పాలమూరు ఆత్మహత్య ఘటనపై విచారణ

పాలమూరు ఆత్మహత్య ఘటనపై విచారణ - Sakshi


ఆసుపత్రి సందర్శించిన కలెక్టర్

విచారణ అధికారిగా అదనపు జేసీ

మృతదేహాలతో ఆస్పత్రి ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన

 

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్ర ఆసుపత్రి సిబ్బంది మామూళ్ల వేధింపులకు తాళలేక ఓ వ్యక్తి తన రెండేళ్ల కూతురు హర్షితతో పాటు ఆత్మహత్య చేసుకున్న ఘటన అధికార యంత్రాంగాన్ని కుదిపేసింది. ఆత్మహత్య వార్త మీడియాలో విస్తృతంగా రావడంతో కలెక్టర్ టీకే శ్రీదేవి శుక్రవారం ఉదయం ఆసుపత్రిని సందర్శించారు. ఘటనకు దారి తీసిన పరిస్థితులపై విచారణ జరపాల్సిందిగా ఇన్‌చార్జి జేసీ రాజారాంను ఆదేశించారు. నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జాయింట్ కలెక్టర్ రాజారాం ఆసుపత్రి సిబ్బంది, వైద్యుల నుంచి లిఖిత పూర్వకంగా వివరణ తీసుకున్నారు. ఆసుపత్రి సిబ్బంది తీరుపై విమర్శలు వెల్లువెత్తడంతో సూపరింటెండెంట్ ప్రత్యేక సమావేశం నిర్వహించి రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.

 

 చెన్నకేశవులు భార్యకు ప్రభుత్వపరంగా రెవెన్యూ అధికారులు రూ.10వేలు ఆర్థికసాయం అందించారు. మరోవైపు వివిధ పార్టీల నేతలు కూడా ఆసుపత్రిని సందర్శించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాగా, బాధిత కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు, ఆత్మహత్యకు కారకులైన ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటూ చెన్నకేశవులు బంధువులు, సీపీఎం కార్యకర్తలతో కలసి ఆసుపత్రి ఎదుట మృతదేహాలతో ధర్నా చేపట్టారు. కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించేందుకు మాజీ ఎంపీ మల్లురవి క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. అక్కడ కలెక్టర్‌కు, ఆయనకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

 

 ఆత్మహత్యగా కేసు నమోదు

 కూతురుతో సహా రైలు కింద పడి చెన్నకేశవులు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై మహబూబ్‌నగర్ రైల్వేపోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం శుక్రవారం బంధువులకు మృతదేహాలు అప్పగించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top