ఆ ఇద్దరికి మంత్రి పదవులు సాధ్యమేనా?

ఆ ఇద్దరికి మంత్రి పదవులు సాధ్యమేనా? - Sakshi

  •      కొప్పులను మంత్రిని చేస్తానన్న సీఎం

  •      ఇటీవల రసమయిని కేబినెట్‌లోకి తీసుకుంటానని హామీ

  •      ఇప్పటికే జిల్లా నుంచి ఇద్దరు మంత్రుల ప్రాతినిధ్యం

  •      ఈటల, కేటీఆర్ ఇద్దరూ కీలకమైన వారే

  •      మరో ఇద్దరికి ఎలా సాధ్యం?

  •      సిట్టింగ్ మంత్రుల్లో పదవి కోల్పోయేదెవరు?

  •      టీఆర్‌ఎస్‌లో చర్చనీయాంశమైన సీఎం హామీ

  •  సాక్షి ప్రతినిధి, కరీంనగర్ :

     ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్‌ను కేబినెట్‌లోకి తీసుకుంటానంటూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కరీంనగర్ జిల్లా ధర్మారంలో ఆదివారం చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్ నాయకులు, శ్రేణుల మధ్య విస్తృత చర్చకు దారి తీశాయి. సరిగ్గా నెల రోజుల క్రితం రాష్ర్ట సాంస్కృతిక సారథి ఛైర్మన్ రసమయి బాలకిషన్‌ను సైతం కేబినెట్‌లోకి తీసుకుంటానని కేసీఆర్ హామీ ఇచ్చారు. అప్పట్లో హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి కేసీఆర్ హాజైరె  ప్రజలు, మీడియా సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే కొప్పుల ఈశ్వర్, రసమయి బాలకిషన్ ఇద్దరూ కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలే. కొప్పుల ధర్మపురి, రసమయి మానకొండూరు నియోజకవర్గాలకు ప్రాతి నిధ్యం వహిస్తున్నారు. అందులోనూ ఇద్దరు ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వారే. కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఈటల రాజేందర్, పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రిగా కల్వకుంట్ల తారక రామారావు కొనసాగుతున్నారు. ప్రభుత్వంలో, పార్టీలో ఇద్దరూ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నవారే. ఇప్పుడు కొప్పుల ఈశ్వర్, రసమయిలను కేబినెట్‌లోకి తీసుకుంటే ఒకే జిల్లాకు నాలుగు మంత్రి పదవులు ఇవ్వడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఎందుకంటే సీఎంతో కలిపి రాష్ర్ట కేబినెట్ మంత్రుల సంఖ్య 18కి మించకూడదు. ఇప్పటికే ఆ సంఖ్యతో కేబినెట్ కొనసాగుతోంది. అందులోంచి ఇద్దరిని పక్కనపెడితే తప్ప ఈశ్వర్, రసమయిలకు అవకాశం దక్కడం అసాధ్యం. ప్రస్తుతం కేబినెట్‌లో కొనసాగుతున్న ఏకైక ఎస్సీ నేత కడియం శ్రీహరి. కొద్ది నెలల క్రితమే ఆయనకు డిప్యూటీ సీఎం పగ్గాలు అప్పగించారు. ఈ పరిస్థితుల్లో ఆయనను పక్కనపెట్టే అవకాశాలు కనిపించడం లేదు. అయినప్పటికీ కేసీఆర్ ఆ ఇద్దరికీ కేబినెట్ బెర్త్ హామీలు ఇవ్వడం వెనుక ఆంతర్యమేమిటో గులాబీ శ్రేణులకు బోధపడటం లేదు. పార్టీ సీనియర్ నేతలు మాత్రం కేబినెట్‌లో కొత్త వారికి అవకాశం ఇస్తానని సీఎం అన్నారంటే... సరిగా పనిచేయని మంత్రులు తీరు మార్చుకోకుంటే తప్పిస్తానని హెచ్చరికలు పంపడమేనని అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నా మంత్రి పదవి రాలేదని బాధపడుతున్న వారికి కేసీఆర్ వ్యాఖ్యలు టానిక్‌లా ఉపయోగపడతాయని చెబుతున్నారు. కొందరు నేతలైతే కేసీఆర్ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని, గతంలో పలు సందర్భాల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. గత సాధారణ ఎన్నికల సమయంలో ధర్మపురి బహిరంగ సభలో కేసీఆర్ నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి 'కొప్పుల ఈశ్వర్‌ను మీరు గెలిపిస్తే... అధికారంలోకి రాగానే మంత్రిని చేస్తా'నంటూ బహిరంగంగానే హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఆ తరువాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందేననని, ఇప్పటికి రెండుసార్లు కేబినెట్‌లో మార్పులు చేసినా ఈశ్వర్‌కు మాత్రం చోటు దక్కలేదని చెబుతున్నారు.

     పంచాయతీ వ్యవస్థపై సీఎం విమర్శల మర్మమేమి?

     ముఖ్యమంత్రి కేసీఆర్ గత కొద్ది రోజులుగా రాష్ర్టంలో పంచాయతీ వ్యవస్థ దారుణంగా విఫలమైందని బహిరంగ వేదికలపైనే వ్యాఖ్యానిస్తున్నారు. పంచాయతీ అధికారుల పనితీరు ఏమాత్రం బాగోలేదని చెబుతున్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జి ల్లాలో రెండ్రోజులు పర్యటించిన కేసీఆర్ పంచాయతీ వ్యవస్థ దారుణంగా విఫలమైంది. సర్పంచులు, ఎంపీటీసీలు తమ బాధ్యతలను విస్మరించి పైరవీలకోసం పట్టణాలకే పరిమితమవుతున్నారు. పంచాయతీ అధికారుల పనితీ రు ఏమాత్రం బాగోలేదు అని ఘాటుగా వ్యా ఖ్యానించారు. వాస్తవానికి కేసీఆర్ కుమారుడు కల్వకుంట్ల తారకరామారావే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. అయినప్పటికీ ఆ శాఖ పనితీరు ఏమాత్రం బాగోలేదని కేసీఆర్ బహిరంగ వ్యాఖ్యలు చేయడం వెనుక మర్మమేమిటనే దానిపై గులాబీ నేతల్లో చర్చ జరుగుతోంది. కేటీఆర్‌కు పార్టీ పగ్గాలు అప్పగిస్తారని గత కొంత కాలంగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. గత ఏప్రిల్‌లో జరిగిన టీఆర్‌ఎస్ ప్లీనరీలోనే కేటీఆర్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగిస్తూ అధికారికంగా ప్రకటిస్తారని భావించారు. కానీ ఆనాడు కొన్ని రాజకీయ కారణాల వల్ల  కేసీఆర్ తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈసారి కేబినెట్‌లో మార్పులు చేస్తే కేటీఆర్‌ను కేబినెట్ నుంచి తప్పించి కీలకమైన పార్టీ పగ్గాలు అప్పగిస్తారని పేర్కొంటున్నారు. అలాంటప్పుడు కేటీఆర్  నిర్వహిస్తున్న శాఖపై విమర్శలు చేయాల్సిన అవసరమేముందని ప్రశ్నిస్తే తప్పు చేస్తే కుటుంబ సభ్యులెవరైనా ఒకటేనని కేసీఆర్ ఎన్నోసార్లు చెప్పారని, కేబినెట్ సహచరులకు నిరంతరం హెచ్చరికలా పనిచేసేందుకే పంచాయతీరాజ్ శాఖ పనితీరుపై నిర్మొహమాటంగా మాట్లాడుతున్నారని విశ్లేషిస్తున్నారు.

     సామాజిక సమతుల్యం లోపించిన కేబినెట్

     ప్రస్తుత కేబినెట్‌లో సీఎంతో కలుపుకుని 11 మంది అగ్రకులాలకు చెందిన మంత్రులున్నారు. వీరిలో ఆరుగురు రెడ్డి, నలుగురు వెలమ, ఒకరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు. మిగిలిన నలుగురు బీసీలు కాగా, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గానికి చెందిన వారు ఒక్కొక్కరు కొనసాగుతున్నారు. కేసీఆర్ కేబినెట్‌లో ఒక మహిళకు కూడా చోటు దక్కలేదు. మొత్తంగా చూస్తే కేబినెట్‌లో సామాజిక సమతుల్యం లోపించిందని సొంత పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. గిరిజన, మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కేసీఆర్ ఎన్నికల ప్రణాళికలోనే ప్రకటించిన నేపథ్యంలో ఈ సామాజికవర్గాలకు చెందిన చెరో ఇద్దరినీ కేబినెట్లోకి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కేబినెట్‌లో మహిళలకు మూడో వంతు చోటు కల్పించాల్సి ఉన్నప్పటికీ, కనీసం ఒక్క స్థానమైనా దక్కితే చాలని గులాబీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇవన్నీ జరగాలంటే కేబినెట్‌లో ఓసీల సంఖ్యను కుదించాల్సిన అవసరముందని చెబుతున్నారు. అదే జరిగితే ఓసీ మంత్రుల్లో ఎవరికి ఎసరొస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top