ఉద్యోగం చేస్తున్నారా.. పేకాట ఆడుతున్నారా?

ఉద్యోగం చేస్తున్నారా.. పేకాట ఆడుతున్నారా? - Sakshi

- వీఆర్వో చెంప చెళ్లుమనిపించిన జాయింట్‌ కలెక్టర్‌ 

రికార్డుల్లో వివరాలు సరిగా నమోదు చేయలేదని ఆగ్రహం

జేసీ క్షమాపణ చెప్పడంతో సద్దుమణిగిన వివాదం

 

మహబూబ్‌నగర్‌ రూరల్‌: రికార్డుల్లో వివరాలు సరిగ్గా నమోదు చేయలేదని వీఆర్వోపై జాయింట్‌ కలెక్టర్‌ చేయిచేసుకున్నారు. ఈ ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా ధర్మాపూర్‌లో శనివారం చోటు చేసుకుంది. ధర్మాపూర్‌లో జరిగిన గ్రామసభలో జాయింట్‌ కలెక్టర్‌ శివకుమార్‌ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని 558, 485, 486 సర్వే నంబర్లలోని భూమిలో నాలా కన్‌వర్షన్‌ లేకుండా ప్లాట్లు చేశారని, ఈ విషయమై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఉప సర్పంచ్‌ జనార్దన్‌ అన్నారు. దీంతో జేసీ రికార్డులను పరిశీలించారు. అందులో వివరాలు నమోదు చేయకపోవడంతో వీఆర్వోపై ఆగ్రహం వ్యక్తంచేశారు.



వీఆర్‌వో మహ్మద్‌ పాషా ఏదో చెప్పబోతుండగా తనకు సాకులు చెప్పొద్దని, ఉద్యోగం అంటే ఆటలనుకుంటున్నారా.. కూర్చొని పేకాట ఆడుతున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక్కసారిగా వీఆర్వో పాషా చెంపపై కొట్టారు. దీంతో  అందరూ నివ్వెరపోయారు. కాగా, శుక్రవారమే గ్రామసభ కోసం వచ్చిన జేసీకి అక్కడ రైతులు కనిపించకపోవడంతో వీఆర్వో మహ్మద్‌ పాషా చొక్కా గల్లా పట్టుకుని ‘ఏమిరా రైతులను సమీకరించవా?’అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.  

 

జేసీ క్షమాపణ

వీఆర్వోపై జాయింట్‌ కలెక్టర్‌ శివకుమార్‌ చేయిచేసుకున్న ఘటనపై వీఆర్‌ఓల సంఘం నాయకులు కలెక్టర్‌ రొనాల్డ్‌ రోస్‌ను కలసి ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన కలెక్టర్‌.. జేసీ శివకుమార్‌ను తన చాంబర్‌కు పిలిపించి వివరణ అడిగారు. ఈ ఘటన అనుకోకుండా జరిగిందని, దీనికి క్షమాపణ చెబుతున్నానని చెప్పడంతో వీఆర్వోలు శాంతించారు. 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top