గ్రేటర్‌లో ‘అమ్మ’ ఆస్తులు

గ్రేటర్‌లో ‘అమ్మ’ ఆస్తులు - Sakshi

  • 40 ఏళ్ల కిందటే భూమి కొనుగోలు

  • మారేడ్‌పల్లిలో ఇల్లు

  • బూత్ బంగళాను తలపిస్తున్న విలాసవంతమైన ఈ భవనం.. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత విడిది గృహం. ఆమె నగరంలోని కొంపల్లిలో గల తన జయా గార్డెన్స్‌కు వచ్చినప్పుడల్లా ఈ ఇంట్లోనే బస చేసేవారు. దీంతో ఇది జయలలిత నివాసంగా గుర్తింపు పొందింది. కానీ, ఈ భవనం ఆమె ప్రియసఖి శశికళ నటరాజన్ పేరుతో ఉంది. ఆస్తుల కేసులో శనివారం జయలలితకు జైలుశిక్ష పడిన నేపథ్యంలో ఇక్కడున్న ఆమె ఆస్తుల వ్యవహారాలు నగరంలో చర్చనీయాంశమయ్యాయి.

     

    కంటోన్మెంట్, కుత్బుల్లాపూర్: అక్రమాస్తుల కేసులో అరెస్టయిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు హైదరాబాద్‌తో సుమారు 40 ఏళ్ల అనుబంధం ఉంది. 1970లలోనే ఆమె బోయిన్‌పల్లి సమీపంలోని పేట్‌బషీరాబాద్ గ్రామ పరిధిలో సుమారు 15 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు.



    సినీ రంగంలో ఉన్న కాలంలోనే కొనుగోలు చేసిన ఈ స్థలాన్ని అప్పట్లో ఆమె తరచూ సందర్శించే వారని ఆమె ఫామ్ హౌస్ పక్కనే వ్యవసాయ క్షేత్రం కలిగిన సామల రాఘవరెడ్డి (జయలక్ష్మిగార్డెన్స్ అధినేత) తెలిపారు. అప్పట్లో ఫామ్ హౌస్‌కు వచ్చినప్పుడు తమతో ఆప్యాయంగా మెలిగేవారని గుర్తు చేసుకున్నారు. తమ సోదరులతో ఆమెకు ప్రత్యేక అనుబంధం ఉండేదన్నారు. సుమారు పదేళ్ల క్రితం చివరిసారిగా ఆమె ఫామ్‌హౌస్‌కు వచ్చినట్లు తెలిపారు. జయలలిత ఫామ్ హౌస్‌కు పక్కనే సత్యం రామలింగరాజుకు చెందిన బైర్రాజు ఫౌండేషన్ ఉంది.

     

    బూత్ బంగళాగా మారిన ఇల్లు



    జయలలిత నగరానికి వచ్చినప్పుడు మారేడ్‌పల్లి రాధికా కాలనీలో ప్లాట్‌నెంబర్ 16లో నివసించేవారని స్థానికులు చెబుతున్నారు. ఆమె ప్రియసఖి శశికళ నటరాజన్ అనే నేమ్‌ప్లేట్‌తో ఉన్న ఈ ఇంట్లో కొన్నేళ్లుగా ఎవరూ ఉండటం లేదని కాలనీ వాసులు తెలిపారు. దీంతో పిచ్చిమొక్కలు పెరిగి బూత్‌బంగళా మాదిరిగా మారిపోయి ఉంది. జయలలిత ఇల్లు తమ కాలనీలో ఉందని ఇన్నాళ్లూ గర్వంగా భావించే వారమని, ఇప్పుడు ఆమె అరెస్టు కావడం తమకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తోందన్నారు.

     

    తమిళనాడు వ్యక్తులతో గార్డెన్ నిర్వహణ




    జీడిమెట్ల సమీపంలో ‘జయలలిత గార్డెన్’ పేరుతో ఉన్న భూముల చుట్టూ 12 అడుగుల ఎత్తులో ప్రహరీ నిర్మించారు. జాతీయ రహదారి ముందు ప్రధాన గేటు, జీడిమెట్ల స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణ కేంద్రం సమీపంలో మరో గేటు ఏర్పాటు చేశారు. ఇందులో పనిచేస్తున్న వారు మొత్తం తమిళనాడుకు సంబంధించిన వారే. స్థానికులను లోనికి అనుమతించరు. మూడు కుటుంబాలు ఇందులో ఉండి గార్డెన్ పనులను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అడపాదడపా జయలలితకు అత్యంత సన్నిహితులు వచ్చినపుడే కాస్త హడావుడి ఉంటుంది. ముఖ్యమంత్రి అయిన తరువాత రెండుసార్లు, ఓడిన తరువాత ఒక్కసారి గార్డెన్‌కు వచ్చి వెళ్లారని స్థానికులు చెబుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top