పండుటాకుల గోడు..


పండుటాకుల గోడు : సెంటినరీకాలనీ: కమాన్‌పూర్ మండలం కల్వచర్ల గ్రామానికి చెందిన పలువురు వృద్ధులు ఆసరా పింఛన్ల కోసం ఆందోళన చేశారు. అర్హులైన వారికి కూడా పింఛన్లు అందడం లేదంటూ గ్రామంలోని పెద్దపల్లి-మంథని ప్రధాన రహదారిపై మంగళవారం రాస్తారోకో చేశారు. పండు ముసలి వారమైన తమకే పింఛన్లు రాకుంటే ఈ గవుర్మెంటు ఇంకెవరికి ఇస్తుందని, తమకు దిక్కెవరని వాపోయారు.

 

 అర్హులందరికీ పింఛన్లు ఇస్తామంటూ పదే పదే చెబుతున్న నాయకులు తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. సింగరేణిలో రూ.3వేల లోపు పింఛన్ పొందుతున్న మాజీ కార్మికులకు ఆసరా పింఛన్లు ఇస్తామంని మొండిచేయి చూపారని మండిపడ్డారు. ఎన్నో ఏళ్ల కింద  రిటైరన తమకు అటు సింగరేణి పింఛన్ లేక, ఇటు ఆసరా అందక ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇప్పటికైనా సర్కారు ఆదుకోకుంటే తమ బతుకులు బజారునపడుతాయంటూ పలువురు వృద్ధులు కంటతడి పెట్టుకున్నారు.

 

 ఉన్నది తీసేసిండ్రు..

 నేను బాయి పని బంద్‌జేసి ఇరవై ఐదేండ్లు అయితుంది. అప్పుడు మాకు జీతం తక్కువ ఇచ్చిండ్రు. పింఛనుగూడ లేదు. గవుర్మెంటు పింఛను ఇచ్చి ఆదుకుంటదనుకుంటే ఉన్నయి తీసేసిండ్రు. ఇగ మేము ఎట్ల బతుకాలె..

 -ఆర్ల మధునయ్య, సింగరేణి మాజీ ఉద్యోగి

 

 తిండికి తిప్పలయితుంది

 నా కొడుకులు ఆళ్ల బతుకులు ఆళ్లు బతుకుతుండ్రు. నాకు తిండికి తిప్పలయితుంది. మునుపు ఇచ్చినట్టు రెండు వందలు ఇచ్చినా మంచిగుండు. ఈ గవుర్మెంటు ఎయ్యి రూపాలు ఇత్తదనని ఆశపడితే.. బొత్తిగ తీసేసింది. గిదేం న్యాయం?                   

 - ఊదరి మల్లమ్మ, కల్వచర్ల

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top