మర్డర్ మిస్టరీలు వీడేనా!

మర్డర్ మిస్టరీలు వీడేనా! - Sakshi


హంతకులు పోలీసులకు సవాల్ విసిరారు. హత్యలు చేసి దర్జాగా తప్పించుకున్నారు. ఆనవాళ్లూ లభించకపోవడంతో హతులెవరో కూడా పోలీసులు గుర్తించలేకపోయారు. ఇటీవల కామారెడ్డి డివిజన్‌లో ఇద్దరు మహిళల మృతదేహాలు లభించిన విషయం తెలిసిందే. హంతకులు మృతదేహాలను కాల్చి బూడిద చేయడంతో పోలీసులు హతులెవరో కూడా కనిపెట్టలేకపోయారు.

 

* పోలీసులకు సవాల్ విసిరిన హంతకులు

* ఆనవాళ్లు దొరక్క.. మృతదేహాలనూ గుర్తించలేక..

* ముందుకు సాగని దర్యాప్తు


కామారెడ్డి :  పట్టణానికి సమీపంలోని టేక్రియాల్ శివారులో జాతీయ రహదారిపై పోలీసులకు గత నెల 30న ఓ మహిళ మృతదేహం కనిపించింది. కాలిపోయి గుర్తు పట్టలేని స్థితిలో మృతదేహం పడి ఉంది. ఈ సంఘటన జరిగిన నాలుగు రోజులకే ఇదే రీతిలో దహనం చేయబడిన మరో మహిళ మృతదేహం సదాశివనగర్ మండలం భూంపల్లి శివారులో లభ్యమైంది. రెండు మృతదేహాలు ఒకే రీతిలో దహనం చేయబడి ఉండడంతో రెండు హత్యలు ఒకే రోజు జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఒకే ముఠా ఈ హత్యలకు పాల్పడి ఉంటుందని అనుమానిస్తున్నారు.



జాతీయ రహదారిపై ఒక మహిళ శవం పడి ఉండడం వల్ల ఆ రోజు హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్లిన వాహనాలకు సంబంధించిన వివరాలను పోలీసులు సేకరించారు. ఇందల్వాయి, తూప్రాన్ టోల్‌గేట్ల నుంచి నిఘా కెమెరాల క్లిప్పింగులను తెప్పించి పరిశీలిస్తున్నారు. అదృశ్యం అయిన మహిళల వివరాల కోసం కూడా పోలీసులు జిల్లాతో పాటు పొరుగు జిల్లాలన్నింటికీ సమాచారం పంపించారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో హత్యలు మిస్టరీగా మారాయి. ఎక్కడో హతమార్చి, వాహనాల్లో తీసుకువచ్చి పెట్రోల్ పోసి కాల్చి ఉంటారని భావిస్తున్నారు. దీంతో మృతులెవరో గుర్తు పట్టలేకపోతున్నారు. హతులు, హంతకులు ఇదే జిల్లాకు చెందిన వారా, లేక ఇతర జిల్లాలకు చెందిన వారా అన్న విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.

 

కరడుగట్టిన నేరస్తుల పనేనా...

ఈ రెండు హత్యలకు సంబంధించి పోలీసులకు ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదు. మహిళలను హతమార్చి, పెట్రోల్ చల్లి నిప్పంటించడం కరడుగట్టిన నేరస్తులకే సాధ్యమవుతుందని పోలీసులు పేర్కొంటున్నారు. మృతదేహానికి నిప్పంటించి, పూర్తిగా కాలిపోయిన తర్వాతనే హంతకులు అక్కడి నుంచి పారిపోయి ఉంటారని భావిస్తున్నారు. హత్యకు గురైన మహిళలు ఎవరో తెలిస్తే కానీ హంతకులను పట్టుకోవడం సాధ్యం కాదని పోలీసు అధికారులు స్పష్టం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో పెద్ద పెద్ద కేసులను సైతం తక్కువ సమయంలో ఛేదించడం ద్వారా తమ సత్తా చాటుకున్న పోలీసులకు ఈ రెండు హత్యల మిస్టరీని ఛేదించడం సవాల్‌గా మారింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top