కాళేశ్వరానికి ‘పర్యావరణ’ బ్రేక్‌!

కాళేశ్వరానికి ‘పర్యావరణ’ బ్రేక్‌! - Sakshi


కేంద్ర జల సంఘం ఓకే చెప్పేంత వరకు అనుమతులివ్వలేం

l    స్పష్టం చేసిన కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ

l    నేడు ఢిల్లీకి విద్యాసాగర్‌రావు, సీఈ




సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కింద పర్యావరణ ప్రభావ మదింపు(ఈఐఏ)నకు బ్రేక్‌ పడింది! ఈ ప్రాజెక్టుకు కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) అనుమతులు ఇచ్చేవరకు తాము ఈఐఏకు అనుమతులు ఇవ్వబోమని కేంద్ర పర్యావర ణ, అటవీ శాఖ తేల్చిచెప్పింది. ప్రాజెక్టు సాంకేతిక, ఆర్థిక సాధ్యాసా ధ్యాలపై చర్చించాకే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపింది. ఈ మేరకు ఇటీవల ఢిల్లీలో జరిగిన ఎక్స్‌పర్ట్‌ అప్రైజల్‌ కమిటీ(ఈఏసీ) రెండో సమావేశపు మినిట్స్‌ను పర్యావరణ మంత్రిత్వ శాఖ తాజాగా వెబ్‌సైట్‌లో ఉంచింది. మునుపెన్నడూ లేని విధంగా ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతులు వచ్చాకే ఈఐఏకు అనుమతిస్తామనడంపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనిపై తేల్చుకునేందుకు నీటి పారుదల శాఖ అధికారులు సోమవారం ఢిల్లీ వెళ్తున్నారు.



పర్యావరణ అనుమతులకు ఆగాల్సిందే

సుమారు 18.25 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించే లక్ష్యంతో రూ.80,499.71 కోట్ల అంచనాతో కాళేశ్వరం ప్రాజెక్టును చేపడుతున్న విషయం తెలిసిందే. గోదావరి నుంచి మొత్తం 180 టీఎంసీలను మళ్లించేలా 26 రిజర్వాయ ర్లను నిర్మించేందుకు ప్రణా ళిక వేశారు. ప్రాజెక్టు పరిధిలో మొత్తంగా 80 వేల ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంది. 2,866 హెక్టార్లు (13,706 ఎకరాల)మేర అటవీ భూమి అవసరం ఉంది. ఈ మొత్తం భూమిలో 13,706 హెక్టార్లు (34,265 ఎకరాలు) పూర్తిగా ముంపు ప్రాంతంలో ఉంది. ఈ అంశాలన్నీ పర్యావరణా న్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేసేవే. వీటన్నింటికీ పరిష్కారాలు చూపుతూ ప్రభుత్వం పర్యావరణ ప్రభావ మదింపు చేపట్టాలి. ఇక దీనికి తోడు ప్రాజెక్టుకు జాతీయ హోదా లభించాలంటే మొత్తం 18 విభాగాల నుంచి అనుమతులు తప్పనిసరి. ఇందులో కొన్ని అనుమతులు సులభమైనవే అయినా.. పర్యావరణ, అటవీ శాఖ అనుమతులు కాస్త క్లిష్టతరమైనవి.


ప్రస్తుతం కోర్టు కేసులు, ట్రిబ్యునళ్ల తీర్పుల నేపథ్యంలో నీటి పారుదల శాఖ.. కాళేశ్వరం ప్రాజెక్టులో పర్యావరణ అంశానికే ప్రాధాన్యం ఇచ్చి పర్యావరణ మదింపు కోసం ఈఏసీకి గత నెలలోనే వివరణ ఇచ్చింది. ఈ వివరణలపై సంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రాజెక్టు డిజైన్‌కు అనుగుణంగా టర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌(టీఓఆర్‌)ను ఖరారు చేసినట్లు సమాచా రం సైతం అందించింది. ఈ టీఓఆర్‌ విధివిధానా లకు అనుగుణంగా పర్యావరణ మదింపు నివేదికను తిరిగి మంత్రిత్వ శాఖకు సమర్పిస్తే అక్కడ ఆమోదం దక్కనుంది. ఈ ఆమోదం ఉంటేనే ప్రాజెక్టుకు జాతీ య హోదా అంశంతో పాటు రుణాలు తీసుకునేం దుకు రాష్ట్రానికి వెసులుబాటు ఉంటుంది. అ యితే ఈఏసీ ఇటీవల వెలువరించిన తన మినిట్స్‌ కాపీలో మాత్రం పర్యావరణ అనుమతులకు అంగీకరించలే మని పేర్కొంది.


‘‘ప్రాజెక్టు సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాలు తదితర అంశా లపై చర్చలు జరిపాం. అయితే ఈ ప్రాజెక్టును అనుమతించకూడదని నిర్ణయిం చాం. కేంద్ర జల సంఘం అనుమతులు వచ్చే వరకు ప్రాజెక్టుకు ఆమోదిం చలేం’’ అని కమిటీ తన మినిట్స్‌ లో స్పష్టం చేసింది. కమిటీకి చైర్మన్‌గా ఉన్న శరద్‌కుమార్‌ జైన్‌ సహా మరో 11 మంది సభ్యులు ఓకే చెప్పినా హైడ్రాలజీ విభాగానికి సంబంధించిన చీఫ్‌ ఇంజనీర్‌ దీనికి అడ్డు తగలడంతోనే ఈఐఏకు బ్రేకులు పడ్డాయని నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి. దీనిపై తేల్చుకునేందుకు సోమవారం ప్రభుత్వ సలహాదారు ఆర్‌.విద్యాసాగర్‌రావు, సీఈ హరిరాం ఢిల్లీ వెళ్లనున్నారు.



కొత్త మార్గదర్శకాలే అడ్డు?

కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఆగడం వెనుక ఇటీవల కేంద్ర జల సంఘం తీసుకొచ్చిన కొత్త మార్గదర్శకాలే కారణమని తెలుస్తోంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం.. ప్రాజెక్టు అనుమతులు తొందరగా రావాలంటే సీడబ్ల్యూసీతో సంప్రదించి రూపొందించిన డీపీఆర్‌ కచ్చితంగా ఉండాలి. మొదట రాష్ట్ర ప్రభుత్వాలు ఒక డీపీఆర్‌ను రూపొందించాలి. ఆ డీపీఆర్‌తో సీడబ్ల్యూసీని సంప్రదిస్తే.. వారు అవసరమైన మార్పుచేర్పులు సూచిస్తారు. ఆ మార్పులను పొందుపరిచి రాష్ట్రాలు తుది డీపీఆర్‌ని సీడబ్ల్యూసీకి ఇవ్వాలి. దీనిపై సీడబ్ల్యూసీ, దాని అనుబంధ డైరెక్టరేట్‌లకి ప్రజెంటేషన్‌ ఇస్తుంది. ఈ ప్రక్రియ పూర్తయితే సీడబ్ల్యూసీ సూత్రప్రాయ అంగీకారం తెలుపుతుంది. ఆ తర్వాత నిర్ణయించిన గడువులోగా అను మతులు జారీ చేస్తారు.


వాస్తవానికి ఏ రాష్ట్రమైనా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలంటే అన్ని అనుమతులు ముందుగానే తీసుకోవాల్సి ఉంటుంది. అయితే చాలా రాష్ట్రాల్లో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిన అనంతరం అనుమతులకు దరఖాస్తు చేస్తున్నారు. దీంతో ప్రాజెక్టు నిర్మాణం జరిగినా ఏళ్లకు ఏళ్లుగా పర్యావరణ, అటవీ వంటి అనుమతులు రాక ప్రాజెక్టు నిర్మాణాల్లో విపరీత జాప్యం జరిగి, వాటి అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇది మొత్తంగా ప్రాజె క్టు వ్యయ, ప్రయోజనాల మధ్య భారీ అంతరాన్ని పెంచుతోంది. దీన్ని దృష్టి లో పెట్టుకొనే ఇటీవల సీడబ్ల్యూసీ కొత్త మార్గదర్శకాలు తెచ్చింది. ఈ మార్గదర్శకాలే ప్రస్తుతం కాళేశ్వరానికి అడ్డుగా మారాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top