సమ్మె విరమించేది లేదు


సాక్షి, హైదరాబాద్: తమ సమస్యలను పరిష్కరిస్తామంటూ కోర్టుకిచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోలేదు కాబట్టి సమ్మె యథాతథంగా కొనసాగిస్తామని జూనియర్ డాక్టర్లు హైకోర్టుకు స్పష్టం చేశారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం జూడాల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు, కాలేజీల్లో బోధనా సిబ్బంది కోసం సమ్మె చేస్తున్నామని చెబుతున్న జూనియర్ డాక్టర్లలో... రేపు చదువు ముగిసిన తర్వాత అత్యధిక శాతం మంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేయరని, కార్పొరేట్ ఆసుపత్రుల్లోనే పనిచేస్తారని ఘాటుగా వ్యాఖ్యానించింది. వైద్య సేవలందక రోగులు ఇబ్బందులు పడుతుంటే వారి పట్ల దయ చూపకుంటే ఎలా అంటూ నిలదీసింది. సమ్మెను ఎలా సమర్థించుకుంటారో చెప్పాలని జూడాలను ఆదేశించింది. దీంతో వారి తరఫు న్యాయవాది రవిచందర్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలు మార్లు విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది.

 

 కోర్టులపై నమ్మకం లేదా?

 

 కేసు విచారణకు రాగానే జూడాల సమ్మెపై వారి న్యాయవాది రవిచందర్‌ను ధర్మాసనం ఆరా తీసింది. సమ్మె విరమించలేదని, తమ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారని రవిచందర్ తెలిపారు. దీనిపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ‘‘జూడాలు సమ్మె విరమించకుంటే, మేం ఈ కేసును విచారించే ప్రసక్తే లేదు. అయినా కోర్టును ఆశ్రయించకుండా ప్రభుత్వం వద్దకు వెళ్లడం ఏమిటి? కోర్టుల మీద వారికి నమ్మకం లేదా..? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరు ఏ విధంగానైనా ప్రవర్తించవచ్చు. అయితే ఆ ప్రవర్తన చట్టబద్ధంగా ఉండాలి. అర్ధగంట సమయం ఇస్తున్నాం. వారితో చర్చించి సమ్మె విరమించి, విధుల్లో చేరమని చెప్పండి’’ అని రవిచందర్‌కు ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో ఆయన కోర్టు హాల్ నుంచి బయటకు వచ్చి జూడాలతో చర్చలు జరిపారు. అరగంట తరువాత తిరిగి 12 గంటలకు విచారణ ప్రారంభం కాగా... సమ్మె విరమింప చేసేందుకు తాను ప్రయత్నించానని, అయితే అందుకు జూనియర్ డాక్టర్లు ఆసక్తి చూపడం లేదని రవిచందర్ కోర్టుకు నివేదించారు. ఇందుకు ధర్మాసనం స్పందిస్తూ... అయితే సమ్మెను ఎలా సమర్థించుకుంటారో చెప్పాలని, ఆ దిశగా వాదనలు వినిపించాలని స్పష్టంచేసింది. ఇదే సమయంలో జూడాల సమ్మెపై ప్రభుత్వ వైఖరి ఏమిటని ప్రశ్నించింది. సమ్మె చేయడం చట్ట విరుద్ధమని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. అనంతరం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

 

 సమ్మె విరమించకపోతే చర్యలు: టి.రాజయ్య



 సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జూని యర్ డాక్టర్లు సమ్మె విరమించకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుం దని మంత్రి టి.రాజయ్య పేర్కొన్నా రు. జూడాల విషయంలో ప్రభుత్వం కోర్టు తీర్పు ప్రకారం వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. బుధవా రం ఆయన నిజామాబాద్‌లో మంత్రి పోచారంతో కలసి మాట్లాడారు. రాష్ట్రంలో డెంగీ మరణాలు లేవని, కొందరు ప్రైవేటు డాక్టర్లు చేస్తున్న తప్పుడు ప్రచారమని కొట్టి పడేశారు. ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలలో 465 డెంగీ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని చెప్పారు.



 ‘గిరి’ మరణాలకు వారి అనాగరికతే కారణం..



 ఆదిలాబాద్: గిరిజనుల మరణాలకు వారి అనాగరికతే కారణమని రాజయ్య వ్యాఖ్యానించారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయన అటవీ మంత్రి జోగు రామన్న తో కలసి మాట్లాడారు. ‘ఏజెన్సీలో మూఢనమ్మకాలు.. అనాగరికత.. బాల్య వివాహాలు.. మేనరికపు పెళ్లిళ్లు.. సాంఘిక రుగ్మతలతో మరణాల బారిన పడుతున్నారు. ఈ మరణాలను అరికట్టేందుకు ఏజెన్సీలో వైద్యశిబిరాలతోపాటు, అవగాహనకార్యక్రమాలు చేపడతామన్నారు.

 

 ధర్నాచౌక్‌లో జూడాల నిరసనల హోరు



 హైదరాబాద్ : నెల రోజులుగా సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లు రోజు రోజుకి తమ నిరసనల హోరు పెంచుతున్నారు. ప్రభుత్వం తమ వాదనలు వినాలని, సమస్యలను పరిష్కరించాలని ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు బుధవారం 4వ రోజుకి చేరుకున్నాయి. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్లు గ్రామీణ ప్రాంతాల్లో తాము తప్పకుండా పనిచేస్తామని, అక్కడ ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ధర్నా చౌక్‌లో జూడాలు మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రికి 830 మంది జూనియర్ డాక్టర్లు ఉత్తరాలు రాశారు. జూనియర్ డాక్టర్లు అంకిత్ రెడ్డి, ప్రేమ్‌రాజ్, భరత్, సతీష్, హరిప్రియ, రంజిత్, నిఖిల తదితరులు దీక్షలో కూర్చున్నారు. కార్యక్రమంలో తెలంగాణ జూడాల అసోసియేషన్ కన్వీనర్ శ్రీనివాస్, అధ్యక్షుడు క్రాంతి, అధికార ప్రతి నిధులు స్వప్నిక, నరేష్, భాను, అనిల్, సాయికుమార్, అనిల్ పాల్గొన్నారు. కాగా జూనియర్ డాక్టర్లు గ్రామీణ ప్రాంతంలో సర్వీసు చేస్తామని స్పష్టం గా చెబుతున్నప్పటికీ ప్రభుత్వం మొండి వైఖరిగా వ్యవహరిస్తోందని బీజేపీ శాసన సభ పక్ష నేత డాక్టర్ కె. లక్ష్మణ్ పేర్కొన్నారు. బుధవారం నాటి రిలే దీక్షలకు ఆయున హాజరై సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో శాశ్వత ప్రాతిపదికన నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించి జూడాలను చర్చలకు పిలవాలని ఆయన కోరారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top