అన్ని కాలేజీలూ కౌన్సెలింగ్‌లోకి!

అన్ని కాలేజీలూ కౌన్సెలింగ్‌లోకి!


* గుర్తింపు లభించని కాలేజీల నుంచి ‘బాండ్’లు తీసుకుని అనుమతి

* నెల రోజుల్లో లోపాలు సవరించుకోవాలని షరతు

* రూ. 100 బాండ్ పేపర్‌పై యాజమాన్యాల నుంచి అండర్ టేకింగ్

* వీటన్నింటినీ రెండో దశ వెబ్ కౌన్సెలింగ్‌లో చేర్చే అవకాశం

 

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పెద్ద సంఖ్యలో ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలకు అఫిలియేషన్ నిరాకరణ వివాదం ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. లోపాలను సరిదిద్దుకున్న కాలేజీలతో పాటు మిగతా కళాశాలలకు కూడా కొన్ని షరతులతో కూడిన అనుమతి ఇచ్చేందుకు జేఎన్టీయూహెచ్ అంగీకరించింది. అయితే ఆయా కళాశాలల్లో తనిఖీల సందర్భంగా గుర్తించిన లోపాలన్నింటినీ నెలరోజుల్లోగా పూర్తిగా సరిదిద్దుకుంటామని యాజమాన్యాల నుంచి హామీ తీసుకుంది.



దీంతో యూనివర్సిటీ పరిధిలోని అన్ని ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలకు అనుమతి లభించినట్లయింది. ఇందులో 130 కళాశాలలకు స్క్రూటిని అనంతరం బుధవారం అర్ధరాత్రి అనుమతి ఇచ్చారు. మిగతా కళాశాలలను కూడా వీలయినంత త్వరగా వెబ్ కౌన్సెలింగ్‌లో చేర్చనున్నారు. వెబ్ కౌన్సెలింగ్ తొలిదశ గురువారంతో పూర్తికానుండడంతో.. రెండో దశలో ఈ కాలేజీలను చేర్చాల్సి ఉంటుంది. అయితే ఇప్పటివరకూ కొన్ని కళాశాలలకే ఆప్షన్లు ఇచ్చుకున్న అభ్యర్థులు... తమ ఆప్షన్లను తాజాగా అనుమతి లభించిన కళాశాలలకు మార్చుకొనేందుకు వీలు కల్పించే అవకాశముంది.



వర్సిటీ వద్ద పడిగాపులు..

అర్హతలున్న ఇంజనీరింగ్ కళాశాలలను ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్‌కు అనుమతించాలంటూ రెండ్రోజుల కిందట హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తమ కాలేజీలకు అఫిలియేషన్‌ను పునరుద్ధరించాలని కోరుతూ.. ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు జేఎన్టీయూహెచ్‌కు విజ్ఞప్తి చేశాయి. వెబ్ కౌన్సెలింగ్‌కు ఆయా కాలేజీలను అనుమతించే విషయమై తాము సానుకూలంగానే ఉన్నట్లు మంగళవారం రాత్రి వీసీ రామేశ్వరరావు యాజమాన్యాలకు చెప్పారు.



బుధవారం ఉదయం 10 గంటలకల్లా తాము కోరిన విధంగా అండర్‌టేకింగ్‌లు సమర్పించాలని సూచించారు. దీంతో బుధవారం 9 గంటల వరకే కాలేజీ యాజమాన్య ప్రతినిధులు అండర్ టేకింగ్ పత్రాలు తీసుకుని యూనివర్సిటీకి వచ్చారు. కానీ సాయంత్రం 4 గంటల వరకు అటు వీసీగానీ, ఇటు రిజిస్ట్రార్‌గానీ అందుబాటులోకి రాకపోవడంతో ఆందోళన చెందారు. అయితే జేఎన్టీయూహెచ్ వీసీ రామేశ్వరరావు అండర్‌టేకింగ్ ఫార్మాట్‌ను రూపొందించి, సాంకేతిక విద్యాశాఖ నుంచి ఆమోదం పొందారు. అనంతరం ఆ ఫార్మాట్లను యాజమాన్యాలకు అందజేసి.. అండర్‌టేకింగ్ తీసుకున్నారు.



130 కాలేజీలకు అనుమతి..

ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్‌కు అనుమతించే విషయమై ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల నుంచి అండర్ టేకింగ్ తీసుకున్న జేఎన్టీయూహెచ్... లోపాలు సరిదిద్దుకున్నట్లుగా పేర్కొంటూ పలు కాలేజీలు ఇచ్చిన నివేదికల పరిశీలన చేపట్టింది. బుధవారం ఆయా కాలేజీల యాజమాన్యాలు ఈ రిపోర్ట్‌లను అందజేయగా... అర్ధరాత్రి వరకు అధికారులు స్క్రూటినీ నిర్వహించి 130 కాలేజీలకు అనుమతి ఇచ్చారు. మిగతా వాటిపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని జేఎన్టీయూ అధికారులు తెలిపారు.

 

సవరించుకోకుంటే చర్యలు తీసుకోండి..

‘ఏఐసీటీఈ నిర్దేశించిన ప్రమాణాలు, జేఎన్టీయూహెచ్ నిబంధనల మేరకు.. ర్యాటిఫైడ్ ప్రిన్సిపాల్, బోధన, బోధనేతర సిబ్బంది, లేబొరేటరీలు, పుస్తకాలు, జర్నల్‌లు, మౌలిక వసతులు, అకడమిక్ రెగ్యులేషన్స్ తదితర అంశాల్లో తనిఖీ కమిటీలు(ఎఫ్‌ఎఫ్‌సీ) గుర్తిం చిన లోపాలను నెల లోపు సరిదిద్దుకుంటాం. ఆ తర్వాత ఏ సమయంలోనైనా వర్సిటీ అధికారులు తనిఖీలు నిర్వహించి.. లోపాలను గుర్తిస్తే చర్యలు తీసుకునే అధికారం వర్సిటీకి ఉంది’.. అని సంబంధిత ఇంజనీరింగ్ కళాశాలల నిర్వాహకులు రూ. 100 బాండ్‌పేపర్లపై పేర్కొని సంతకం చేసి అండర్‌టేకింగ్‌లను వర్సిటీ రిజిస్ట్రార్‌కు సమర్పించారు.

 

ఆ కాలేజీల్లో సీట్ల తగ్గింపు సబబే!

 హైకోర్టు ధర్మాసనం ముందు జేఎన్‌టీయూహెచ్ అప్పీల్

 

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పలు ప్రైవేటు ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల సీట్ల సంఖ్యను తగ్గించడం సబబేనని హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూహెచ్) పేర్కొంది. ఈ విషయంలో తమ నిర్ణయాన్ని తప్పుబడుతూ సింగిల్ జడ్జి జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ బుధవారం హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీలు దాఖలు చేసింది. ఈ అప్పీల్‌ను గురువారం ఉదయం న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, జస్టిస్ ఎ.శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం విచారించనుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top