మొక్కజొన్న కొనుగోళ్లలో గోల్‌మాల్

మొక్కజొన్న కొనుగోళ్లలో గోల్‌మాల్


* మార్క్‌ఫెడ్ అధికారుల హస్తలాఘవం.. 1.70 లక్షల బస్తాలు మాయం

* రైతులకిచ్చింది క్వింటాల్‌కు రూ. 800, రికార్డుల్లో చూపింది రూ. 1,300

* అవకతవకలను గుర్తించిన కేంద్ర గిడ్డంగుల సంస్థ అధికారులు

* అక్రమాలను నిర్ధారించిన జీఎంను రాత్రికి రాత్రే బదిలీ చేసిన ప్రభుత్వం



సాక్షి, హైదరాబాద్: మార్క్‌ఫెడ్ చేసిన మొక్కజొన్న కొనుగోళ్లలో భారీ గోల్‌మాల్ జరిగింది. రైతుల పేరు చెప్పి భారీగా నిధులు మింగేశారు. నాసిరకం మొక్కజొన్నను చౌకగా వ్యాపారుల నుంచి కొని.. రైతుల నుంచి నాణ్యమైన మొక్కజొన్న కొన్నట్లు రికార్డుల్లో చూపించారు. ఆ నాసిరకం మొక్కజొన్నను ‘కేంద్ర గిడ్డంగుల సంస్థ’ గోదాములకు పంపి.. తప్పంతా ఆ సంస్థ మీద నెట్టేయాలని మార్క్‌ఫెడ్ అధికారులు ప్రయత్నించారు. అసలు రైతుల వద్ద కొన్నట్లుగా చూపిస్తున్న లెక్కలకు, కేంద్ర గిడ్డంగులకు చేరిన లెక్కలకు పొంతనే లేదు.



మెదక్ జిల్లాలో మొత్తం 10.02 లక్షల బస్తాలు కొనుగోలు చేయగా.. గోదాములకు చేరింది 8.33 లక్షల బస్తాలే. అంటే దాదాపు 1.7 లక్షల బస్తాల జాడ లేదు. కేంద్ర గిడ్డంగుల సంస్థ అధికారులు మేల్కొనడంతో గోల్‌మాల్ వ్యవహారం బయటపడింది. నాసిరకం మొక్కజొన్నను తమ గిడ్డంగులకు పంపించారని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ‘కేంద్ర గిడ్డంగుల సంస్థ (సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్) ఇటీవల మార్క్‌ఫెడ్ ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించింది.



అవాక్కయ్యే వాస్తవాలు..

మార్క్‌ఫెడ్ సేకరించిన మొక్కజొన్నను కేంద్ర గిడ్డంగుల సంస్థ గోదాముల్లో నిల్వ చేస్తారు. అయితే తమ గోదాముల్లో నాసిరకం సరుకు నిల్వ ఉండటాన్ని గుర్తించిన అధికారులు.. మొత్తం వ్యవహారంపై విచారణ చేశారు. మొక్కజొన్న కొనుగోళ్లలో భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయని గుర్తించారు. మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసినట్లుగా చెబుతున్న 1.70 లక్షల బస్తాల మొక్కజొన్న అసలు గోదాములకే రాలేదని విచారణలో తేలింది.



నేరుగా రైతుల నుంచి ఇందిరా క్రాంతి పథం(ఐకేపీ) సంఘాల ద్వారా మొక్కజొన్నను సేకరించాలనే నిబంధనను మార్క్‌ఫెడ్ అధికారులు ఉల్లంఘించి.. మెదక్ జిల్లాలో దళారుల నుంచి సేకరించినట్లు గుర్తించారు. రైతులు, వ్యాపారుల నుంచి రూ. 800కు క్వింటాల్ చొప్పున కొనుగోలు చేసి.. రూ. 1,300 చొప్పున నాణ్యమైన సరుకు కొనుగోలు చేసినట్లుగా రికార్డుల్లో చూపినట్లు గుర్తించారు. ఐకేపీ సంఘాలు కొనుగోలు చేసినట్లుగా చెబుతున్న దానికి, మార్క్‌ఫెడ్ అధికారులు చెబుతున్న లెక్కలకు కూడా పొంతన లేదని కూడా వెల్లడైంది.



ముందే 60 లారీల సరుకు తిరస్కరణ..

నాసిరకం మొక్కజొన్నలను నాణ్యమైన సరుకుగా పేర్కొని తమ గోదాముల్లో నిల్వ చేయడం కోసం మార్క్‌ఫెడ్ అధికారులు పక్కా ప్రణాళికతో కుట్ర చేశారని కేంద్ర గిడ్డంగుల సంస్థ అధికారులు మార్క్‌ఫెడ్ ఉన్నతాధికారులకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. ‘లారీల్లో నాలుగువైపులా నాణ్యమైన మొక్కజొన్నతో కూడిన బస్తాలను ఉంచి.. లోపల నాణ్యత లేని సరుకును పెట్టి పంపిస్తున్నారు. అసలే సిబ్బంది కొరత ఉన్న మాకు.. అన్ని లారీలను, అన్ని బస్తాలను తనిఖీ చేయడం సాధ్యం కాదు. ఉన్నంతలో మేం తనిఖీ చేసి మార్క్‌ఫెడ్ పంపిన వాటిలో 60 లారీల నాసిరకం సరుకును గుర్తించి తిరస్కరించాం. మిగతా వందలాది లారీల్లోనూ నాసిరకం సరుకే మా గోదాములకు చేరింది. దీనిపై మార్క్‌ఫెడ్ జిల్లా అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన రాలేదు. అందుకోసం మార్క్‌ఫెడ్ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకొస్తున్నాం..’ అని ఆ నివేదికలో వెల్లడించారు.



మార్గదర్శకాలను పట్టించుకోలేదు...

మొక్కజొన్న సేకరణ కోసం జారీ చేసిన మార్గదర్శకాలను మార్క్‌ఫెడ్ అధికారులు పాటించలేదని గిడ్డంగుల సంస్థ తమ నివేదికలో పేర్కొంది. మొక్కజొన్న సేకరణకు ముందే గన్నీ బ్యాగులు, హమాలీల రేట్లకు సంబంధించి ప్రక్రియ ప్రారంభించాలని రాష్ట్ర కార్యాలయం స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చినా.. జిల్లా మేనేజర్ చాలా ఆలస్యం చేశారని ఎత్తిచూపింది.



రవాణాకు సంబంధించి కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లో ట్రాక్టర్లు, టెంపోలు వినియోగించినందున తక్కువ రవాణా చార్జీలు చెల్లించారంటూ జిల్లా పాలనా యంత్రాంగాన్ని కావాలనే తప్పుదోవ పట్టించారని నివేదికలో స్పష్టం చేసింది. గిడ్డంగులకు పంపించిన మొక్కజొన్నకు సంబంధించిన వివరాలను ట్రక్కుల వెంట జిరాక్స్ కాపీలపై ఇచ్చి పంపించడం నిబంధనలకు విరుద్ధమని.. అలాంటి వాటిని గిడ్డంగుల్లో అనుమతించడానికి వీల్లేకపోయినా తీసుకున్నారని పేర్కొంది. గన్నీ బ్యాగుల నాణ్యతా ఏమాత్రం పెరగకపోయినా.. ధరలు మాత్రం పెంచేశారని వివరించింది.



రాత్రికి రాత్రే జీఎం బదిలీ..

రాష్ట్ర విభజన తర్వాత మార్క్‌ఫెడ్‌నూ విభజించారు. రెండు మార్క్‌ఫెడ్‌లకు కలిపి ఒకే ఎండీ ఉన్నా... తెలంగాణ మార్క్‌ఫెడ్ జనరల్ మేనేజర్‌గా సహకార శాఖ అధికారి కిరణ్మయిని ప్రభుత్వం నియమించింది. మొక్కజొన్న కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగిందని రికార్డుల పరిశీలనలో ఆమె గుర్తించారు. ఈ గోల్‌మాల్‌ను బయటపెట్టి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని భావించారు. మెదక్ జిల్లాకు ఆకస్మిక తనిఖీకి వెళ్లిన జనరల్ మేనేజర్... గతేడాది కొనుగోళ్లలో జరిగిన గోల్‌మాల్‌తో పాటు ప్రస్తుతం జరుగుతున్న కొనుగోళ్లలోనూ అవకతవకలు జరుగుతున్నాయని నిర్ధారించారు.



ఈ మేరకు రూపొందించిన నివేదికను మార్క్‌ఫెడ్ ఉన్నతాధికారులకు సమర్పించారు. బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు కూడా. అయితే నివేదిక సమర్పించిన రోజే ఆమె మార్క్‌ఫెడ్ నుంచి బదిలీ కావడం గమనార్హం. ఆమె సమర్పించిన నివేదిక, అందుకు సంబంధించిన రికార్డులనూ మార్క్‌ఫెడ్ అధికారులు మాయం చేశారు. ఈ గోల్‌మాల్ నుంచి తప్పించుకోవడానికి మార్క్‌ఫెడ్ అధికారులు గట్టిగా ప్రయత్నాలు చేశారు. ఎలాంటి ఆధారాలూ లభించకుండా తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. ప్రభుత్వ పెద్దలకూ ఈ భారీ గోల్‌మాల్ గురించి తెలుసని... అందుకే గోల్‌మాల్‌ను బయటపెట్టాలని చూసిన జీఎంను బదిలీ చేశారని సమాచారం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top