రూ.300 కోట్లతో ఐటీ కారిడార్‌ అభివృద్ధి

రూ.300 కోట్లతో ఐటీ కారిడార్‌ అభివృద్ధి - Sakshi


సస్పెన్షన్‌ బ్రిడ్జి, సుందరీకరణ పనుల శంకుస్థాపనలో మంత్రి కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: మహానగరంలో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో పెరుగుతున్న జనాభా, వాహనాలు, ట్రాఫిక్‌ రద్దీకి అనుగుణంగా.. భవి ష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని తగిన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని మున్సిపల్‌ శాఖ మంత్రి కె.తారకరామారావు చెప్పారు. బుధవారం దుర్గం చెరువుపై రూ.184 కోట్లతో నిర్మిస్తున్న సస్పెన్షన్‌ బ్రిడ్జి, రూ.3.5 కోట్లతో చేపట్టిన సుందరీకరణ తదితర పనులకు కేటీఆర్‌ శంకుస్థాపన చేశా రు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమా వేశంలో ఆయన ప్రసంగిస్తూ.. గ్రేటర్‌లో ఐటీ కారిడార్‌ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతుండటంతో ఆ మేరకు ట్రాఫిక్‌ సమస్యలు తీవ్రమవుతున్నాయని చెప్పారు.



ఈ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచన మేరకు స్ట్రాటజిక్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌(ఎస్‌ఆర్‌డీపీ)లో భాగం గా సస్పెన్షన్‌ బ్రిడ్జి, ఇతర పనులు చేపట్టా మని చెప్పారు. 16 నుంచి 18 మాసాల్లో సస్పెన్షన్‌ బ్రిడ్జి పనులు పూర్తి చేయాల్సిందిగా కాంట్రాక్టు సంస్థ ఎల్‌అండ్‌టీకి సూచించారు. వచ్చే ఏడాది డిసెంబర్‌లోగా బ్రిడ్జి అందుబాటులోకి రాగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. రోడ్‌ నంబర్‌ 45 నుంచి సస్పెన్షన్‌ బ్రిడ్జి వైపు వచ్చేవారి కోసం ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి రూ.82 కోట్లతో టెండర్‌ పిలిచామన్నారు. దుర్గం చెరువు వద్ద ఎస్టీపీ తదితర పనుల కోసం మరో రూ.10 కోట్ల నుంచి రూ.12 కోట్లు ఖర్చవుతుందని, అన్నీ వెరసి ఐటీ కారిడార్‌లో దాదాపు రూ.300 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నామని చెప్పారు.



ప్రణాళికతో ముందుకు

పెరుగుతున్న జనాభా, నగర అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలకు తగిన ప్రణాళికలతో ముందుకెళ్తున్నామని కేటీఆర్‌ చెప్పారు. వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సమస్యలు పరిష్కరించేందుకు ఎస్‌ఆర్‌డీపీ తొలి దశలో రూ.2,600 కోట్ల పరిపాలన అనుమతులిచ్చామన్నారు. 18 జంక్షన్లలో పనులు ప్రారంభం కాగా, ఎన్జీటీ స్టేతో కేబీఆర్‌ పార్క్‌ వద్ద పనులు ఆగిపోయాయన్నారు. జీహెచ్‌ఎంసీ, టీఎస్‌ఐఐసీ, జలమండలి సమన్వయంతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.



నగరంలో వైట్‌టాపింగ్‌ రోడ్ల కోసం టీఎస్‌ఐఐసీ రూ.90 కోట్లు కేటాయించిందన్నారు. ఇనార్బిట్‌ మాల్‌ నుంచి దాబా చౌరస్తా వరకు సొరంగ మార్గం సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నామన్నారు. మరో రూ.124 కోట్లతో రహదారుల విస్తరణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల సందర్భంగా మంత్రి ప్రకటించిన పనులన్నింటి విలువ దాదాపు రూ. 535 కోట్లు కావడం గమనార్హం. కార్యక్రమాల్లో రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ బాలమల్లు, ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.



అందమైన ల్యాండ్‌మార్క్‌..

సస్పెన్షన్‌ బ్రిడ్జితో దుర్గం చెరువు ప్రాంతం నగరానికి అందమైన ల్యాండ్‌మార్క్‌గా రికార్డు కెక్కుతుందని కేటీఆర్‌ అన్నారు. ‘దుర్గం’పరిసరాల్లో రాళ్లతో కూడిన ప్రకృతి సౌందర్యం దెబ్బ తినకుండా సుందరీకరణ పనులు చేపడుతున్నట్లు చెప్పారు. దుర్గం సుందరీకరణ పనుల కోసం తొలి దశలో రహేజా ఐటీ పార్కు వారు 3 కి.మీ.ల సైక్లింగ్, జాగింగ్‌ ట్రాక్‌ల కోసం రూ.2 కోట్లు సీఎస్సార్‌ కింద ఇచ్చారని, 6 నుంచి 8 మాసాల్లో ఈ పనులు పూర్తవుతాయన్నారు. రెండో దశలో మరో రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్లతో 2 వేల మంది పట్టే యాంపీ థియేటర్‌ తదితర పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top