ప్రాజెక్టులకు జలకళ

ప్రాజెక్టులకు జలకళ


గద్వాల : కృష్ణా, తుంగభద్ర నదుల పై ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఆల్మట్టి, తుంగభద్ర ప్రాజెక్టులకు శనివారం ఇన్‌ఫ్లో భారీ స్థాయిలో పెరిగింది. ఇదేవిధంగా వరద నీరు వస్తే మరో ఐదు రోజుల్లో రాష్ట్రంలోని రెండు నదులు పరవళ్లు తొక్కనున్నాయి. కృష్ణానది వరద జూరాల ప్రాజెక్టుకు అడుగుపెట్టిన రోజు నుంచే ఖరీఫ్ ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేయనున్నారు. జూరాల ఆధారంగా కొత్తగా నిర్మితమైన నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను ఖరీఫ్ ఆయకట్టుకు నీటి విడుదల చేయనున్నారు. తుంగభద్ర ప్రాజెక్టు నుంచి నీటి విడుదల జరిగితే ఆర్డీఎస్ ద్వారా అలంపూర్ నియోజకవర్గంలో ఉన్న ఆయకట్టుకు నీళ్లందనున్నాయి. ఇలా జిల్లాలోని ఆరు ప్రాజెక్టుల పరిధిలో ఖరీఫ్ ఆయకట్టుకు నీటి విడుదల జరగనుంది. ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వస్తుండడంత ఖరీఫ్ సాగుపై అన్నదాతల కళ్లల్లో ఆశలు కనిపిస్తున్నాయి.

 

 ప్రాజెక్టుల పరిధిలో ఆయకట్టు అంచనా...

 పాత ప్రాజెక్టులతోపాటు కొత్తగా నిర్మితమైన భారీ ఎత్తిపోతల పథకాల ద్వారా ఈ ఖరీఫ్‌లో సాగునీటిని వీలైనంత మేరకు అందించాలని నీటి పారుదలశాఖ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు వచ్చేనెల మొదటి వారంలో జిల్లా ఐఏబీ సమావేశాన్ని నిర్వహించి తుది నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతం అధికారులు ప్రాజెక్టుల వారీగా ఈ ఖరీఫ్‌లో నీటిని అందించేందుకు ప్రయత్నిస్తున్న ఆయకట్టు అంచనా ఇలా ఉంది.

 

 జూరాల ప్రాజెక్టు పరిధిలో గతంలో మాదిరిగానే లక్షా 7వేల ఎకరాలకు, ఆర్డీఎస్ ప్రాజెక్టు పరిధిలో 20-30వేల ఎకరాలకు సాగునీటిని విడుదల చేయనున్నారు. కొత్తగా నిర్మితమైన నెట్టెంపాడు ప్రాజెక్టు నుంచి 60వేల ఎకరాలకు, భీమా ప్రాజెక్టు ద్వారా 60 నుంచి 80వేల ఎకరాలకు, కోయిల్ సాగర్ ద్వారా 25వేల ఎకరాలకు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 15వేల ఎకరాలకు ఈ ఖరీఫ్‌లో సాగునీటిని అందించాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇలా మొత్తం ఆరు ప్రాజెక్టుల పరిధిలో 3లక్షల 20వేల ఎకరాలకు సాగునీటిని విడుదల చేయనున్నారు.

 

 జూరాలకు తాకని వరద తాకిడి

 నారాయణపూర్‌కు దిగువన ఉన్న జూరాల ప్రాజెక్టుకు ఇంకా వరద తాకిడి తగల్లేదు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 11.94 టీఎంసీలు ఉండగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 5.74 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. నారాయణపూర్ నుంచి భారీస్థాయిలో ఇన్‌ఫ్లో వస్తే కేవలం ఒక్కరోజులోనే జూరాల ప్రాజెక్టు రిజర్వాయర్‌కు పూర్తిస్థాయికి చేరే అవకాశముంది.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top