ఇదే మెనూ.. చచ్చినట్టు తినూ..


ఖమ్మం: మధ్యాహ్నభోజనం అధ్వానంగా మారింది. ఏదో మొక్కు‘బడి’గా పెడుతున్నారే తప్ప మెనూ..గినూ జాన్తనై. నీళ్లచారు, ముద్ద అన్నం పెట్టి ఇదే మెనూ..చచ్చినట్టు తినూ అనే రీతిలో వండివార్చుతున్నారు. పెట్ట అన్నం కూడా సరిపడా పెట్టడం లేదు. అర్థాకలితోనే విద్యార్థులు అలమటించాల్సి వస్తోంది. అన్నం ఉంటే కూర ఉండదు..కూర ఉంటే అన్న ఉండట్లేదని విద్యార్థులు వాపోతున్నారు. శుచీ శుభ్రతలేని వాతావరణం మధ్య విద్యార్థులు భోజనాలు చేయాల్సి వస్తోంది. చాలా పాఠశాలల్లో వంటగదులు లేవు. పలు పాఠశాలల్లో ఉన్నా శిథిలావస్థకు చేరాయి. విద్యార్థులకు ఎండలోనే వడ్డిస్తున్నారు.



ఒక్కమాటలో చెప్పాలంటే మధ్యాహ్నభోజన పథకం నిర్వహణ ఎవరికీ పట్టనది అయిపోయింది. విద్యాశాఖ ఉన్నతాధికారులు, ప్రధానోపాధ్యాయులు పట్టించుకున్న పాపాన పోలేదు. మామూళ్ల మత్తులో ఉండి వసూళ్లకు పాల్పడుతుంటంతో ఏజెన్సీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. పుచ్చు కూరగాయలు, చౌకబారుగా దొరికేవే రోజూ వండి పెడుతున్నారని, హాస్టల్స్‌లో మధ్యాహ్న భోజనం లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తింటున్నామని విద్యార్థులు వాపోతున్నారు. మధ్యాహ్న భోజనం ఏరోజు మెనూ ఏమిటనే విషయం కూడా పలుపాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలియకపోవడం గమనార్హం.



 అప్పులే మిగిలేది..

 మధ్యాహ్నభోజన పథకంతో తమకు ఒరిగేదేమీ లేదని మరోవైపు నిర్వాహకులు వాపోతున్నారు. గత సంవత్సరం 9, 10 తరగతుల విద్యార్థులకు వండిపెట్టిన డబ్బులు ఇప్పటి వరకు రాలేదని తెలిపారు. అప్పులు చేసి వండి పెడుతున్నామని వంట ఏజెన్సీల నిర్వాహకులు తెలిపారు. పలుచోట్ల వంటగదులు లేకపోవడంతో గాలిదుమారం వచ్చినా ఆరుబయటే, చెట్ల కిందే వంట చేస్తున్నారు. తాగునీటి వసతి లేక పలు పాఠశాలల్లో విద్యార్థులు, వంట నిర్వాహకులు ఇబ్బంది పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ మొత్తం 34,000 పాఠశాలల్లో ఈ పథకం అమలవుతోంది. 1,17,013 మంది ప్రాథమిక, 63,679 మంది యూపీఎస్, 43,453 మంది హైస్కూల్ విద్యార్థులకు మధ్యాహ్నభోజనం అమలవుతోంది.



 నీళ్లచారు..ముద్ద అన్నమే...

 ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా నిర్వాహకులు నీళ్ల చారు.. ముద్ద అన్నమే పెడుతున్నారు. ప్రభుత్వం ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుండి బియ్యం తీసుకోవాల్సిరావడంతో పలువురు డీలర్లు మంచి బియ్యం వారు తీసుకొని ముక్కినవి, తడిసిన బియ్యం పాఠశాలలకు వంపుతున్నారనే విమర్శలు ఉన్నాయి. వీటిని నివారించేందుకు పైయిలెట్‌గా కొన్ని పాఠశాలలను ఎంపిక చేశారు.



 ప్రధానోపాధ్యాయులు బియ్యం తీసుకురావాలని జిల్లా అధికారులు చెప్పినా పలువురు ప్రధానోపాధ్యాయులు వెళ్లడం లేదని తెలుస్తోంది. ఖమ్మం నగరంతోపాటు పలుచోట్ల ఏజెన్సీలకు అప్పగించడంతో పెద్ద మొత్తంలో ఒకే చోట వండుతున్నారు. అది కూడా అధ్వాన్నంగా ఉంటోందని విద్యార్థులు వాపోతున్నారు. వారానికి రెండురోజులకు బదులు ఒకే రోజు గుడ్డు ఇస్తున్నారు.



 తాగునీరు, వంటషెడ్లు లేక ఇబ్బందులు..

 జిల్లాలోని సగానికి పైగా పాఠశాలల్లో తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. వంటగదులు లేకపోవడం, పలు పాఠశాలల్లో వంటగదుల నిర్మాణం అర్థాతరంగా నిలిచిపోవడంతో చెట్ల కిందే వండిపెడుతున్నారు. ఓవైపు పందులు తిరుగుతుంటే మరోవైపు విద్యార్థులు భోజనాలు చేయాల్సి వస్తోంది. పలు పాఠశాలల్లో తాగునీటి కుళాయిల వద్ద అపరిశుభ్రంగా ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top