వడపోత షురూ..


ముకరంపుర : ఆహారభద్రత, పెన్షన్ల దరఖాస్తుల పరిశీలన వడపోత కార్యక్రమం ప్రారంభమైంది. శుక్రవారం నుంచి అధికారులు ఇంటింటికి వెళ్లి వివరాలను అడిగి నమోదు చేసుకున్నారు. ఆహారభద్రత, పెన్షన్ల దరఖాస్తులు పరిశీలించేందుకు మండలానికి ఆరుగురితో విచారణ కమిటీవేశారు. తహశీల్దార్, ఎంపీడీవో, ఆర్‌ఐ, సీనియర్ అసిస్టెంట్, ఈవోఆర్డీ, ఐకేపీ సిబ్బంది ఒకరు కమిటీలో ఉంటారు. ప్రభుత్వ విధించిన నిబంధనలతో ఎక్కడ అర్హత కోల్పోతామోననే భయాందోళన ప్రజల్లో సర్వత్రా నెలకొంది.



ఆహారభద్రత, పెన్షన్ల దరఖాస్తులను పరిశీలించడంలో అధికారులకు తలకు మించిన భారమవుతోంది. ఓ పక్క సమయం తక్కువగా ఉండడం.. దరఖాస్తులు అధిక సంఖ్యలో రావడంతో వాటి పరిశీలన, స్వీకరణ అనేది కష్టతరమవుతోంది. ఈ మేరకు సర్కార్ పునరాలోచనలో పడి ప్రజల అభ్యర్థన మేరకు ఈ నెల 20వరకు దరఖాస్తుల సమర్పణకు గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గడువు పెంపుతో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశాలున్నాయి.



ఇంటింటి పరిశీలన

ప్రభుత్వ నిర్ణయం మేరకు ఈ నెల 10 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తుల స్వీకరణకు ముందస్తుగా ఈ నెల 15 వరకే గడువు విధించినప్పటికీ మరో 5 రోజులు పెంచారు. అయితే తుది నివేదిక సిద్ధం చేసే సమయాన్ని మాత్రం యథావిధిగానే ఉంచారు. ఈ ప్రక్రియలో భాగంగా శుక్రవారం నుంచి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఈ నెల 26వరకు విచారణ పూర్తి చేయనున్నారు. ఇచ్చిన దరఖాస్తుల ఆధారంగా విచారణ అధికారులు ఇంటింటికీ వెళ్లి సమగ్ర కుటుంబ సర్వే నివేదిక, ఓటరు జాబితా, అతిపేదల నివేదికతో దరఖాస్తులను పరిశీలించి అర్హతను నిర్ణయించుకుంటున్నారు.



ఆధార్‌కార్డు రానివారు విచారణ అధికారులకు యూఐడీ నంబర్ ఇస్తే సరిపోతుందని జిల్లా అధికారులు చెబుతున్నారు. అది కూడా లేకుంటే సంబంధిత మనిషి ఉన్నట్లయితే ఆధార్ అందలేదని రాసుకుంటారని డీఎస్‌వో చంద్రప్రకాశ్ తెలిపారు. అధికార ఆధార్‌కార్డు ఎక్కడిదైనా పరిగణలోకి తీసుకుంటామని చెబుతున్నారు. విచారణ ప్రక్రియ ఈ నెల 26తో ముగియనుండగా 30వరకు నివేదికలు సిద్ధం చేయనున్నారు.

 

1 నుంచి పట్టణాల్లో...

నవంబర్ 1 నుంచి పట్టణాల్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. నవంబర్ 1నుంచి 7 వరకు దరఖాస్తుల స్వీకరణ, 7నుంచి 15 వరకు పరిశీలన, 16 నుంచి 20 వరకు అర్హుల జాబితా రూపకల్పన, 21న తుది జాబితాను కలెక్టర్‌కు నివేదించనున్నారు.

 

వీరు అనర్హులు

ప్రజల వాస్తవ జీవన ప్రమాణాలు, స్థితిగతులను పరిశీలించనున్నారు.

ఆదాయపు పన్ను చెల్లించువారు, నాలుగు చక్రాల వాహనాలు గల వారు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు నెలసరి జీతం పొందేవారు..

నెలకు 300 యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగదారులు.

గత 3సంవత్సరాలుగా లక్షకు పైగా బ్యాంకు రుణాలు తీసుకున్న వారు.

ఐదెకరాలకుపైగా భూమి ఉన్న వారు. 2.5 ఎకరాల తరి ఉన్నవారు.

పెద్దవ్యాపారాలు చేసేవారు(ఆయిల్‌మిల్,రైస్‌మిల్, పెట్రోల్‌పంపు, దుకాణ యజమానులు)

విచారణ అధికారులు ఎంక్వైరీలో స్వతంత్రంగా వ్యవహరించే అధికారాలిచిచ్చారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top