వారికి మామూలే

వారికి మామూలే


సీఎం, డిప్యూటీ సీఎంలే లంచంపై విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారు. డబ్బులు తీసుకుంటే ఎవరేం చేస్తారులే అనుకున్నారేమో.. ప్రభుత్వ ఆస్పత్రిలో సిబ్బంది లంచాలకు తెగబడ్డారు. రెక్కాడితేగానీ డొక్కాడని బడుగుజీవులు అనారోగ్యం పాలైతే వారికి చికిత్స చేసేందుకు ప్రభుత్వం ఆస్పత్రులను ఏర్పాటు చేసింది. చేతిలో చిల్లిగవ్వ లేకున్నా అక్కడకు వెళ్తే పానం బాగుచేస్తారన్న నమ్మకం.. కానీ, ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రికి ఎందుకొచ్చాంరా భగవంతుడా అనాల్సిన పరిస్థితి.



జేబునిండా డబ్బులు తీసుకెళ్తే తప్పా వైద్యం అందడం లేదు. ప్రతి పనికీ చేతులు తడపాల్సిందే.. ఆస్పత్రుల్లో రోగుల ప్రాణాలతో బేరమాడుతున్నారు. చావుకైనా, పుట్టుకైనా పైసలు ముట్టజెప్పాల్సిందే. ఇచ్చేదాకా వేధింపులు తప్పవు. వాళ్లు డిమాండ్ చేసినంతా ఇవ్వాల్సిందే. లేదంటే చీదరింపులు, చీత్కారాలే.


 

 సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లాలో ఒక ప్రధాన ఆసుపత్రి, నాలుగు ఏరియా ఆసుపత్రులు, ఐదు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 85 పీహెచ్‌సీలున్నాయి. వీటికి ప్రధానంగా అనునిత్యం వెయ్యికి పైగానే ఓపీ ఉంటుంది. ఆస్పత్రులకు వచ్చే వారిని ముక్కుపిండి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. మరీ ప్రధానంగా జిల్లా ప్రధాన ఆసుపత్రి దోపిడీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. జిల్లా ప్రధాన ఆస్పత్రిలో డబ్బుల కక్కుర్తి ఆగడంలేదు. ప్రధానం గా నాలుగు విభాగాల్లో విచ్చలవిడిగా పేషెంట్ల సంబంధీకుల నుంచి డబ్బుల కోసం పీల్చి పిప్పిచేస్తున్నారు.



ప్రసూతిగది, ఆపరేషన్ థియే టర్, క్యాజువాలిటీ, మార్చురీ విభాగాల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నట్లు తరచూ ఆరోపణలు వస్తున్నాయి. ఆస్పత్రిలో ప్రసవం జరిగి తే.. మగపిల్లవాడు పుడితే రూ.వెయ్యి, ఆడపిల్ల పుడితే రూ.500 డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఇటువంటి ఆరోపణలు రావడంతో మూడుసార్లు పలువురు సిబ్బందిని సస్పెండ్ చేశారు. అయినా వారిలో మార్పు రా వడంలేదు. కొన్ని నెలల క్రితమే పోస్టుమార్టం వద్ద విధులు నిర్వహిస్తున్న ఎన్‌ఎంఓలు యా దయ్య, కిష్ణయ్యలు డబ్బులు వసూలు చేశారనే ఆరోపణపై సస్పెండ్ చేశారు. అయినా ఆస్పత్రి సిబ్బంది తాజాగా చెన్నకేశవులు, ఆయన కూతురు ఆత్మహత్యకు కారకులయ్యారు.

 

వైద్యులదీ అదే పరిస్థితి..!

కమీషన్లకు కక్కుర్తి పడుతున్న వైద్యులు ప్రతి చిన్నదానికీ టెస్టుల కోసం బయటకు రాస్తున్నారు. సంబంధిత పరీక్షలు ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్నా వారికి అవేమీ పట్టవు. ముఖ్యంగా జిల్లా ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న పరికరాలు... సరిగా పనిచేయడం లేదనో, కండిషన్ లేదనో రకరకాల కారణాల చేత బయటకు పంపుతున్నారు. అల్ట్రాసౌండ్ స్కానింగ్ కేవలం గర్భవతులకు మాత్రమే తీస్తున్నారు. మిగతా కడుపునొప్పి బాధతో వచ్చే వారిని ఆస్పత్రిలో చికిత్స నిర్వహించకుండా బయటకు పంపుతున్నారు.



ఎక్స్‌రే మిషన్ ఉన్నా ఫిల్మ్ సరిగా రావడం లేదంటూ  బయటకు రాస్తారు. అందుబాటులో ఉన్న సీబీపీ, ఎలక్ట్రోలైట్స్, హిమోగ్లోబిన్, సీఆర్‌పీ, ఏఎస్‌ఓ, వైడల్, ఆర్యటెస్టు తదితర వాటికి కూడా బయటకే. ఆస్పత్రిలో అందుబాటులో లేని ఎల్‌పీటీ, కాల్షియం, కొలెస్ట్రాల్, యూరిక్‌యాసిడ్, సిరమ్‌ప్రొటిన్ వంటి పరీక్షలను అతితక్కువ ఖర్చులో స్థానికంగా ఉన్న ఎస్‌వీఎస్ ఆస్పత్రిలో పరీక్షలు జరిపేలా గతంలో ఉన్న కలెక్టర్ గిరిజాశంకర్ ఆదేలిచ్చారు. అయితే అటువంటి పరిస్థితి ఇప్పటిదాకా లేదు. అంతా ప్రైవేట్ నర్సింగ్‌హోంలకు పంపుతున్నారు. ఇలా చేయడం వల్ల సంబంధిత వైద్యులకు కమీషన్లు అందుతున్నట్లు వినికిడి.

 

ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతిని సహించం. లంచావతారుల భరతం పడతాం. లంచం ఎవరడిగినా 040-23254071 నెంబర్‌కు ఒక్క ఫోన్ కాల్ కొట్టండి చాలు

 - ముఖ్యమంత్రి కేసీఆర్

 

సర్కారు దవాఖానాల్లో వందో, రెండొందలో తీసుకుంటే తప్పేంటి. సహజంగా చేతి ఖర్చులకు అడిగి తీసుకుంటే తీసుకోవచ్చు. అయినా దీన్ని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు

 - డిప్యూటీ సీఎం,

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top