రైతులు కష్టాల్లో ఉంటే కంట్రీ చికెన్లతో సభలా?

రైతులు కష్టాల్లో ఉంటే కంట్రీ చికెన్లతో సభలా? - Sakshi


సాక్షి, హైదరాబాద్: ఒకవైపు కరువు, మరోవైపు అకాలవర్షాలతో రైతులు తీవ్ర సంక్షోభంలో ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం కంట్రీ చికెన్, బోటీ కబాబ్‌లతో ప్లీనరీ, సభలు పెట్టుకుంటున్నాడని సీఎల్‌పీ ఉపనాయకులు టి.జీవన్ రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ ఆవరణలో మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 939 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటిదాకా కరువు మండలాలను ప్రకటించలేదన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను, వడగండ్లతో నష్టపోయిన రైతులను పరామర్శించే తీరిక ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేదా అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.


 


రైతులను, వారి కుటుంబాలను ఎందుకు పరామర్శించలేదన్నారు. అల్లాడుతున్న రైతులను పట్టించుకోకుండా విలాసాలతో సభలు, సంబరాలు జరుపుకోవడం కేసీఆర్ బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట అని విమర్శించారు. ఉద్యమంలో అండగా ఉన్నవారు, టీఆర్‌ఎస్ అధికారంలోకి రావడానికి కష్టపడ్డవారే ఇప్పుడు తిరగబడుతున్నారని అన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు ప్రభుత్వంపై పోరాడుతున్నారని జీవన్ రెడ్డి చెప్పారు. విద్యార్థుల్లో, నిరుద్యోగుల్లో ఎన్నో ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ అమలుచేసిన హామీలేమిటో చెప్పాలని సవాల్ చేశారు. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతుంటే కేసీఆర్ ఏం చేశారని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఆ మండలాలను తెలంగాణకు సాధించుకోవడానికి చేసిన ప్రయత్నం ఏమిటో చెప్పాలన్నారు. ఈ 11 నెలల పాలనలో కేసీఆర్ సాధించిందేమిటని, సంబరాలు ఎందుకు జరుపుకుంటున్నారని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top