టీటీడీపీలో అంతర్గత కుమ్ములాటలు..!

టీటీడీపీలో అంతర్గత కుమ్ములాటలు..! - Sakshi


సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు ముదిరి పాకాన పడ్డాయి. ముఖ్యనేతల మధ్య ఆధిపత్య పోరు పార్టీని అతలాకుతలం చేస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల్లో వీరిద్దరిలో ఎవరిని సమర్థించాలో, ఎవరితో పాటు కలసి ముందుకు సాగాలో తెలియక నాయకులు, కార్యకర్తలు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు.



మరోవైపు ప్రస్తుతం పార్టీ సాగుతున్న తీరు, మొక్కుబడిగా పార్టీ కార్యక్రమాల నిర్వహణ వంటి వాటి పట్ల పలువురు నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నవారికి తగిన ప్రోత్సాహం, గుర్తింపు లభించకపోవడం పట్ల సీనియర్ నేతల్లో నిరాశా నిస్పృహలు వ్యక్తమవుతున్నాయి.  

 

రేవంత్ తీరుపై సీనియర్ల కినుక...

పార్టీలో రేవంత్‌రెడ్డికి పెరుగుతున్న ప్రాధాన్యం పట్ల రాష్ట్రస్థాయి ముఖ్యనేతలు, జిల్లాస్థాయిల్లోని నాయకులు సైతం కినుక వహిస్తున్నారు. రేవంత్‌రెడ్డి దుందుడుకు వైఖరి, ఆయా సమస్యలు, అంశాలపై స్పందిస్తున్న తీరును కూడా పార్టీ నాయకులు తప్పుబడుతున్నారు. ఓటుకు కోట్లు కేసులో ముఖ్యనేతలు పీకల్లోతు కూరుకుపోయి తెలంగాణలో పార్టీకి రాజకీయ మనుగడ ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యాన్ని సైతం పార్టీ నాయకులు గుర్తు చేసుకుంటున్నారు.



మహబూబ్‌నగర్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం తదితర జిల్లాల్లో ముఖ్యనేతలు, సీనియర్ నాయకులు సైతం తమ రాజకీయ భవితవ్యంపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అటు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు అవకాశం లేక.. ఇటు కాంగ్రెస్‌లోనో, బీజేపీలోనో చేరలేక మల్లగుల్లాలు పడుతున్నారు. పార్టీలో తమ రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మా రడంతో రాబోయే రోజుల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదనే కోణంలో ముఖ్యనాయకుల్లో తీవ్రమైన అంతర్మథనం సాగుతోంది.

 

జిల్లాస్థాయిల్లోనూ లుకలుకలు


కష్టకాలంలో పార్టీ వెంట ఉండి నడుస్తున్నా, క్రమం తప్పకుండా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా జిల్లాస్థాయిల్లో ఎదగకుండా పార్టీ ముఖ్యనేతలు ఎక్కడికక్కడ నియంత్రించడం పట్ల కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల తెలుగు యువతతో పాటు వివిధ అనుబంధ రాష్ట్ర కమిటీల ఏర్పాటు, ఆయా పదవుల నియామకాల్లో సీనియర్లకు తగిన ప్రాధాన్యం లభించకపోవడం పట్ల పార్టీలో అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా రగులుతోంది. పెద్ద సంఖ్యలో కార్యవర్గంతో ఏర్పాటు చేసిన ఈ ‘జంబో కమిటీ’ల్లోనూ పార్టీని నమ్ముకున్న వారికి తగిన గౌరవం లభించక అంతర్గతంగా పార్టీలో నిరసన పెల్లుబుకుతోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top