వీడిన పీటముడి


సాక్షి ప్రతినిధి, ఖమ్మం: కాంగ్రెస్ నేతల వర్గ పోరు కారణంగా నెలల తరబడి పెండింగ్‌లో ఉన్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి నియామకపు వ్యవహారం ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఐతం సత్యంను పార్టీ ఇన్‌చార్జి జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడికి నియామకపు పత్రాన్ని పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య శుక్రవారం సాయంత్రం అందజేశారు.



జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి వ నమా వెంకటేశ్వరరావుకు 2014 శాసనసభ ఎన్నికల్లో కొత్తగూడెం టికెట్ ఇవ్వక పోవడంతో పార్టీని వీడి వైఎస్సార్‌సీపీ తరపున పోటీచేశారు. అప్పటి నుంచి ఖాళీగానే ఉన్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పీఠం ఎవరికి కట్టబెట్టాలనే దానిపై  పార్టీలోని వర్గాల మధ్య ఏకాభ్రిపాయం కుదరలేదు. జిల్లా కాంగ్రెస్‌లో అగ్రగణ్యులుగా పేరున్న నేతలందరూ ఎవరికి వారే తమ వర్గాలకు చెందిన వారికి ఈ పదవి దక్కేలా పలు పేర్లను సూచించారు.



అయితే సాక్షాత్తు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్‌సింగే వీరి మధ్య ఏకాభిప్రాయం కుదిర్చేందుకు ఢిల్లీ వరకు పిలిపించినా అధ్యక్షుడి వ్యవహారం మాత్రం ఒక్కడుగు కూడా ముందుకు కదలలేదు. ఈ నేపథ్యంలో అసహనం వ్యక్తం చేసిన ఢిల్లీ పెద్దలు కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం ఎవరెవరు ఏ పేర్లు సూచిస్తారో ఆ జాబితా తమకు ఇవ్వాలని కొన్ని నెలల క్రితం సూచించారు. అయితే జిల్లాకు చెందిన కాంగ్రెస్ వర్గాలు పలు పేర్లు ప్రతిపాదించాయి. మాజీమంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి పేరును పొంగులేటి సుధాకర్‌రెడ్డి సూచించారు. సామాజిక సమీకరణల నేపథ్యంలో ఆయనకు ఇవ్వడం సాధ్యం కాకుంటే బీసీ నేత శీలంశెట్టి వీరభద్రానికి ఇవ్వాలని రాంరెడ్డి వెంకటరెడ్డి అప్పట్లో ప్రతిపాదించారు.



కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్‌కుమార్, మల్లు భట్టి విక్రమార్క మాత్రం ఐతం సత్యంవైపు మొగ్గు చూపారు. సామాజిక సమీకరణ ల్లో ఆయనకు ఇవ్వడమే మంచిదని ఢిల్లీ పెద్దల ముందు తమ అభిప్రాయం వ్యక్తం చేశారని, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి మాత్రం పరుచూరి మురళీకృష్ణ పేరును ప్రతిపాదించారని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరిగింది. అయితే రెండు నెలలపాటు అధ్యక్షుడి ఎన్నిక వ్యవహారంపై ఎటూ తేల్చని కాంగ్రెస్ అధిష్టాన వర్గం భవిష్యత్తులో పార్టీ అవసరాలు, సభ్యత్వ నమోదు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని జిల్లా కాంగ్రెస్ ఇన్‌చార్జి అధ్యక్షుడిగా ఐతం సత్యం పేరు ఖరారు చేసింది.



కాంగ్రెస్ అధిష్టానవర్గంలో పట్టున్న రేణుకాచౌదరి ప్రతిపాదించిన పేరు కాకుండా జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సూచించిన వ్యక్తికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం కాంగ్రెస్ మార్కు రాజకీయాలకు అద్దం పడుతోంది. కాగా, సీనియర్ కాంగ్రెస్ నాయకుడైన సత్యంకు.. డీసీసీ అధ్యక్ష పదవి ఆశించి భంగపడిన కాంగ్రెస్ వర్గాలు, ద్వితీయ శ్రేణి నేతలు ఏ మేరకు సహకరిస్తారన్న అంశం ఇప్పుడు కాంగ్రెస్‌లో ప్రధాన చర్చనీయాంశమైంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top