జూడాలు బేషరతుగా విధుల్లో చేరాలి: మంత్రి రాజయ్య

జూడాలు బేషరతుగా విధుల్లో చేరాలి: మంత్రి రాజయ్య


జూడాలు ఏడాది పాటు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయాల్సిందే

విపక్షాలు విషజ్వరాలను డెంగ్యూ జ్వరంగా చిత్రిస్తున్నాయి


 

సాక్షి,హైదరాబాద్: జూనియర్ డాక్టర్లు బేషరతుగా విధుల్లో చేరాల్సిందేనని, వారిని చర్చలకు పిలిచేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని డిప్యూటీ సీఎం, వెద్య ఆరోగ్యశాఖ మంత్రి రాజయ్య స్పష్టంచేశారు. చట్టానికి అనుగుణంగా, గతంలో వారు ఒప్పుకున్న విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏడాది పాటు విధులు నిర్వహించాల్సిందేనన్నారు. అలా జరగని పక్షంలో చట్టప్రకారం చర్యలుంటాయన్నారు. బుధవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ నిబంధనల ప్రకారం వారు నడుచుకోవాల్సిందేనని, వారు ఇంకా జూనియర్ డాక్టర్లే అన్న విషయాన్ని గు ర్తుంచుకోవాలన్నారు.

 

  ప్రభుత్వపరంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కూడా చేసుకుంటున్నట్లు చెప్పారు. రాజకీయ దురుద్దేశంతో విపక్షాలు విషజ్వరాలను డెంగ్యూ వ్యాధిగా చిత్రిస్తున్నాయని రాజయ్య విమర్శించారు. డెంగ్యూ నిర్ధారణ కోసం ప్రభుత్వ బ్లడ్‌బ్యాంక్‌లలో రూ.7.50 కోట్ల ఖర్చుతో ప్లేట్‌లెట్ సెపరేషన్ మిషన్లను అందుబాటులో తెస్తామన్నారు. విషజ్వరాల వల్ల బాధ ఉంటుందే తప్ప మరణాలు ఉండవని పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఏజెన్సీ ఏరియాలో విషజ్వరాల నివారణకు నిరంతరం వైద్యసిబ్బందిని అందుబాటులో ఉంచి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టామన్నారు. విషజ్వరాల మాట అటుంచి పాము, కుక్క కాటుకు మం దులు లేవంటూ ప్రతిపక్ష నాయకులు మాట్లాడడం హాస్యాస్పదమని రాజయ్య అన్నారు.

 

 సమ్మెకు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ మద్దతు

 తెలంగాణ సీఎం రోజుకు ఒక వేషం వేస్తున్నారని, జూడాల సమస్యలపై కేసీఆర్ నిర్మాణాత్మకంగా ఆలోచించాలని టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. బుధవారం కోఠిలోని ఐఎంఏ ఆడిటోరియంలో జూడాల సమస్యలపై అఖిల పక్ష, మేధావుల సమావేశం జరిగింది. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, టీజీడీఏ, ఐఎంఏలు జూడాలకు మద్దతు పలికాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణయ్య మాట్లాడుతూ జూడాల సమస్యలు న్యాయమైనవని, కేసీఆర్ ప్రభుత్వం వారి సమస్యలపై బుర్రపెట్టి ఆలోచించాలని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో అవగాహన లేని మంత్రులు ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు. సంవత్సరం పాటు జూడాలు గ్రామీణ ప్రాంతాలలో పనిచేయాలన్న నిబంధనలో కుట్ర దాగుందని ఆయన ఆరోపించారు. బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ మాట్లాడుతూ జూడాలను చ ర్చలకు పిలిచి వారి సమస్యలను పరిష్కరించాలన్నారు.

 

 ఎమ్మెల్సీ నాగేశ్వర్ మాట్లాడుతూ రాజకీయ నాయకులు ప్రతి పక్షం లో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారన్నారు. ఏ రకంగా జూడాలు రూరల్ సర్వీసులు చేయాలో అర్థం కాని పరిస్థితి ఉందన్నారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ మల్లురవి, బీజేపీ లీగల్‌సెల్ నేత రామచందర్‌రావు, ఐఎంఏ నేషనల్ లీడర్స్ ఫోరం చైర్మన్ డాక్టర్ అప్పారావు, టీజీడీఏ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ రమేశ్, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వీరేశం, తెలంగాణ  గెజిటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జూపల్లి రాజేందర్, జూడాల అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కోఠి ఉస్మానియా వైద్య కళాశాలలో జూడాల రీలే నిరాహార దీక్ష కొనసాగింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top