చింతమడక నుంచి సీఎం పీఠం దాకా

చింతమడక నుంచి సీఎం పీఠం దాకా - Sakshi


దశాబ్దాల నిరీక్షణ ఫలించింది. కోట్లాది ప్రజల కల సాకారమైంది. సోమవారం 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. తొలి గవర్నర్గా నరసింహన్, తొలి ముఖ్యమంత్రిగా టీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర రావు ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ సాధన కోసం ఎందరో కాకలు తీరిన నాయకులు పోరాడారు. ఎన్నో పార్టీలు పుట్టాయి. తెరమరుగయ్యాయి. కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ఘనత మాత్రం కే చంద్రశేఖర రావుదే.



అందరూ కేసీఆర్గా పిలుచుకునే చంద్రశేఖర రావు 1954 ఫిబ్రవరి 17న మెదక్ జిల్లా చింతమడక గ్రామంలో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగులో మాస్టర్ డిగ్రీ చేశారు. 1970ల్లో యూత్ కాంగ్రెస్ తరపున కేసీఆర్ రాజకీయాల్లో అరంగేట్రం చేసినా.. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించాక ఆ పార్టీలో చేరారు. 1983 ఎన్నికల్లో కేసీఆర్ ఓటమి చవిచూసిన ఆయన ఆనక 1985 నుంచి సిద్దిపేట అసెంబ్లీ నియోజవర్గం నుంచి వరుసగా విజయం సాధించారు. రాష్ట్ర మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు. 2001లో డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు.



తెలంగాణ సాధన కోసం 13 సంవత్సరాల పాటు అలుపెరగని పోరాటం చేశారు. ఎన్నో ఒడిదుడుకులను, ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. చివరకు తన లక్ష్యాన్ని సాధించారు. రాష్ట్ర విభజన అనంతరం ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలంగాణలోని 119 స్థానాలకు గాను టీఆర్ఎస్ 63 సీట్లు గెల్చుకుని ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన పూర్తి మెజార్టీని సాధించింది. అయితే తెలంగాణను ఇచ్చామని చెప్పుకున్న కాంగ్రెస్కు ఊహించని షాక్ తగిలింది. ఎందరో సీనియర్లు మట్టికరిచారు. ఈ ఘనతంతా మాయల మరాఠీ కేసీఆర్దే. కేసీఆర్ కుమార్తె కవిత నిజామాబాద్ ఎంపీగా, కుమారుడు కే తారక రామారావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కేసీఆర్ పొలిటికల్ కెరీర్లో కీలక ఘట్టాలు...





1985-1999 : నాలుగుసార్లు ఎమ్మెల్యే

1987-88 : ఎన్టీఆర్ ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రి

1997-99 : చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రి

1999-2001: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్

ఏప్రిల్ 27, 2001: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ స్థాపన

2004 : లోకసభ సభ్యునిగా ఎన్నిక

2004-06 : కేంద్ర కార్మిక, ఉపాధిశాఖ మంత్రి

సెప్టెంబరు 23, 2006: లోక్సభ సభ్యత్వానికి రాజీనామా

డిసెంబరు 7 , 2006 : ఉప ఎన్నికలో మళ్లీ ఎంపీగా ఎన్నిక

మార్చి 3 , 2008 : లోక్సభ సభ్యత్వానికి రాజీనామా

2009 : 15 వ లోక్సభ సభ్యునిగా ఎన్నిక (రెండోసారి)

2014 : 16వ లోక్సభ సభ్యునిగా ఎన్నిక

2014 : గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక

2014 : టీఆర్ఎస్ శాసనసభా పక్ష నాయకునిగా ఎన్నిక

2014, జూన్ 2 : తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top