మలేషియాలో నరకయాతన

మలేషియాలో నరకయాతన


పన్నెండు రోజుల నుంచి కోమాలో జగిత్యాలవాసి

సమాచారమిచ్చిన ఇండియన్‌ ఎంబసీ

పాస్‌పోర్టు గుంజుకున్న కంపెనీ..

డబ్బులు చెల్లిస్తేనే రోగిని డిశ్చార్జి చేస్తామన్న ఆస్పత్రివర్గాలు

ఆందోళనలో నిరుపేద కుటుంబీకులు




సాక్షి, జగిత్యాల : మలేషియా ఆస్పత్రిలో జగిత్యాలకు చెందిన సోమ నర్సయ్య(70) ఇరుక్కుపోయాడు. ఏమైందో తెలియదు కానీ.. పన్నెండు రోజులుగా అక్కడి ఓ ఆస్పత్రిలో కోమాలో ఉన్నాడు. ఎప్పుడు కోలుకుంటాడో చెప్పలేమంటున్న ఆస్పత్రివర్గాలు ఇప్పటి వరకు చికిత్స కింద అందించిన వైద్య బిల్లులు చెల్లించాలని.. అయితేనే రోగిని డిశ్చార్జి చేస్తామని నర్సయ్య కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చాయి. మరోపక్క.. నర్సయ్య డిశ్చార్జ్‌ అయి ఇంటికి రావాలనుకున్నా.. రాలేని పరిస్థితి నెలకొం ది. ఏజెంట్‌ మోసానికి బలైన అతనికి అక్రమంగా పని కల్పించిన ఓ అల్యూమినీయం కంపెనీ యాజమాన్యం నర్సయ్య ఎక్కడికి పారిపోతాడోననే ఉద్దేశంతో అతని పాస్‌పోర్టును గుంజుకుంది. ఈ విషయాలు నర్సయ్య సహచరుల ద్వారా తెలుసుకున్న అతని కుటుంబీకులు ఆం దోళన చెందుతున్నారు. దేశం కానీ.. దేశంలో తన కొడుకు.. తండ్రి.. భర్తకు అసలేం జరిగింది..? అతని ప్రస్తుత పరిస్థితి ఏంది..? తెలుసుకోవాలని నర్సయ్య తల్లి, భార్యపిల్లలు ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నారు.



జగిత్యాల జిల్లా కేంద్రంలోని అరవిందర్‌నగర్‌కు చెందిన సోమ నర్సయ్య (70) టేలర్‌గా పని చేసేవాడు. ఇతనికి తల్లి మణెమ్మ, భార్య రాజమణి, కూతుళ్లు లలిత, శ్రావణి ఉన్నారు. కష్టపడి ఇద్దరు కూతుళ్లకు పెళ్లీళ్లు చేశాడు. ఏడాది క్రితమే రెండో కూతురు శ్రావణి వివాహం జరిగింది. ఇద్దరు కూతుళ్ల పెళ్లీళ్లకు నర్సయ్య రూ.6 లక్షల అప్పు చేశాడు. చేసిన అప్పుకు వడ్డీ కూడా తీర్చలేకపోతున్న నర్సయ్యపై మరో కష్టం  వచ్చిపడింది. మార్కెట్లో వచ్చిన రెడిమేడ్‌ వస్త్రాలు ఇతని ఉపాధికి గండికొట్టాయి. దీంతో చేసిన అప్పును తీర్చాలనే ఉద్దేశంతో గతేడాది వేములవాడకు చెందిన ప్రభాకర్‌కు రూ.60లు ఇచ్చి మలేషియాలోని ఓ సూపర్‌మార్కెట్‌లో సేల్స్‌మన్‌గా పనిపై వెళ్లాడు. అక్కడ మరో ఏజెంట్‌ బాబు నర్సయ్యను రిసీవ్‌ చేసుకున్నాడు. ఒప్పందం ప్రకారం నర్సయ్యను అక్కడి సూపర్‌మార్కెట్‌లో పని కల్పించాల్సిన బాబు ఓ అల్యూమినియం కంపెనీలో చేరాలని ఉచిత సలహా ఇచ్చి జారుకున్నాడు. దీంతో గత్యంతరం లేక అల్యూమినియం కంపెనీలో పనికి కుదిరిన నర్సయ్య పాస్‌పోర్టును ఆ కంపెనీ యాజమాన్యం గుంజుకుంది. సుమారు ఏడాది నుంచి.. నర్సయ్య  అల్యూమినియం కంపెనీలోనే లోడింగ్, అన్‌లోడింగ్‌ కూలీగా పని చేస్తున్నాడు.



పని నచ్చక.. కొన్నాళ్ల తర్వాత ఇంటికెళ్లిపోదామనుకున్న నర్సయ్య తన పాస్‌పోర్టు ఇవ్వాలని సదరు కంపెనీ నిర్వాహకులకు చెప్పినా ఇవ్వకుండా వేధించేవారు. ఇదే విషయాన్ని తరుచూ ఫోన్లో చెప్పేవాడని కుటుంబ సభ్యులు ‘సాక్షి’కి వెళ్లడించారు. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ.. నర్సయ్య కోమాలో ఉన్నాడని, అక్కడి  ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని గత నెల 23న రాజమణికి ఫోన్‌ వచ్చింది. ఆస్పత్రిలో వైద్యానికి అయిన బిల్లులు చెల్లిస్తేనే నర్సయ్యను పంపిస్తామని ఓ వ్యక్తి ఫోన్‌ చేసినట్లు రాజమణి వివరించింది. దీంతో జగిత్యాలకు చెందిన సామాజికవేత్త చాంద్‌పాషతో కలిసి.. విదేశాంగ శాఖ ద్వారా మలేషియా ఇండియన్‌ ఎంబసీని సంప్రదించారు. స్పందించిన ఇండియన్‌ ఎంబసి అధికారులు నర్సయ్య మలేషియాలోని హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడని.. గత నెల 24న మెయిల్‌ ద్వారా సమాచారమిచ్చారు. ఇదీలావుంటే.. అయితే బాధిత కుటుంబ సభ్యులు మాత్రం మలేషియాలో ఆస్పత్రి ఖర్చులు భరించలేమని, ప్రభుత్వమే ఖర్చు భరించి తన భర్తను ఇండియాకు తీసుకువచ్చి చికిత్స అందజేయాలని వేడుకుంటున్నారు.



అక్కడ భర్త.. ఇక్కడ భార్య..

నర్సయ్య మలేషియాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే.. అతని భార్య రాజమణి సైతం ఆస్పత్రి పాలైంది. కడుపుకు సంబంధించిన ఏదో తీవ్ర సమస్యతో బాధపడుతున్న రాజమణì.. నర్సయ్య ఆరోగ్య పరిస్థితి గురించివిని కుప్పకూలింది. కొన్ని రోజులు బాధను తట్టుకున్నా.. భరించలేని నొప్పితో కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రిలో చేరింది. సోమవారం కరీంనగర్‌లో రాజమణికి ఆపరేషన్‌ జరగనుంది. తల్లిదండ్రులిద్దరూ ఆస్పత్రి పాలవడంతో కూతుళ్లు లలిత, శ్రావణి, నర్సయ్య తల్లి మణెమ్మ దుఃఖ సాగరంలో మునిగిపోయారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top