ఉత్తమ్‌ సారథ్యంలోనే ఎన్నికలకు..

ఉత్తమ్‌ సారథ్యంలోనే ఎన్నికలకు.. - Sakshi


కేసీఆర్‌ ఉపవాస దీక్ష ఒట్టి బూటకం: జైపాల్‌రెడ్డి

రాష్ట్రంలో రాచరిక పాలన నడుస్తోంది: ఉత్తమ్‌

ముస్లింలకు వెంటనే రిజర్వేషన్‌ కల్పించాలని డిమాండ్‌




షాద్‌నగర్‌: పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సారథ్యంలోనే కాంగ్రెస్‌ ముందుకు వెళ్తుం దని కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన సమర్థ నాయకుడని కితాబిచ్చారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికలను ఆయన నాయకత్వంలోనే ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌లో ఆదివారం జరిగిన జన ఆవేదన సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. బా«ధ్యతారహితంగా ఉన్నవారే ప్రగల్భాలు పలుకుతారని, ఇది ప్రధాని మోదీకి సరిగా సరిపోలుతుందని ఎద్దేవా చేశారు. స్విస్‌ బ్యాంకుల్లో ఉన్న రూ. 80 లక్షల కోట్లు తీసుకొచ్చి ప్రతి భారతీయుడి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు జమచేస్తామన్న హామీ ఇప్పటికీ నెరవేర్చలేదన్నారు. పెద్దనోట్ల రద్దుతో పేదలు ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. మోదీ పాలనలో పండిం చిన పంటకు గిట్టుబాటు ధర రాక రైతులు ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్‌ చేసిన ఉపవాస దీక్ష ఒట్టి బూటకం అని ఆరోపించారు.



ఎన్నికల వాగ్దానాల సంగతేంటి?

రాష్ట్రంలో రాచరిక పాలన నడుస్తోందని ఉత్తమ్‌ విమర్శించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని ఎన్నికల్లో కేసీఆర్‌ వాగ్దానం చేసారని, నేటి వరకు ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయారని చెప్పారు. ఆయన కుటుంబానికి మాత్రం నాలుగు ఉద్యోగాలు ఇచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తానన్న కేసీఆర్‌ ఇప్పటివరకూ ఆ మాట నిలుపుకోలేదన్నారు.



రాష్ట్ర కేబినెట్‌లో కుక్కలు: డీకే అరుణ

కేసీఆర్‌ అభివృద్ధి ప్రకటనల్లో మాత్రమే కనిపిస్తుందని, చేతల్లో లేదని డీకే అరుణ విమర్శించారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఇష్టానుసారంగా మాట్లాడే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ‘రాష్ట్ర కేబినెట్‌లో కొన్ని కుక్కలున్నాయి.. అవి ఇష్టానుసారంగా మొరుగుతున్నాయి’అని ఆమె మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు దామోదరరెడ్డి, కార్తీక్‌రెడ్డి, ఒబేదుల్లా కొత్వాల్, క్యామ మల్లేశ్, పవన్‌కుమార్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్‌ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top