం దారావత్ తండాకు చెందిన దారావత్‌స్వామి. పుట్టుకతో అంగవైకల్యం పొందిన స్వామి కండవెండి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివాడు. మండల కేంద్రంలోనే పదో తరగతి పరీక్షలు రాస్తున్నాడు. అందరు విద్యార్థులు చేతులతో పరీక్ష రాస్తుండగా, తను మాత్రం కాళ్లతో చకచకా పరీక్ష రాస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.     

    -దేవరుప్పుల

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top