కదంతొక్కిన ఆశా వర్కర్లు

కదంతొక్కిన ఆశా వర్కర్లు

  • కోఠి చౌరస్తాలో ఆశా వర్కర్ల ధర్నా

  • స్తంభించిన ట్రాఫిక్..బలవంతంగా అరెస్టులు..    

  • తీవ్ర ఉద్రిక్తత.. తోపులాటలోపలువురికి గాయాలు

  • హైదరాబాద్: తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తెలంగాణ వాలంటరీ అండ్ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ యూనియన్(ఆశా)(సీఐటీయూ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గురువారం కోఠిలోని డీఎంహెచ్‌ఎస్‌లోని ఏపీసాక్స్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న వేలాది మంది ఆశా వర్కర్లు పాల్గొన్నారు.



    ఈ సమాచారం తెలుసుకున్న ఏపీసాక్స్ కమిషనర్ జ్యోతి బుద్ధప్రసాద్ ఆశా వర్కర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చి వెళ్లిపోయారు. అధికారులు హామీలకే పరిమితమయ్యారని ఆగ్రహించిన ఆశా వర్కర్లు తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. కోఠి ఉమెన్స్ కళాశాల చౌరస్తాలో బైఠాయించి పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఆశా వర్కర్ల ఆందోళన సుమారు ఐదు గంటల పాటు కొనసాగడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించింది. ఊహించని పరిణామం కావడంతో పోలీసులు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.



    కోఠి చౌరస్తాలో ఆశా వర్కర్ల ఆందోళనతో తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో ఈస్ట్‌జోన్ డీసీపీ డాక్టర్ రవీందర్, అడిషన ల్ డీసీపీ చంద్రశేఖర్, ట్రాస్క్‌ఫోర్స్ అడిషనల్ డీసీపీ కోటిరెడ్డి, సుల్తాన్‌బజార్ ఏసీపీ గిరిధర్, మలక్‌పేట్ ఏసీపీలతోపాటు ఈస్ట్, సెంట్రల్ జోన్ల పరిధిలోని పోలీస్‌స్టేషన్ల సీఐలు, ఎస్‌ఐలు, ఇతర సిబ్బంది రం గంలోకి దిగారు. ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్లను బలవంతంగా అరెస్ట్ చేసి ఫలక్‌నుమా, అఫ్జల్‌గంజ్, సుల్తాన్‌బజార్ తదితర పోలీస్ స్టేషన్లకు తరలించారు.



    ఆశా వర్కర్ల సంఘం అధ్యక్షురాలు పి.జయలక్ష్మి, సీఐటీయూ నేతలు అబ్బాస్, తులసితో పాటు వందలాది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసే క్రమంలో పోలీసులకు ఆశా వర్కర్లకు మధ్య తోపులాట జరిగింది. పలువురు ఆశా వర్కర్లు గాయాల పాలయ్యారు. మరికొందరు సొమ్మసిల్లి పడిపోయారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top