వారంలో రెండు రోజులు ఐపీవీ పోలియో టీకా


అన్ని పీహెచ్‌సీల్లో అందుబాటులోకి

వైద్య ఆరోగ్య శాఖ వెల్లడి


సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు చుక్కల మందుకే పరిమితమైన పోలియో వ్యాక్సిన్... ఇక నుంచి ఐపీవీ (ఇనాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్) రూపంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా అందుబాటులోకి తేవాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. తెలంగాణలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ), పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (యూపీహెచ్‌సీ)లో ఈ వ్యాక్సిన్‌ను అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం ప్రతి బుధ, శనివారాల్లో చుక్కల మందు వేస్తున్నారు. వారంలో ఈ రెండు రోజులూ చుక్కల మందుతో పాటు ఇకపై ఐపీవీ కూడా అందుబాటులో ఉంచుతారు. అలాగే శనివారం అంగన్‌వాడీ, ఆరోగ్య ఉప కేంద్రాల్లోనూ ఐపీవీ వేస్తారని రాష్ట్ర ఇమ్యునైజేషన్ ప్రత్యేకాధికారి డాక్టర్ జి.శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు. నెలన్నర, మూడున్నర నెలల పిల్లలకు ఈ వ్యాక్సిన్ వేయించుకోవచ్చన్నారు. ఐపీవీని రాష్ట్రంలో అందరికీ అందుబాటులోకి తీసుకురావడం ఇదే మొదటిసారి. ఇంజెక్షన్ రూపంలో ఇచ్చే ఐపీవీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో తప్ప మరెక్కడా అందుబాటులో ఉండదు.

 

 ఐపీవీ సురక్షితం...


 ప్రస్తుతం చుక్కల మందు రూపంలో పోలియో వ్యాక్సిన్‌ను పిల్లలకు వేస్తున్నారు. ఇక నుంచి రాష్ట్రంలో ఐపీవీని కూడా విస్తృతంగా అందుబాటులోకి తెస్తున్నారు. చుక్కల మందు కంటే కూడా ఐపీవీ మరింత సురక్షితమని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. చుక్కల మందులో సజీవ వైరస్ ఉంటుందని... అది రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లల నుంచి బయటకు వచ్చే అవకాశాలున్నాయంటోంది. చుక్కల మందు కంటే ఐపీవీ టీకా సురక్షితమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కూడా చెబుతోంది. పోలియో కలిగించే మూడు రకాల వైరస్‌లకు ఇది చెక్ పెడుతుంద ని నిపుణులు చెబుతున్నారు. చుక్కల మందు 1, 3 రకాల వైరస్‌లను నాశనం చేస్తుందని... ఐపీవీ ఇంజెక్షన్ మాత్రం మూడు రకాల వైరస్‌లనూ నాశనం చేస్తుందంటున్నారు. ఈ క్రమంలో 2018 నుంచి పూర్తిగా ఐపీవీ టీకానే ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.  

 

 ముగిసిన ప్రత్యేక కార్యక్రమం...

 హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో చిన్న పిల్లల కోసం ఈ నెల 20న ప్రారంభించిన ఐపీవీ టీకా ప్రత్యేక కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. మొత్తం రెండున్నర లక్షల మంది పిల్లలకు టీకా వేయాలని లక్ష్యంగా పెట్టుకోగా... ఏకంగా 3,10,968 మందికి వేసినట్లు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్‌కు చెందిన 9 మంది ప్రత్యేక ప్రతినిధులు హైదరాబాద్ వచ్చారన్నారు. మొత్తం కార్యక్రమాన్ని రికార్డు చేయడమే కాకుండా డాక్యుమెంటరీ రూపొందించారు. వివిధ దేశాలకు ఈ డాక్యుమెంటరీ పంపించి అక్కడ ప్రజలను చైతన్యం చేస్తారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top